దేశం గర్వించే రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి: సీఎం కేసీఆర్ 


తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలం లోనే  అనూహ్యమైన ప్రగతిని నమోదు చేసిందన్నారు సీఎం కేసీఆర్. 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా  గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేశారు. తెలంగాణా రాష్ట్ర ప్రజలందరికీ  భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్రంలో చారిత్రాత్మకమైన గోల్కొండ  కోట మీద వరుసగా ఐదవసారి జాతీయ పతాకాన్ని  ఎగురవేస్తున్నందుకు గర్విస్తున్నానని తెలిపారు. ఇవాళ యావత్ దేశానికి ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాను అందించిందన్నారు. సమైక్య రాష్ట్రంలో కుదేలైన రంగాలాన్నీ ఇప్పుడు  పునరుత్తేజం పొందాయి. మనిషి కేంద్రంగారూపొందిన ప్రణాళికలు పేద వర్గాలకు చేయూత ఇచ్చి నిలబెడుతున్నాయన్నారు.  సంక్షేమ పథకాలు అణగారిన వర్గాలకు అండదండలు కల్పిస్తున్నాయని… సకల రంగాలలో వేగంగా పురోగమిస్తున్న తెలంగాణా ఆనతి కాలంలోనే  దేశం గర్వించే రాష్ట్రంగా  గుర్తింపు పొందిందన్నారు. తనను తాను నిర్మించుకుంటూ జాతి నిర్మాణానికి  దోహదం చేస్తుందన్నారు.

అంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణా ప్రభుత్వం  ఎంతో పరిణతితో వ్యవహరించిందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇటీవల పార్లమెంటులో చెప్పిన మాటలను గుర్తు చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడంలోనే సంపూర్ణంగా నిమగ్నమైందని, స్వయంగా ప్రకటించారు. వారు చెప్పినట్లుగానే మనం చిల్లర మల్లర రాజకీయాలతోనో , వ్యర్థ వివాదాలతోనో  పొద్దు పుచ్చలేదన్నారు. ఈ నాలుగేళ్లు విలువైన సమయాన్ని తెలంగాణ భవిష్యత్తుకు తగిన అభివృద్ధి  ప్రాతిపదికలు నిర్మించేందుకు సమర్థవంతంగా వినియోగించుకున్నామన్నారు.

తెలంగాణాలో  వ్యవసాయ రంగాన్ని పటిష్ట పరిచే దిశగా ప్రభుత్వం నిర్మాణాత్మకమైన చర్యలు  తీసుకుందన్నారు. సమైక్య రాష్ట్రం లో రైతుల పరిస్థితి  అగమ్య గోచరంగా అత్యంత దయనీయంగా ఉండేది.  నదీ జలాల పంపిణీలో అన్యాయం, ప్రాజెక్టుల నిర్మాణంలో వివక్ష,  సాగునీటికి తాగునీటికి తీవ్రమైన కట కట.శిథిలమై పోయిన చెరువులు, ఎండిన బావులు,  వెయ్యి మీటర్ల లోతున  బోరు వేసినా చుక్క నీరు పడని దుస్థితి అలుముకుని ఉండేది. నిత్యం కరువు కాటకాలు. పడావు పడ్డ భూములు. పాడయి పోయిన పల్లెలు. వలస బాట పట్టిన ప్రజలు.  ఎప్పుడన్నా కాలం కరుణిస్తే, అద్దెకరమో ఎకరమో పంట వేసుకుంటే … రెండు మూడు గంటలు కూడా కరెంటు రాక  పంటలు ఎండిపోయేవి. దిక్కు తోచని స్థితిలో రైతులు ఎండిన పంటను కాలబెట్టిన  సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. చివరికి ఎక్కడా దారి కానరాక తెలంగాణా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఈ దశలో వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించి, రైతులలో ఆత్మ విశ్వాసం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది.  ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముందుగా 17 వేల కోట్ల వ్యవసాయ  రుణాలను మాఫీ చేసి, రాష్ట్రంలోని 35.29 లక్షల మంది రైతులకు ఉపశమనం కలిగించింది. సమైక్య రాష్ట్రంలో ఎగబెట్టిన ఇన్ పుట్ సబ్సీడీలను తెలంగాణ ప్రభుత్వం  సత్వరమే చెల్లించింది. వ్యవసాయ ట్రాక్టర్ల కు రవాణా పన్ను రద్దు చేసింది. నాటి పాలకులు   ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి  కేవలం లక్షన్నర రూపాయలు పరిహారం చెల్లించి  చేతులు దులుపుకునేవారు. కానీ  తెలంగాణ ప్రభుత్వం ఒక వైపు శాశ్వత పరిష్కార చర్యలుచేపడుతూనే  మరోవైపు   ఆత్మహత్య చేసుకున్న రైతులకుటుంబాలకు  ఇచ్చే పరిహారాన్నిఆరు లక్షలకు  పెంచింది. గత పాలకుల హయాంలో ఎరువులు విత్తనాల కోసం రైతులు నానా అగచాట్లు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం ఆ పరిస్థితిని నివారించింది. సకాలంలో ఎరువులు, విత్తనాలను సరఫరా చేస్తోందన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy