నాటి మావోయిస్టు.. నేటి క్రిమినల్

Nayeemనయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం. అతడి పేరు చెబితే రాజకీయ నాయకులూ హడలెత్తిపోతారు. మాజీ నక్సలైట్లకు, మావోయిస్టులకు కంటిపై కునుకుండదు. ఇప్పటికే 40కి పైగా హత్యలు, బెదిరింపుల కేసులతో పాటు లెక్కలేనన్ని సెటిల్ మెంట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఏళ్లుగా పరారీలోనే నేర సామ్రాజ్యాన్ని ఏలుతూ పోలీసులకు చుక్కలు చూపించాడు.

నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం.. మూడు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ లో చేరాడు. అప్పటి అగ్రనేతలు పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావుల దగ్గర శిష్యరికం చేసి.. వారికి సన్నిహితుడిగా మెలిగాడు. నక్సలైట్ గా జీవితం ప్రారంభించిన నయీం, ఆ తరవాత నక్సల్స్ ను అంతం చేయడమే తన జీవితాశయమని ప్రకటించాడు. దీనికి సంబంధించి అనేక చోట్ల ప్రదర్శనలను కూడా నిర్వహించాడు. ఈ పరిణామ క్రమంలోనే పోలీసులు నయీంను చేరదీసి తమ అజ్ఞాత కార్యకలాపాల్లో ఉపయోగించడం ప్రారంభించారు. ఓ దశలో కోవర్టుగా మారి నక్సలైట్ల రహస్యాలను పోలీసులకు చేరవేసేవాడని కూడా చెబుతారు. నయీం ఇచ్చిన సమాచారంతోనే అనేక ఎన్ కౌంటర్లలో పీపుల్స్ వార్, మావోయిస్టు నేతల్ని ఖాకీలు మట్టుపెట్టారంటారు.

నయీంకు కొందరు పోలీసులే సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో నయీం కోసం గుజరాత్ పోలీసులతో పాటు సీబీఐ కూడా గాలించింది. కానీ వారెవరికీ అతని జాడయినా తెలియలేదు. రాష్ట్రానికి చెందిన కొందరు ఉన్నతాధికారుల మద్దతే ఇందుకు కారణమని తెలుస్తోంది.

బెల్లి లలిత నుంచి మొదలు..

అజ్ఞాతంలో ఉండగానే భువనగిరిలో బెల్లి లలిత దారుణ హత్యతో నయీం పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగింది. గ్రేహౌండ్స్ కు ఆద్యుడైన ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ హత్య కేసులోనూ ఇతను నిందితుడు. ఈ కేసు 14 ఏళ్ల తరవాత కోర్టులో వీగిపోయింది. పౌర హక్కుల నేతలు పురుషోత్తం, కరుణాకర్ లను పట్టపగలే తెగనరికిన కేసుల్లో కూడా నయీం పాత్ర సుస్పష్టం. మరో నేత ఆజం అలీనీ చంపినట్లు ఆరోపణలున్నాయి. మాజీ మావోయిస్టులు గణేశ్, ఈదన్న హత్య వెనకా నయీమే మాస్టర్ మైండ్ అని పోలీసులు చెప్తుంటారు. ఎల్ బీ నగర్ కు చెందిన రియల్టర్ రాధాకృష్ణ, మాజీ మావోయిస్టు నేత, టీఆర్ ఎస్ నాయకుడు కె.సాంబశివుడు, రివల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్ (ఆర్పీటీ) వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి… ఇలా అనేక దారుణ హత్యలకు నయీం, అతడి గ్యాంగ్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి. అనేక కోర్టుల్లో నయీంపై నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భూ సెలిట్ మెంట్లు, చేస్తూ తనకంటూ ఓ గ్యాంగ్ ను మెయింటెన్ చేస్తూ ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టించాడు. ఎదురు తిరిగిన వారిని హతమర్చేవాడు. దాదాపు 20ఏళ్లపాటు ఉమ్మడి రాష్ట్రంలో పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన నయిూం ఎట్టకేలకు గ్రౌహౌండ్స్ దళాల చేతిలో ఎన్ కౌంటర్ అయ్యాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy