దేశభక్తికి నిలువుటద్దం ఆ గ్రామం

ఆ గ్రామం మూడు రాష్ట్రాల కూడలి. భిన్న సంస్కృతులు, భిన్న ఆచార వ్యవహారాలు ఉంటాయక్కడ. తెలుగు, దక్కన్ ఉర్దూ, మరాఠీ, కన్నడ వాడుక భాషలున్న ఆ ప్రాంతం దేశభక్తికి నిలువుటద్దం. భారతమాతకు పూజలు చేయడం అక్కడి సంప్రదాయం. ఇలాంటి దేవాలయం ఒకటి కశ్మీర్లో ఉంటే… మరొకటి కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఉంది.
స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే అంటే… 1955 లో బిచ్కుంద గ్రామానికి చెందిన పిస్క లక్ష్మన్న అనే వ్యక్తి భరత మాత ఆలయాన్ని నిర్మించాడు. మిత్రులైన అర్రి భూశన్న, బర్రి భూశన్న… గ్రామానికి చెందిన మంగళి రామన్న అనే విగ్రహ కళాకారుడు లక్ష్మన్నకు సాయం చేశారు. ముందు కేవలం ఆలయం మాత్రమే ఉండేది. తర్వాత రోజుల్లో పక్కనే మార్కండేయ గుడి కూడా కట్టించారు. గ్రామస్థులు, దాతల సాయంతో రెండు ఆలయాలు అభివృద్ధి చేశారు. భరత మాతను అలంకరించేందుకు బంగారు నగలు కూడా చేయించారు. ప్రతి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఆలయంలో ఉన్న భరత మాతను దుర్గా దేవి అవతారంగా కొలుస్తారు గ్రామస్థులు. ప్రతీ రోజు ఉదయం, సాయంకాలం అమ్మవారికి నిత్య పూజలు చేస్తారు. ఆలయంలో దేవి నవరాత్రులు, గణాపతి నవరాత్రులతో పాటు ఆగస్టు 15, జనవరి 26 వ తేదీల్లో ప్రత్యేకంగా పూజలు జరుపుతారు.

బిచ్కుంద ప్రాంతం తెలంగాణ, కర్ణాటాక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం. దీంతో భిన్న సంస్క్రుతులు, సంప్రదాయాలుంటాయి. ఏళ్ల తరబడి ఇక్కడ కొలువైన భరతమాతని తమ తల్లీ కన్నా ఎక్కువగా పూజిస్తామని చెప్తున్నారు స్థానికులు. చిన్నారులు దేశ భక్తి గీతాలు పాడడం…. శుక్ర, శనివారాల్లో అర్థరాత్రి వరకు బజనలు చేయడం ఇక్కడ ఆనవాయితీ. పక్కనే ఉన్న మార్కండేయ ఆలయంలో కూడా నల్లరాతితో చేసిన భరత మాత విగ్రహం ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy