దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోంది : మోడీ

దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. ఆర్థిక వృద్ధి రేటు పెరిగింది. ఉద్యోగాలు పెరిగాయి. దేశ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు ప్రధాని మోడీ. ఆదివారం (ఆగస్టు-12) ఓ జాతీయ దినపత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రభుత్వ ప్రగతిని వివరించారు. అయితే.. అపోజిషన్ పార్టీలు మాత్రం అంతా వట్టిదే అంటున్నాయి. ఏడాది కాలంలో దేశంలోని యువతకు భారీగా ఉద్యోగాలు కల్పించామన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వ పనితీరు, సాధించిన ప్రగతిని వివరించారు. ఉపాధి కల్పనలో విఫలమయ్యారంటూ అపోజిషన్ చేస్తున్న విమర్శలను మోడీ తిప్పికొట్టారు. 2017 సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ 2018 మధ్య 45 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. అలాగే.. ప్రభుత్వ రంగంలో 70 లక్షల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. ప్రైవేటు రంగంలోనూ భారీగా ఉద్యోగాల భర్తీ జరిగిందని చెప్పారు. విపక్షాలపైనా విమర్శలు చేశారు ప్రధాని. మహాకూటమి ఒక విఫల ఆలోచన అన్నారు. 2014 కంటే ఎక్కువ ఓట్లతో రాబోయే ఎన్నికల్లో గెలవబోతున్నామని చెప్పారు. గో రక్షణ పేరుతో జరుగుతున్న దాడులను ఖండిస్తున్నానన్నారు మోడీ. దాడులు చేస్తున్న వారి లక్ష్యం ఏదైనా.. అది కచ్చితంగా నేరమే అవుతుందన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై చర్యలుంటాయన్నారు.

మహాకూటమి విఫల ప్రయోగమన్న మోడీ కామెంట్స్ ను తప్పుపట్టారు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. ప్రధాని పదవిలో ఉన్న మోడీ.. ఓ కాలేజీ విద్యార్థి సంఘం నాయకుడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో అసలు విషయం తెలుస్తుందన్నారు. ప్రధాని మోడీ భ్రమలో ఉన్నారని విమర్శించారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఉద్యోగాలు కల్పించడంలో సర్కారు విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై యువత అసహనంతో ఉన్నారని చెప్పారు ఒవైసీ. యువతకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు దొరకడం లేదన్నారు సీపీఐ ఎంపీ డీ.రాజా. స్వయంగా నీతీ ఆయోగ్.. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు మాత్రం.. అపోజిషన్ విమర్శలను కొట్టి పారేస్తున్నారు. దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని ప్రపంచమంతా తెలిసిందని.. రాజకీయ లబ్ది కోసమే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు.
..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy