దొర వేషంలో దోపిడీలు : నేషనల్ ఫైవ్ స్టార్ దొంగ దొరికాడు

park-hyattసూటు బూటు వేస్తాడు.. హైప్రొఫైల్ వ్యక్తిలా బిల్డప్ ఇస్తాడు.. కాఫీ తాగి టిప్ రూ.200 ఇస్తాడు.. విమానాల్లో తిరుగుతాడు.. కాస్ట్లీ కార్లకి తగ్గడు.. ఫైవ్ స్టార్ హోటల్స్ లోనే దిగుతాడు.. ఇవన్నీ చేసేది ఏ పారిశ్రామిక వేత్తో కాదు.. ఓ దొంగ. ఫైవ్ స్టార్ హోటల్ దొంగగా పోలీసులకు సవాల్ విసురుతున్న ఇతన్ని పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. కూపీ లాగితే దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే..

అతని పేరు జయేష్ రావు తేజపాల్.. వయస్సు 48 ఏళ్లు. ఇతనిది ఛండీఘడ్. చూడటానికి దొరబాబులా ఉంటాడు. ఇతడు చేసేవి మాత్రం ఫైవ్ స్టార్ హోటళ్లలో దొంగతనాలు. ముంబై, హైదరాబాద్, కోల్ కతా, చెన్నై, బెంగళూరులో ఇప్పటికే 30 దొంగతనాలు చేశాడు. హోటళ్లలో దిగే వ్యక్తుల గదుల్లో బంగారం, వజ్రాలు కొట్టేస్తూ హైదరాబాద్ లో అడ్డంగా దొరికిపోయాడు.

హైదరాబాద్ లో దొంగతనాలు :

బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్ లో మార్చి 4వ తేదీన దొంగతనం జరిగింది. హిమాయత్ నగర్ కు చెందిన ఓ కొత్త జంట హోటల్ లోని 312 గదిలో బస చేసింది. 5వ తేదీ ఉదయం వారు సిటీ చూడటానికి వెళ్లారు. ఈ సమయంలో తేజ్ పాల్.. పార్క్ హయత్ హోటల్ కి సూటు బూటులో వచ్చాడు. 312 గదిలో దిగిన వారి బంధువుని అని చెప్పాడు. వారి గదిలో నా కార్డు మర్చిపోయానని చెప్పాడు. దీంతో హోటల్ సిబ్బంది దగ్గర ఉన్న మరో యాక్సిస్ కార్డు వారికి అందించారు. అక్కడి నుంచి గది దగ్గరకి వెళ్లిన అతను.. రిసెప్షన్ కి ఫోన్ చేసిన పాస్ వర్డ్ మర్చిపోయానని చెప్పాడు. వారు కొత్త పాస్ వర్డ్ యాక్సిస్ కు అవసరమైన సమచారం ఇచ్చారు. దీంతో అతను గదిలోకి వెళ్లి వారి సూట్ కేస్ లో ఉన్న బంగారం, వజ్రాల ఆభరణాలు తీసుకుని దర్జాగా వెళ్లిపోయాడు. వాటి విలువ రూ.12 లక్షలు. సిటీ చూసి రూంకి చేరుకున్న కొత్త జంట.. అంతా చిందరవందరగా ఉండటం, ఆభరణాలు కనిపించకపోవటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫొటోల ఆధారంగా వ్యక్తిని గుర్తించారు. ఐదు రాష్ట్రాల్లో 30 దొంగతనాలు చేశాడు. 2006 నుంచి పరారీలో ఉన్నాడు. అన్ని దోపిడీలు స్టార్ హోటల్స్ లోనే చేస్తుంటాడు. ఇప్పటికే సిటీలో నోవాటెల్, రాడిషన్, వెస్టిన్ హోటల్స్ లోనూ ఇదే తరహాలో దొంగతనాలు చేశాడు. గుజరాత్ కు చెందిన తేజ్ పాల్.. ముంబైలో సెటిల్ అయ్యాడు. వివిధ నగరాలకు విమానాల్లో ప్రయాణిస్తాడు.

ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. తేజ్ పాల్ స్మార్ట్ ఫోన్ వాడదు. డెబిట్, క్రెడిట్ కార్డులను కూడా వాడదు. అంతా నగదు ద్వారానే లావాదేవీలు చేస్తాడు. బ్యాంక్ ఖాతానే లేదు. ఏ రోజుకి ఆ రోజు కొత్త పేరుతో పరిచయం చేసుకుంటాడు. అంతే కాదండీ.. మనోడు 10వ తరగతి ఫెయిల్. టెక్నికల్ నాలెడ్జ్ తో మాత్రం పీహెచ్ డీ చేశాడు. స్టార్ హోటల్స్ లో దొంగతనాల్లో మాత్రం డాక్టరేట్ కి మించిపోయాడు..  చివరికి పాపం పండి.. హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy