నరేశ్ హత్య ఇలా జరిగింది: తగలబెట్టి.. మూసీలో కలిపారు

naresh-swathiనరేశ్ అదృశ్యం కేసు చివరకు మర్డర్ గా మారింది. ఈ కేసులో భయాన నిజాలు వెల్లడించారు పోలీసులు. భార్య కోసం ఇంటికి వచ్చిన నరేశ్ ను సొంత మామే.. అత్యంత కిరాతకంగా చంపినట్టు తెలిపారు. నరేశ్ హత్య కేసులో శ్రీనివాస రెడ్డి, సత్తిరెడ్డిలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసు దర్యాప్తు వివరాలను శనివారం(మే 27న) మీడియాకు తెలిపారు రాచకొండ సీపీ మహేశ్ భగత్. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… మే 2న శ్రీనివాసరెడ్డి, స్వాతి పిన్నికొడుకు సత్తిరెడ్డి.. తమ వ్యాగనార్ కారులో స్వాతిని సొంతూరు లింగరాజుపల్లెకు తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి 10.30 సమయంలో నరేశ్ స్వాతి వాళ్ల ఇంటికి వచ్చాడు. అయితే ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న నరేశ్ ను చూశాడు స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి. బైక్ బయటకు తీసి.. సత్తిరెడ్డిని వెంట తీసుకుని బయలుదేరాడు. వారికి అరకిలో మీటర్ దూరంలో నరేశ్ కనిపించాడు. అతడిని మధ్యలో కూర్చోబెట్టుకుని తమ పొలానికి తీసుకెళ్లారు. అక్కడ నరేశ్ తో సత్తిరెడ్డి మాట్లాడుతూ ఉండగా శ్రీనివాసరెడ్డి వెనక నుంచి రాడ్‌తో తల వెనక భాగంలో గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు నరేశ్ అక్కడికక్కడే మరణించాడు. వెంటనే శవాన్ని తగలబెట్టారు. అయితే అది పూర్తిగా కాలలేదు. దీంతో ఆత్మకూరు వెళ్లి అక్కడ 5 లీటర్ల పెట్రోలును కొనుక్కొచ్చారు. శవానికి పైన, కిందా టైర్లు పెట్టి.. మళ్లీ తగలబెట్టారు. ఆ రోజే హైదరాబాద్ బోడుప్పల్ లోని బాలాజీ హిల్స్ లో ఉన్న ఇంటికి చేరుకున్నాడు సత్తిరెడ్డి. తనతో పాటు నరేశ్ సెల్ ఫోన్ కూడా తెచ్చేసుకున్నాడు. ఇదంతా మే రెండో తేదీన జరిగింది.

తర్వాతి రోజు… మే 3. ఉదయం లేవగానే పొలానికి వెళ్లి.. నరేశ్ అస్థికలను ఒక గోనెసంచిలో సేకరించి, మూసీ నదిలో కలిపేశాడు శ్రీనివాస్ రెడ్డి. మొత్తం హత్య, దానికి సంబంధించిన ఆధారాలను మాయం చేయడం అన్నీ మే 2, 3 తేదీలలో జరిగాయన్నారు. శ్రీనివాసరెడ్డి, సత్తిరెడ్డి ఇద్దరినీ వేర్వేరుగా ప్రశ్నించగా ఇద్దరూ ఇవే విషయాలు చెప్పారని అన్నారు సీపీ మహేశ్ భగత్.

ఈ కేసులో మరిన్ని ట్విస్టులు:

ఇదిలా ఉంటే.. మే 16న స్వాతి బాత్రూమ్ లో ఆత్మహత్య చేసుకుంది. అయితే అప్పుడు ఆమె తీసుకున్నదని చెబుతున్న సెల్ఫీ వీడియోపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో దానిపై పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై తెలియరావడంలేదు. పెళ్లయిన తర్వాత ముంబైలోని వర్లి పోలీసు స్టేషన్‌లో స్వాతి, నరేశ్ ఇద్దరూ కలిసి వెళ్లి శ్రీనివాస్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. మరికొన్నాళ్లకు తన పరిస్థితి ఏమీ బాగోలేదని.. సెల్ ఫోన్ రీచార్జ్ చెయ్యండని తన తండ్రి శ్రీనివాస్ రెడ్డికి స్వాతి ఫోన్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అలా రెండు మూడు సార్లు శ్రీనివాస్ రెడ్డి బ్యాలెన్స్ వేయించినట్టు చెబుతున్నారు. నరేశ్ సోదరి షోలాపూర్‌లో ఉంటారని, ఆమెతో కూడా శ్రీనివాసరెడ్డి టచ్‌లో ఉన్నారని అన్నారు. అయితే అసలు ఈ కేసులో విషయాలన్నీ చాలా నాటకీయంగా ఉన్నాయని, దర్యాప్తులో కూడా తమకు చాలా సవాళ్లు ఎదురయ్యాయని అన్నారు సీపీ మహేశ్ భగత్. ఈ మొత్తం వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

హైకోర్టు ఆదేశాలతో…

నరేశ్ అదృశ్యంపై అతడి తండ్రి వెంకటయ్య కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాకలు చేయడంతో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు విచారణ ప్రారంభించామని, ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావును దర్యాప్తు అధికారిగా నియమించామని సీపీ మహేష్ భగవత్ చెప్పారు. జాయింట్ సీపీ తరుణ్ జోషి నేతృత్వంలో వేర్వేరు బృందాలను రూపొందించి ముంబై, షోలాపూర్ తదితర ప్రాంతాలకు పంపినట్లు చెప్పారు. నరేశ్ సొంత ఊరు పల్లెర్ల, శ్రీనివాసరెడ్డి ఊరు లింగరాజపల్లి తదితర ప్రాంతాల్లో విచారణ జరిపినట్లు తెలిపారు. ముందు నుంచి శ్రీనివాసరెడ్డి మీద అనుమానం ఉండటంతో ఆయనను పిలిపించి, డీసీపీ ఆధ్వర్యంలో ఎస్ఓటీ బృందం విచారించిందన్నారు. చివరకు శ్రీనివాసరెడ్డి నుంచి నిజాన్ని రాబట్టామని తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy