నిఘా నీడలో: గంటకు 25 గణేష్ విగ్రహాలు నిమజ్జనం

గణేష్ నవరాత్రులు ముగింపు సందర్భంగా 23న(ఆదివారం) జరిగే నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే బందోబస్తు ఏర్పాట్లను పూర్తిచేశారు. సుమారు 15 లక్షల మంది భక్తులు హాజరవుతున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. దాదాపు 25 వేల మంది సిబ్బందితో బందోబస్తు కోసం మోహరిస్తున్నారు. నిమజ్జనోత్సవ ప్రధాన ర్యాలీ మొత్తం 18 కిలోమీటర్లు సాగుతుందని సీపీ అంజనీకుమార్ తెలిపారు. కేశవగిరి నుంచి ప్రారంభమై చాంద్రాయణగుట్ట, ఛత్రినాక, లాల్‌దర్వాజ, నాగులచింత, శాలిబండ, మొఘల్‌పురా, చార్మినార్, గుల్జార్‌హౌస్, పత్తర్‌గట్టీ, అఫ్జల్‌గంజ్, సిద్ధిఅంబర్‌బజార్, ఎంజేమార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్ మీదుగా హూసేన్‌సాగర్ వరకు కొనసాగుతుంది. బాలాపూర్, పహడీషరీఫ్, మహేశ్వరం, మహంకాళి ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు కేశవగిరి దగ్గర ప్రధాన ర్యాలీలో కలుస్తాయి.

ప్రధాన ర్యాలీతో హైదరాబాద్ పరిసరాల్లో జరిగే నిమజ్జన ఊరేగింపు మొత్తం 120 కిలోమీటర్ల విస్తీర్ణంలో జరుగనున్నాయి. ప్రశాంత వాతావరణం కోసం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధితో పాటు ఇతర రాష్ట్రాలు, జిల్లా నుంచి మొత్తం 25 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారు. మొత్తం 14,500 మండపాల నిర్వాహకులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోగా, మరో 14,500 విగ్రహాలను అదనంగా ఏర్పాటు చేశారు. గంటకు 25 విగ్రహాలు నిమజ్జనం అయ్యేలా చర్యలు చేపట్టామన్నారు పోలీసులు. టెక్నాలజీతోపాటు సీసీ కెమెరాలతో మొత్తం ర్యాలీని పోలీసు అధికారులు వీక్షించనున్నారు.మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ బృందాలను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 310 అతిసున్నిత, 605 సున్నితమైన ప్రాంతాలను గుర్తించి గస్తీని పెంచామన్నారు సీపీ. నిమజ్జన ర్యాలీకి వచ్చే భక్తులు, ప్రజలకు ఎలాంటి గందరగోళం లేకుండా ఈసారి సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.

ఖైరతాబాద్ భారీ గణేష్ విగ్రహాన్ని ఆరుగంటల్లో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు సీపీ అంజనీకుమార్. ఆదివారం ఉదయం 5.30 గంటలకు విగ్రహం తరలింపును ప్రారంభించి 11.30 వరకు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఖైరతాబాద్ గణేష్ ర్యాలీని గమనించేందుకు మొత్తం 60 సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నారు.

విగ్రహాల ప్రధానర్యాలీలో ప్రతి అంశాన్ని స్పష్టంగా వీక్షించేందుకు మొత్తం 400 సీసీ కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా నగరంలో ఇప్పటికే 2.50 లక్షల కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో వాటిని కూడా ప్రధాన కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయడంతో ప్రతి దృశ్యాన్ని పోలీసు అధికారులు వీక్షిస్తారు. అదే విధంగా నిమజ్జన కార్యక్రమాన్నికి సంబంధించి ప్రతి మూలను కూడా స్పష్టంగా చూసేలా మరో 8 వేల కెమెరాలను అదనంగా ఏర్పాటు చేశారు. చార్మినార్,ట్యాంక్‌బండ్ వద్ద ప్రత్యేక కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  భద్రత కారణాల దృష్ట్యా నిమజ్జనం సందర్భంగా డ్రోన్ కెమెరాల వాడకాన్ని నిషేధించారు. ఆ రోజు డ్రోన్ కెమెరాలు వాడొద్దని సీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy