నిన్నటి అసెంబ్లీ అంతర్ దృశ్యం: గ్యాలరీ నుండి…

asse

నిన్నటి (21.01.2014)  సభ దృశ్యాన్ని మీముందుంచుతున్న ….

యావత్ రాష్ట్రం అసెంబ్లీ వైపు ఉత్కంఠగా చూస్తోంది. తెలంగాణ బిల్లుపై చర్చ ఎట్లా జరుగుతుందోనని జనమంతా ఆసక్తిగా టీవీలకు అతుక్కుని కూర్చుంటున్నారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువులోగా బిల్లును తిరిగి పంపుతారో లేదోనని తెలంగాణ వాసులు, విభజను అడ్డుకుంటారా లేక సీమాంధ్ర ప్రజల కోసం ఏఏ డిమాండ్లు అడుగుతారు అని ప్రజలు క్షణ క్షణం మిస్ కాకుండా అసెంబ్లీ లైవ్ చూస్తున్నారు. కాని అసెంబ్లీలో మాత్రం రివర్స్ లో ఉంది. దాదాపు ఎనిమిది కోట్ల మంది భవితవ్యాన్ని నిర్ణయించే తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరుగుతుంటే…  నిన్నటి అసెంబ్లీలో  సగం మంది సభ్యులు కూడా లేరు. ఇక అక్బరుద్దీన్ స్పీచ్ కాగానే ఏఐఎంఐఎం పార్టీ వాళ్లు ఒకరో ఇద్దరు తప్పా అందరు వెళ్లిపోయారు. ఆయన ఇంగ్లీషులో ప్రసంగించాడనో ఏమో ఆ టైంలో చాలామంది గౌరవ సభ్యులు హౌజ్ లో న్యూస్ పేపర్ చదువుతూ కనిపించారు. సాయంత్రం సభ ముగిసేనాటికి పావు వంతు సభ్యులు కూడా సభలో లేరు. కుర్చీలన్నీ ఖాళీలే.

ఇక సోనియానే  తెలంగాణ ఇచ్చిందని చెప్పుకునే టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దారుణం. యాభై మందికి పైగా ఉండాల్సిన వాళ్లలో పట్టుమని పది మంది కూడా లేరు. ఉదయం 10 గంటల కల్లా తెలంగాణ మంత్రుల్లో ఒకరిద్దరు తప్పా మిగతా వాళ్లంతా తమ సీట్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డిదీ ఇదే పరిస్థితి. కొద్దిసేపు మాత్రమే సభలో ఉన్న సీఎం…ఆ ఉన్న కాసేపూ నవ్వులతో కాలం గడిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి ఆయనతో ఏమేమి మాట్లాడారో తెలియదు కాని దూరం నుంచి చూస్తున్న వాళ్లకు మాత్రం ఇద్దరు తెగ జోకులెసుకున్నట్లు కనిపించింది. ఇద్దరు ఒకటే నవ్వులతో కాలక్షేపం చేశారు.    అటు సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యుల పరిస్థితి మరీ దారుణం. సభ ప్రారంభం కాగానే చాలా మందే కనిపించినా సాయంత్రానికి చూస్తే తెలంగాణ కాంగ్రెస్ సభ్యులకంటే కంటే కూడా తక్కువమందే మిగిలారు.  పొద్దున్నే రాగానే హాజరు వేయించుకుని అంతా జంప్. సభకు వచ్చిందే చాలా తక్కువ మంది సభ్యులు. వాళ్లలో కొందరు వచ్చీ రాగానే నిద్రలోకి జారుకుంటున్నారు. కాంగ్రెస్ సీమాంధ్ర ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు అయితే ప్రపంచం మరిచి నిద్రపోయారు. అసెంబ్లీలో గొడవ జరిగితే కానీ ఆయన నిద్రనుంచి లేవలేదు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రాంతాలుగా విడిపోయింది,  సభలో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. కాని టీడీపీ లో మాత్రం వాదాలు వేరుగా ఉన్నా అంతా చంద్రబాబునాయుడుకే జీ హుజూర్ అనడం మాత్రం స్పష్టంగా కనిపించింది. కేటీఆర్ మట్టిబొమ్మల కామెంట్ పై సీమాంధ్ర టీడీపీ వాళ్లు నానా యాగి చేశారు. ఈ గొడవలో తమ తెలంగాణ నేతలను కూడా ఇన్వాల్వ్ చేయాలనుకున్న ధూళిపాళ్ల నరేంద్ర ఎర్రబెల్లి చెవిలో ఏదో చెప్పారు. అంతే ఆయన మైక్ అందుకుని టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ ను చంద్రబాబును విమర్శిస్తావా నేనేం చేస్తానో చూడు అంటూ….  చరిత్ర తవ్వి “ఎన్టీఆర్ ను గద్దె దించింది చంద్రబాబు కానే కాదు కేసీఆరే…” అని కామెంట్ చేశారు ఎర్రబెల్లి.  తర్వాత వచ్చిన మోత్కుపల్లి కూడా అదే సీన్ ను రిపీట్ చేశారు. ఇలాంటి సీన్లు అసెంబ్లీలో రోజూ ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి.

సంగప్ప జెనవాడే

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy