నిజామాబాద్ రూరల్ – అగ్రకులాల హల్ చల్

దశాబ్దాలుగా పాతుకుపోయిన ఒక బలమైన నేత….సరైన ప్రత్యర్థులు కూడా లేని పరిస్థితి….మారిపోయిన రాజకీయ పరిణామాలు….పట్టున్న సీటు కోసం గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్న ప్రత్యర్థి పార్టీ లీడర్….ఏళ్లు గడుస్తున్న తీరని సమస్యలు….ఇదీ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్లో సీన్. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రాజకీయ హడావుడి పెరుగుతున్న ఈ సెగ్మెంట్ లో పరిస్థితులపై స్పెషల్ స్టోరీ.

 • నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ లో జక్రాన్ పల్లి, నిజామాబాద్, డిచ్ పల్లి, దర్పల్లి, సిరికొండ మండలాలతో ఏర్పాటైన ఈ సెగ్మెంట్లో 110 గ్రామాలు, 74 గిరిజన తాండాలున్నాయి.
 • 2 లక్షల 16వేల 988 మంది ఓటర్లున్నారు.
 • వారిలో లక్షా 15వేల 544 మంది మహిళలు, లక్షా 14 వందల 44 మంది పురుషులున్నారు.
 • మొత్తం ఓటర్లలో 50 శాతం మంది బీసీలు, 20 శాతం మంది ఎస్టీలు, 15 శాతం మంది ఎస్సీలు, 10 శాతం ఓసీలు, ఇతర వర్గాలు మరో 5 శాతం ఉన్నారు.

………………………….

 

1983లో టీడీపీ ఏర్పాటయినప్పటినుంచి  నిజామాబాద్ రూరల్  ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ప్రస్తుత ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు మండవ వెంకటేశ్వరరావు ఈ సీటును తిరుగులేకుండా ఏలుతున్నారు.

 • 2004 ఎన్నికలను మినహాయిస్తే ఐదుసార్లు గెలిచి తిరుగులేని పట్టుసాధించారు మండవ.
 • గత ఎన్నికల్లో టీడీపీ -టీఆర్ఎస్ మహాకూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలితపై 28వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు.
 • నిజామాబాద్ రూరల్ లో గట్టిపట్టున్న మండవకు ఈసారి పరిస్థితి అనుకున్నంత ఈజీగా లేదు.
 • గత ఎన్నికల్లో ఆయన ప్రధాన హామీల్లో ఒకటైన మల్లాపూర్-లోలం బ్రిడ్జి నిర్మాణం చేయించలేకపోయారు.
 • బర్దిపూర్ ఎత్తిపోతల పథకం ద్వారా నీరందిస్తామన్న మాటను కూడా నిలబెట్టుకోలేదు.

మండవకు కలిసొచ్చే అంశాలు కూడా ఉన్నాయి.

1. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పట్టు

2. ప్రతి గ్రామంతోనూ నేరుగా సంబంధాలు

3. పాతికేళ్లుగా ప్రతి గ్రామంలోనూ చేసిన పనులను చెప్పుకునే అవకాశం

4. తెలంగాణవాదం ఉన్నా టీడీపీ కార్యకర్తల బలం ఉండడం

5. దర్పల్లి మండలకేంద్రంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు

6. ప్రాణహిత నీటిని నియోజకవర్గానికి అందించడం

7. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువమంది టీడీపీ సపోర్టర్లు సర్పంచ్ లుగా గెలవడం.

మరోవైపు మండవకు వ్యతిరేకంగా మారుతున్న అంశాలు కూడా కొన్ని ఉన్నాయి.

1. మండవ పూర్వీకులు కోస్తాంధ్ర ప్రాంతంవారు కావడం

2. స్థానికంగా తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండటం

3. ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగకపోవడం

4. మల్లారం-లోలం బ్రిడ్జి నిర్మాణం చేయకపోవడం

5. డిచ్ పల్లి మండల కేంద్రంలో డిగ్రీ కాలేజి రాకపోవడం

6. డిచ్ పల్లి, దర్పల్లి మండలాల్లో ప్లోరైడ్ నీటి పథకాలు అర్థంతరంగా ఆగిపోవడం.

ఈసారి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ తో పాటు బలంగా పనిచేసే అంశాలు చాలా ఉన్నాయి.

1. వాటిలో కీలకమైంది గల్ఫ్ దేశాలకు వెళ్లి కష్టాలుపడుతున్న ప్రజలకు ఏదైనా సాయం చేయడం

2. దుబాయ్, సౌదీ అరేబియా లాంటి దేశాలకు వేలాదిగా వెళ్లి అక్కడ మారిన చట్టాల వల్ల తిరిగి వచ్చిన స్థానికులు వేలల్లో ఉన్నారు. వారికి ఉపాధి కల్పించాల్సిన అవసరం.

3. నిజాంసాగర్ ప్రాజెక్ట్ చివరి ఆయకట్టుకు సాగునీరు లేక రైతుల కష్టాలు.

4. డిచ్ పల్లి మండల కేంద్రంలో తెలంగాణ యూనివర్సిటీ ఉన్నా డిగ్రీ కాలేజీ లేకపోవడం.

5. జక్రాన్ పల్లి మండలంలో ఎయిర్ పోర్టు ప్రతిపాదన సర్వే దగ్గరే ఆగిపోవడం.

6. స్థానికంగా ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలు లేకపోవడం.

…………………………

 • తెలంగాణ సెంటిమెంట్  కారణంగా ఓటమి భయంతో ఈసారి పోటీకి దూరంగా ఉండాలనే ఆలోచనలో సిట్టింగ్ ఎమ్మెల్యే మండవ ఉన్నట్టు తెలుస్తోంది.
 • దీంతో టీడీపీ తమ పార్టీ నుంచి అభ్యర్ధిని నిలబెట్టలేదు. పొత్తు పార్టీ బీజెపీ నుంచి గడ్డం ఆనంద్ రెడ్డికి టికెట్ ఖరారు అయింది.
 • టీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పోటీలో ఉన్నారు.
 • కాంగ్రెస్ తరపున పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ బరిలోకి దిగుతున్నారు.
 • 2009లోను, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అర్బన్ లో దెబ్బతిన్న డీఎస్ ఈసారి రూరల్ పై దృష్టిపెట్టారు.
 • సెంటిమెంట్ తో పాటు బీసీ ఓట్లు కూడా కలిసొస్తాయన్నది ఆయన లెక్క.

నిజానికి, గతంలో నిజామాబాద్ రూరల్ స్థానంలో డిచ్ పల్లి నియోజకవర్గం ఉండేది. నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత 2009 నుంచి నిజామాబాద్ రూరల్ స్థానం తెరపైకి వచ్చింది.

 • డిచ్ పల్లిగా ఉన్న సీట్లో 1952లో సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాసరావు గెలిచారు.
 • తర్వాత 1978లో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి బాల్ రెడ్డి… కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.
 • ఆపై 1983 నుంచి ఈ సీటు టీడీపీకి కంచుకోటగా మారింది.
 • నాటి ఎన్నికల్లో థామస్ చౌదరి గెలిచారు.
 • 1985 నుంచి మండవ హవా మొదలైంది.
 • ఆయన 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా పట్టు నిలబెట్టుకున్నారు.
 • 2004లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం గంగారెడ్డి మొదటిసారి మండవను మట్టి కరిపించారు.
 • ఇక 2008లో టీఆర్ఎస్ రాజీనామాలతో ఇక్కడ ఉప ఎన్నికలు జరిగాయి.
 • ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత గెలిచారు.
 • చివరికి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుతో మండవ మళ్ళీ ఆకుల లలితపైనే గెలిచి మరోసారి పట్టునిలబెట్టుకున్నారు.

………………………..

డిచ్ పల్లిలోగానీ, ఇప్పుడు నిజామాబాద్ రూరల్ లోగానీ మొదటినుంచీ బీసీలు, ఎస్టీ, ఎస్సీలే 85 శాతం మంది దాకా ఉన్నారు. కానీ దాదాపుగా ప్రతిసారి అగ్రకులాలకు చెందిన అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు.

 • 2008 ఉప ఎన్నికల్లో గెలిచిన ఆకుల లలిత ఒక్కరే బీసీ వర్గానికి చెందిన నేత.
 • మారిన పరిణామాల్లో ఈసారి బీసీలనే పోటీపెట్టాలనే ఆలోచనలో పార్టీలు ఉన్నట్టు తెలుస్తోంది.
 • మండవ పోటీ చేయకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా డీఎస్ కు గెలుపు ఈజీ అవుతుందన్న అంచనాలున్నాయి.
 • కానీ స్థానికంగా కాంగ్రెస్ కు నాయకత్వ లోపం ఉండడమే ఆ పార్టీకి మైనస్ గా మారుతోంది.
 • గత ఎన్నికల్లో మండవ 28వేల ఓట్ల మెజారిటీతో గెలిస్తే, మూడో స్థానంలో ఉన్న పీఆర్పీ అభ్యర్థికి 18వేల దాకా ఓట్లు పడ్డాయి.
 • ఈ ఓట్లతో పాటు సెంటిమెంట్ ఓట్లపైనా కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.
 • ఇక వైసీపీ నుంచి బొడ్డు గంగారెడ్డి బరిలోకి దిగుతున్నారు.

 • ఎటు నుంచి చూసినా ఈసారి నిజామాబాదం రూరల్ లో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యే గట్టి పోటీ కనిపిస్తోంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy