
ఖైరతాబాద్ మహాగణపతి భక్తజనానికి కనువిందు చేస్తున్నాడు. ఏటా వివిధ రూపాల్లో దర్శనమిచ్చే పార్వతీ తనయుడు.. ఈ ఏడాది త్రిశక్తిమయ మోక్ష గణపతి రూపంలో దర్శనమిస్తున్నాడు. 59 అడుగుల మహాగణపతికి గవర్నర్ దంపతులు మొదటి పూజ చేసి ఉత్సవాలు ప్రారంభించారు. వినాయకుని ఆశీస్సులతో విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆకాక్షించారు గవర్నర్ నరసింహాన్.
ఖైరతాబాద్ లంబోదరుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. స్పీకర్ మధుసూదన చారి గణనాథుడికి ప్రత్యేకపూజలు చేశారు. నగరంలో కొలువుదీరిన ఈ భారీ కాయుడి కోసం.. తాపేశ్వరం నుంచి తీసుకొచ్చిన 6 వేల కేజీల లడ్డూను నైవేద్యంగా సమర్పించారు. పద్మశాలి సంఘం నేతలు ప్రత్యేకంగా తయారు చేసిన 75 అడుగుల నూలు కండువాతో పాటు జంధ్యాన్ని మహాగణపతికి సమర్పించారు.
ప్రత్యేక పూజలో నేతలు
నేతలంతా గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఇక వీధివీధిన వెలిసిన వినాయక విగ్రహాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ముంబయిలోనూ గణేష్ ఉత్సవాలు జోరుగా జరుగుతున్నాయి. మహారాష్ట్ర సీఎం ఫడ్నావిస్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు.