నష్టపోయాం: పటేల్‌ ఐక్యతా విగ్రహావిష్కరణపై గిరిజనుల నిరసన

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఐక్యతా విగ్రహావిష్కరణ జరగక ముందే స్థానికంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విగ్రహ ఏర్పాటుతో తాము ఎంతో నష్టపోయామంటూ గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఆవిష్కరణ రోజును సంతాప దినంగా పాటిస్తామంటున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఐక్యతా విగ్రహావిష్కరణపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అటు కేంద్రం, ఇటు గుజరాత్‌ ప్రభుత్వం అక్టోబరు 31వ తేదీన ఘనంగా మోడీ చేతుల మీదుగా ఐక్యతా విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక గిరిజనులు ఈ కార్యక్రమంపై నిరసన తెలుపుతున్నారు.

నర్మదా ప్రాజెక్టు కారణంగా తామెంతో నష్టపోయామనీ.. తమ నుంచి భూములు లాక్కున్నారని, సరైన పునరావాసాలు కల్పించలేదంటున్నారు. హామీ ఇచ్చినట్లుగా మరో ప్రాంతంలో భూమి, ఉద్యోగాలు తమకు ఇవ్వలేదని ఆరోపిస్తూ దాదాపు 75వేల మంది గిరిజనులు ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. మోడీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టనున్నారు. అక్టోబరు 31న నర్మద జిల్లాలోని దాదాపు 72 గిరిజన గ్రామాల్లో సంతాప దినంగా పాటిస్తామని, ఆ రోజు తమ ఇళ్లలో ఆహారం కూడా వండుకోమని గిరిజన నేతలు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం మా హక్కులను కాలరాసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ గొప్ప పుత్రుడు సర్దార్‌ పటేల్‌ పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని…. ఆయనను ఎప్పటికీ గౌరవిస్తామంటున్నారు.  అయితే ఈ ప్రభుత్వం అభివృద్ధి పనులు అంటూ గిరిజనులకు అన్యాయం చేస్తోందంటున్నారు. గిరిజన గ్రామాలు గల 9 జిల్లాలు తమ ఆందోళనలో పాల్గొంటున్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వంద చిన్న, పెద్ద గిరిజన సంఘాలు ఈ ఆందోళనకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. 31వ తేదీన  విద్యాసంస్థలు, కార్యాలయాలు మూసేయడంతో పాటు గిరిజన గ్రామాల్లో ఇళ్లలో ఆహారం కూడా వండుకోరని స్పష్టం చేశారు.

నర్మదా ప్రాజెక్టు ప్రభావం 72 గ్రామాలపై పడగా.. అందులోనూ 32 గ్రామాలపై మరింత అధికంగా పడింది. 19 గ్రామాల ప్రజలు తమకు ఇంకా పునరావాసం కల్పించలేదని చెప్తున్నారు. కొన్ని గ్రామాల ప్రజలు తమకు నష్టపరిహారం మాత్రమే ఇచ్చారని ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy