నాగార్జున సాగర్ వజ్రోత్సవం

NagarjunaSagar Damఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని సమయంలో కట్టిన అద్భుతమైన కట్టడం అది. ఆకలిని జయించడానికి.. చెలకల్లో చేవ తేవడానికి ఆరు దశాబ్ధాల కింద నిర్మించిన అతిపెద్ద మానవనిర్మిత రాతికట్టడం. కోట్ల మంది తెలుగు ప్రజల కడుపునింపుతున్న అన్నపూర్ణకు పునాదిరాయి వేసి ఇవాళ్టికి 60 ఏళ్లు. మానవ నిర్మిత మహాసాగరమైన నాగార్జున సాగర్ షష్టిపూర్తి జరుపుకుంటున్న సందర్భంగా వీ6 ప్రత్యేక కథనం.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్నం పెడుతున్న అన్నపూర్ణ నాగార్జున సాగర్. లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ.. ఆధునిక దేవాలయంగా అందరి గుండెల్లో నిలిచిన సాగర్ ఆనకట్టకు శంకుస్థాపన చేసి ఆరు దశాబ్దాలు. 1955లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దీనికి పునాదిరాయి వేశారు. బిరాబిరా పరుగులు పెడుతున్న కృష్ణమ్మకు అడ్డుకట్ట వేస్తూ.. నందికొండల మధ్య ప్రాజెక్టు కట్టేందుకు అప్పట్లో  వేల మంది కూలీలు రాళ్లెత్తారు. ఆరు దశాబ్ధాల కిందట అరలక్షకు పైగా జనానికి పుష్కర కాలంపాటు కడుపు నింపిన ఏకైక ఉపాధి కేంద్రం నాగార్జున సాగర్.

DAM_NEHRU

బీదర్, ఔరాంగాబాద్ ప్రాంతాలతో కూడిన నాటి హైదరాబాద్ రాష్ట్రం సాగు, తాగునీటి అవసరాలకోసం భారీ డ్యాం నిర్మించాలని అనుకుంది. నందికొండ దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రాథమిక సర్వే జరిపింది. ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే.. ఆంధ్ర ప్రాంతంలోని భూములు కూడా మునిగిపోతాయని అధికారులు గుర్తించారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాలు కలిసి చేపడితే బాగుంటుందని అప్పటి ఇంజినీర్ అలీ నవాబ్ జంగ్ భావించారు. అయితే అదే సమయంలో పులిచింతల దగ్గర ప్రాజెక్టు నిర్మించాలనుకుంటున్న అప్పటి ఆంధ్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. నవాబ్ జంగ్ ప్రతిపాదనకు అప్పటి ఆంధ్ర గవర్నర్ త్రివేది వెంటనే ఆమోదం తెలిపారు. ఇదే విషయాన్ని ప్రధాని నెహ్రూ దగ్గరకు తీసుకళ్లారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…నాటి నందికొండ… నేటి నాగార్జున సాగర్ కు 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన జరిగింది. ఆంధ్రా-హైదరాబాద్ సంయుక్త రాష్ట్రాల ప్రాజెక్టుగా నందికొండ బోర్డు ఏర్పడింది.

ప్రస్తుతం ఆధునిక యంత్రాల సహాయంతోనే ప్రాజెక్టుల నిర్మాణాలు సాగుతున్నాయి. కానీ నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో పెద్ద పెద్ద రాళ్లు మోయడం నుంచి అన్ని పనులూ కూలీలే చేశారు. వేలమంది కూలీలు, వందల మంది ఇంజనీర్లు రాత్రింబవళ్లు శ్రమించి కట్టిన నాగార్జున సాగర్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రాతి కట్టడాల్లో ప్రపంచంలోనే మొదటిది సాగర్. జలాశయ విస్తీర్ణంలో ప్రపంచంలో మూడవది. సాగర్ ఆనకట్ట మొత్తం పొడవు 15వేల 956 అడుగులు కాగా.. రాతి కట్టడం మొత్తం పొడవు 4 వేల  756 అడుగులు. మొత్తం 26 రేడియల్ క్రస్ట్ గేట్లు కలిగిన సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. 1955లో శంకుస్థాపన తర్వాత.. 1956 నుంచి ప్రాజెక్టు పనులు పనులు ప్రారంభమయ్యాయి. 1967 ఆగష్టు 4న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కాల్వలకు నీరు వదిలి జాతికి అంకితం చేశారు. 1970కి డ్యామ్ పూర్తిస్థాయిలో నిర్మించగా.. 1974లో క్రస్ట్ గేట్ల అమర్చడం పూర్తయింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు కరవు రక్కసి నుంచి విముక్తి లభించింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో దాదాపు 21 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది సాగర్ జలాశయం. హైదరాబాద్ సహా వందలాది గ్రామాల దాహార్తిని తీరుస్తోంది. అంతేకాదు వేలాది గ్రామాలు, పరిశ్రమలకు విద్యుత్ వెలుగులు అందిస్తూ.. కోట్లాది మంది ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది.

RAJA-RAMA GOPALAఈ సందర్భంగా చెప్పుకోవలసిన మరో ముఖ్యమైన వ్యక్తి ముక్త్యాల సంస్థానాధిపతులు రాజా రామగోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్. కృష్ణమ్మకు అడ్డుకట్ట వేసి ఆ నీళ్లను బీడు భూములకు తరలించాలన్న ఆలోచన మొదట పుట్టింది రాజావారి మనుసులోనే. అయితే అది చింతలు తీర్చే పులిచింతల ప్రాజెక్టు అనుకున్నారు. అదే ఆ తర్వాత నాగార్జున సాగర్ గా రూపుదిద్దుకుంది. తనకు భారత ప్రభుత్వం నుంచి వచ్చిన లక్షన్నర రూపాయల భరణాన్ని కూడా ప్రాజెక్టు కోసం  ఖర్చు చేశారు రాజావారు. ప్రజల్ని చైతన్య పరిచి.. ఆనాటి ప్రభుత్వాల దృష్టిని దీనిపైకి మరల్చేట్టు చేసిన ఘనత కూడా ఈయనదే.

ఎందరో కష్టంతో నిర్మితమైన ఈ మహానిర్మాణం తెలుగువాళ్లకు వరదప్రదాయిని.. నిత్యసందర్శన దేవాలయం.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy