నవ్వుతూ తిరిగొచ్చాడు : బోరు బావిలో చిన్నారి క్షేమం

81502828304_625x300బోరు బావిలో పడ్డ చిన్నారి చంద్రశేఖర్ మృత్యుంజయుడయ్యాడు. జోరుగా వాన కురిసినా బావి నుంచి చిన్నారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు చేసిన యత్నాలు ఫలించాయి. గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరంలో మంగళవారం(ఆగస్టు-15) సాయంత్రం ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు. మంగళవారం అర్ధరాత్రి దాదాపు 2:45 నిమిషాల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చిన్నారిని బయటకు తీశాయి.

సుమారు 13 అడుగుల లోతులో పడ్డ బాలుడిని 11 గంటలకు పైగా శ్రమించి బోరు బావికి సమాంతరంగా 25 అడుగుల మేరకు గుంత తవ్వారు. బాలుడి కదలికలను గుర్తించామని, అతడు పిలిస్తే పలుకుతున్నాడని ఆక్సిజన్ అందిస్తున్నామని ఓవైపు అధికారులు తెలపగా.. మరోవైపు రెస్క్యూ సిబ్బంది (ఎన్డీఆర్ఎఫ్) సమాంతరంగా తవ్విన గుంత నుంచి బాలుడిని బావి నుంచి పైకి తీయగానే ఘటనా స్థలంలో బాలుడి తల్లితండ్రులతో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, గుంటూరు కలెక్టర్‌ కోన శశిధర్‌, గుంటూరు రూరల్ ఎస్పీ అప్పలనాయుడు తదితరులు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

నవ్వుతూ తిరిగొచ్చాడు..
చిన్నారి చందును బోరు బావి నుంచి బయటకు తీయగానే చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉంచిన వైద్య బృందం 108 అంబులెన్సులో ప్రాథమిక చికిత్స అందించారు. చిన్నారికి ఎలాంటి సమస్య లేదని, బావి నుంచి బయటకు వచ్చేటప్పుడు చందు నవ్వుతూ కనిపించడం గమనార్హం.

ఉమ్మడివరానికి చెందిన అనుమర్లమూరి మల్లికార్జున్, అనూషల ఏకైక కుమారుడు చంద్రశేఖర్‌ మంగళవారం మధ్యాహ్నం తల్లితో కలసి పశువుల పాక వద్దకు వెళ్లాడు. బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు సమీపంలోని బోరుబావిలో పడ్డాడు. కుమారుడి కోసం చాలాసేపు వెతికిన ఆమెకు చివరకు సమీపంలోని బోరుబావిలో పడ్డట్లు గుర్తించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని చురుకుగా పనులు ప్రారంభించింది. బావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతుండగా మధ్యలో రాళ్లు ఎదురైనా, వర్షం కురిసినా ఎన్డీఆర్ఎఫ్ బృందం 11 గంటలకు పైగా తీవ్రంగా శ్రమించి చిన్నారి చంద్రశేఖర్‌ను ప్రాణాలతో కాపడటంతో అక్కడ పండుగ వాతావరణం ఏర్పడింది.

ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

నా బిడ్డను కాపాడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బోరుబావిలో పడ్డ చంద్రశేఖర్ తల్లిదండ్రులు మల్లికార్జున్‌, అనూష అన్నారు. బోరుబావిలో పడ్డ బాలుడ్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటకు తీసిన సంగతి తెలిసిందే. అనంతరం బాలుడ్ని దగ్గరకు తీసుకున్న తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకపోగా బాలుడ్ని చూసిన ఆనందంలో వారు కన్నీరు కారుస్తూ పేరుపేరునా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మా కొడుకు క్షేమంగా బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy