దీర్ఘాయుష్మాన్ భవ !

exerisicగతంతో పోలిస్తే తెలుగు ప్రజల ఆయు ప్రమాణం పెరిగింది. జాతీయస్థాయిలో మన సగటు జీవితకాలం ఎక్కువగా ఉన్నట్లు ఒక తాజా నివేదిక వెల్లడయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో పురుషులతో పోలిస్తే మహిళల సగటు జీవితకాలం కనీసం మూడేళ్లు అధికంగా ఉందని కూడా తెలిపింది. ఇక 1990 నాటితో పోలిస్తే భారతీయుల జీవితకాలం అంచనా దాదాపు పదేళ్లు పెరిగిందని పేర్కొంది. ‘మనదేశంలో రాష్ట్రాల స్థాయిలో వ్యాధుల భారం’ పేరుతో భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌), భారత ప్రజారోగ్యసంస్థ(పీహెచ్‌ఎఫ్‌ఐ) సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదికను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం ఢిల్లీలో విడుదల చేశారు. సగటు ఆయుర్దాయం ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలో అధికంగా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. 26 ఏళ్లక్రితం వరకు దేశంలో అంటువ్యాధులు పెను దుష్ప్రభావం చూపాయని, అయితే ప్రస్తుతం జీవనశైలితో వచ్చే వ్యాధులు ప్రాణాంతకంగా  మారుతున్నాయని వివరించింది ఆ నివేదిక.

నివేదికలోని ప్రధానాంశాలు
– 1990 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో మహిళల సగటు ఆయుర్దాయం 58.4 ఏళ్లుకాగా.. 2016 నాటికి 71.9 ఏళ్లకు పెరిగింది. పురుషుల ఆయుర్దాయం 57.7 ఏళ్ల నుంచి 67.3 ఏళ్లకు చేరుకుంది.
– ఏపీలో పౌష్టికాహారలోపం సమస్య భారీగా తగ్గింది. 1990లో ఈ సమస్య 36.9 శాతంగా ఉండగా 2016 నాటికి 11.7 శాతానికి తగ్గింది. పొగాకు వినియోగం 2 శాతం పెరిగింది. అధిక రక్తపోటు సమస్య 4.4 శాతం నుంచి 10.5 శాతానికి, కొలెస్టరాల్‌ సమస్య 2.3 శాతం నుంచి 5.9 శాతానికి, ఊబకాయం సమస్య 0.6 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది.
– రాష్ట్రంలో ఆహార సంబంధిత ముప్పు, మధుమేహం, వృత్తి సంబంధిత ముప్పు, మద్యం, మాదకద్రవ్యాల వినియోగ సంబంధిత వ్యాధులు బాగా పెరిగాయి. నీరు, వాయుకాలుష్య సంబంధిత సమస్యలు తగ్గాయి.
– 1990లో తెలంగాణ మహిళల సగటు జీవితకాలం 61.8 ఏళ్లుండగా ప్రస్తుతం 73.2 ఏళ్లకు పెరిగింది. పురుషుల ఆయుర్దాయం 60.2 ఏళ్ల నుంచి 69.4 ఏళ్లకు చేరింది.
– 26 ఏళ్ల క్రితంతో పోలిస్తే తెలంగాణలో గుండె, శ్వాసకోశ, స్వీయహాని, రక్తహీనత, రహదారి ప్రమాద గాయాలు, వెన్ను, మెడనొప్పులు, మైగ్రేన్‌, కుంగుబాటు, మధుమేహ సంబంధిత వ్యాధుల తీవ్రత పెరిగింది. డయేరియా, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, నెలలు నిండకముందే కాన్పులు, తట్టు, మెదడువాపు, క్షయ, పుట్టుకతోవచ్చే సమస్యలు తగ్గాయి. నీరు, వాయుకాలుష్యం, పొగాకు వినియోగం, వృత్తిసంబంధమైన ముప్పులు తగ్గాయి.

దేశవ్యాప్త గణాంకాలివీ..
– గత 26 ఏళ్లలో భారతీయుల సగటు ఆయుర్దాయం దాదాపు పదేళ్లు పెరిగింది. 1990లో 59.7 ఏళ్లుగా ఉన్న మహిళల సగటు ఆయుర్దాయం.. 2016 నాటికి 70.3 ఏళ్లకు పెరిగింది. పురుషుల జీవితకాలం అంచనా 58.3 ఏళ్ల నుంచి 66.9 ఏళ్లకు చేరింది. ఈ అంశంలో రాష్ట్రాల మధ్య అంతరాలు హెచ్చుగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మహిళల సగటు ఆయుర్దాయం 66.8 ఏళ్లు, పురుషుల ఆయుర్దాయం 63.6 ఏళ్లుండగా.. కేరళలో ఇది వరుసగా 78.7 ఏళ్లు, 73.8 ఏళ్లుగా ఉంది.
– 1990తో పోలిస్తే అన్ని రాష్ట్రాల్లో 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు బాగా తగ్గాయి. అయితే కేరళతో పోలిస్తే అసోం, ఉత్తర్‌ప్రదేశ్‌లలో శిశుమరణాలు నాలుగురెట్లు అధికంగా ఉన్నాయి.
– 1990 నాటితో పోలిస్తే 2016 నాటికి రహదారి ప్రమాదాల బాధితుల సంఖ్య మూడురెట్లు, ఆత్మహత్య బాధితుల సంఖ్య 6 రెట్లు పెరిగింది.
– పిల్లలు, బాలింతల్లో పౌష్టికాహారలోపం 1990తో పోలిస్తే బాగా తగ్గింది. అయినా ఇప్పటికీ దాని ప్రభావం గణనీయంగానే ఉంది. 2016లో మొత్తం వ్యాధుల భారంలో 15 శాతం వాటా పౌష్టికాహారలోపానిదే.
– వాయుకాలుష్య తీవ్రత ఇప్పటికీ అధికంగానే ఉంది. వంట చెరకు వినియోగం తగ్గడంతో ఇళ్ల నుంచి వెలువడే పొగ తగ్గినా, బహిరంగప్రాంతాల్లో వ్యాయుకాలుష్యం మాత్రం పెరుగుతోంది. విద్యుదుత్పత్తి, పారిశ్రామికీకరణ, వాహనాల వినియోగం, నిర్మాణపనులు, వ్యర్థాల కాల్చివేత వంటివి అధికమవ్వడం ఇందుకు ప్రధాన కారణం.

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy