దీక్షా దివస్.. తెలంగాణను నిలబెట్టిన దీక్ష

kcrఆ దీక్ష.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ గతిని మార్చేసింది. ఊరూవాడను ఏకం చేసింది. నాలుగున్నర కోట్ల గొంతుకలు ఒక్కటై.. తెలంగాణ ఆకాంక్షను ఢిల్లీకి ఎలుగెత్తేలా చేసింది. 60 ఏళ్ల స్వరాష్ట్ర ఉద్యమాన్ని లక్ష్యసాధన దిశగా తీసుకెళ్లింది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతగా….2009 నవంబర్ 29న ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు పెట్టిన ఆమరణ దీక్ష.. మలి దశ ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచింది. ఇవాల్టితో ఆ దీక్షకు..ఎనిమిదేండ్లు నిండాయి.

2009.. మలి దశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయం. ఉద్యమాన్ని ఉమ్మడి సర్కారు నిర్దాక్షిణ్యంగా అణగదొక్కుతున్న సందర్భం. ఈ ఆగడాలను అడ్డుకునేందుకు.. అరవై ఏళ్ల స్వరాష్ట్ర కల సాకారం చేసుకునేందుకు.. నవంబర్ 29.. 2009న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరవధిక నిరాహార దీక్ష మొదలు పెట్టారు. కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి దీక్షకు సిద్ధమయ్యారు. మెదక్ జిల్లా సిద్ధిపేట దగ్గర రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షా స్థలికి వాహనంలో బయల్దేరారు.

కేసీఆర్ ఉన్న వాహనం కరీంనగర్ మానేరు బ్రిడ్జ్ దాటి అలుగునూరు చౌరస్తా చేరుకుంది. అప్పటికే వచ్చేసిన పోలీసు బలగాలు, రిజర్వ్ పోలీస్ బెటాలియన్లు.. కేసీఆర్ వాహనాన్ని చుట్టుముట్టాయి. వాహనం నుంచి బలవంతంగా కిందకి దించడంతో.. రోడ్డుమీదే ధర్నాకు దిగారు కేసీఆర్. అక్కడి నుంచి పోలీసులు ఖమ్మం తీసుకెళ్లడంతో.. జైల్లోనే గులాబీ అధినేత దీక్ష మొదలు పెట్టారు. ఆరోగ్యం క్షీణించడంతో… కేసీఆర్ ను హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. డాక్టర్లు వద్దంటున్నా… నిమ్స్ లో కూడా దీక్ష చేసిన కేసీఆర్… కేంద్రం దిగి వస్తేనే వెనక్కు తగ్గుతానని స్పష్టం చేశారు.

కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న సమాచారంతో… తెలంగాణలో అగ్గి రాజుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఉరకలెత్తింది. కాకతీయ విశ్వవిద్యాలయం కదం తొక్కింది. శాతవాహన శివాలెత్తింది. పోలీసులు రబ్బరు బుల్లెట్లు వదిలినా.. బాష్పవాయు గోళాలు పేల్చినా విద్యార్థులు పిడికిలి దించలేదు. డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, మేధావులు, రాజకీయ నాయకులు, టీచర్లు, విద్యార్థులు. నాలుగున్నర కోట్ల గొంతుకలు ఒక్కటయ్యాయి. 10 జిల్లాల్లో ఎటు చూసినా జై తెలంగాణ నినాదమే వినిపించింది. వరుస బంద్ లతో బస్సులు, రైళ్లు స్తంబించిపోయాయి.

పరిస్థితి చేయి దాటుతుండడంతో.. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య.. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రానికే కట్టుబడి ఉన్న సీపీఎం తప్ప.. మిగిలిన అన్ని పార్టీలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించాయి. ఇదే విషయం స్పష్టం చేస్తూ… ఢిల్లీకి నివేదిక కూడా ఇచ్చాయి. చివరికి కేసీఆర్ దీక్ష ప్రారంభించిన 12 రోజులకు.. సరిగ్గా డిసెంబర్ 9.. 2009న కేంద్రం దిగొచ్చింది. తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ఆ రోజు అర్థరాత్రి.. అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం అనౌన్స్ చేశారు. ఈ ప్రకటనతో..యావత్ తెలంగాణ పులకించిపోయింది. ఆందోళన స్థానంలో హర్షాతిరేకాలు చేరాయి. ధర్నాలు, నిరసన స్థానంలో సంబరాలు, విజయోత్సవాలు కనిపించాయి.

ఒక్క రోజులోనే సీన్ పూర్తిగా మారిపోయింది. తెలంగాణ ప్రకటనను అడ్డుకునేందుకు.. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలతో ఒక్కటయ్యారు.  సీమాంధ్ర నేతల తీరుతో కేంద్రం కూడా వెనక్కి తగ్గింది. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పెండింగ్ లో పెట్టింది. కానీ…ఈ ఆలస్యమే తెలంగాణ ఉద్యమకారుల్లో మరింత ఉద్రేకాన్ని రగిల్చింది. ఫైనల్ గా…అన్ని వర్గాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy