నాటి మానుకోట ఘటనకు సరిగ్గా ఐదేళ్లు..!!

29calls01మానుకోట… మలిదశ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మైలురాయి.

ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం…

సీమాంధ్ర పాలకుల అధికార దురహంకారానికి పెనుసవాలు

తుపాకీ తూటాలకు భయపడని… మానుకోటవాసుల వీరోచిత పోరాటం

ఓ వైపు రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు…. అణివేసే దోరణిలో నాటి సర్కార్ ప్రయత్నాలు… ఉద్ధృతంగా సాగుతున్న కాలమది. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో…ఆయన కుమారుడు వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టాడు. తెలంగాణలో వరంగల్ జిల్లా మానుకోట నుంచి ఓదార్పుయాత్రకు శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు భారీగా జరిగాయి. దానిని అడ్డుకునేందుకు అప్పటికే అనేక మంది తెలంగాణవాదులు హెచ్చరికలు సైతం జారీచేశారు. జగన్ యాత్రకు అప్పటి ప్రభుత్వం..భారీగా పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసింది. మరోవైపు జగన్ అనుచర వర్గం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పంతానికి పోయింది. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా సమైక్యవాదాన్ని పార్లమెంట్ లో ప్లకార్డు ద్వారా వినిపించిన వైఎస్ జగన్ ను వెనక్కి మళ్లించేందుకు… మడమతిప్పకుండా ప్రతిఘటించారు తెలంగాణవాదులు. మానుకోట రైల్వేస్టేషన్ లో  ఓ వైపు జగన్ అనుచర వర్గం, మరోవైపు తెలంగాణ వాదులు మొహరించారు. యుద్దవాతావరణాన్ని తలపించే సంఘనటలు అక్కడ చోటుచేసుకున్నాయి. బుల్లెట్లకు ఎదురునిలిచి కంకరరాళ్లనే ఆయుధాలుగా చేసుకుని మలిదశ తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపిరి పోశారు తెలంగాణవాదులు.

ఈ ఘటనలో 13మందికి గాయాలు కాగా వారిలో కొందరు… మృత్యువుతో పోరాడి ప్రాణాలతో బయటపడ్డారు. సుధాకర్ అనే వ్యక్తికి కుడి నడుము భాగంలో దూసుకుపోయిన బుల్లెట్… ఎడమ నడుము నుంచి బయటకు వెళ్లింది. మరో బుల్లెట్ ఎడమ చేతిలో నుంచి బయటకు దూసుకెళ్లింది. దీంతో చేతి ఎముక బాగా దెబ్బతింది. ఎడమవైపు కిడ్నీ దెబ్బతిని పనిచేయడం లేదు. ఈ ఘటనలో భాగస్వామ్యం ఉందనే కారణంతో పలువురు తెలంగాణవాదులపై అప్పటి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. మానుకోటకు కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టుల్లో కొందరు గాయపడ్డారు. పది జిల్లాల్లో ఉద్యమాకారుల్లో పోరాట స్పూర్తిని నింపిందని ఆ నాటి ఘటనలో ప్రత్యక్షంగా పోరాడిన వారు గుర్తుచేసుకుంటున్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. కలసాకారమై… స్వరాష్ట్రాన్ని సాధించుకుంది. అయినా ఇప్పటికీ మానుకోట రైల్వే స్టేషన్ నుంచి ప్రయణించే వారికి ఆ నాటి ఘటన కళ్లముందే కనిపిస్తుంటుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy