నిప్పుల కలం నిలిచిపోయింది

siviహేతువాదానికి మహోగ్ర రూపం సీవీ. కొన్ని తరాలను కదిలించిన నిప్పుల కలం అది. వైజ్ఞానిక సారస్వతంతో తెలుగునేలను సారవంతం చేసిన మేథోబలం సీవీ. చిత్తజల్లు వరహాలరావు అంటే ఎవరికి తెలియదు. సీవీ పేరు చెబితే ‘ఔనా..’ అంటారు. అలా తెలుగు సాంస్కృతికోద్యమ సేనానిగా ప్రసిద్ధులైన సీవీ మంగళవారం అర్ధరాత్రి విజయవాడ భవానీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. ఆయనకు భార్య స్వతంత్రభారతి, కుమారుడు ఉదయ్‌భాస్కర్‌ ఉన్నారు. ఆయన భౌతికకాయాన్ని చిన్నఅవుటపల్లి లోని ప్రైవేటు ఆస్పత్రికి కుటుంబసభ్యులు అప్పగించారు. పలువురు ప్రముఖ రచయితలు, హేతువాదులు సీవీ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. సీవీ చేసిన సాహిత్యసేవను, సాంఘిక విప్లవ కార్యక్రమాలను స్మరించుకున్నారు.

కుల వ్యవస్థ, ఛాందస మత ధర్మాలు, అమానవీయ రాజకీయ వాతావరణంపై తన పదునైన కలంతో దునుమాడిన మేథావి సీవీ.  1930 జనవరి 14న గుంటూరులో జన్మించారు ఆయన. మద్రా‌స్ లో ఎంఏ పూర్తిచేసి, సహకార శాఖలో ఆడిటర్‌గా పనిచేశారు. ఈ కాలంలోనే ఆయన సాంఘిక పరిస్థితులపై లోతైన అధ్యయనం చేశారు. సమాజాన్ని పీడిస్తున్న కులమత దురాచారాలపై అప్పటి కమ్యూనిస్టు ఉద్యమాల ప్రేరణతో పోరాడాలని గట్టిగా నిర్ణయించుకొన్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసి విజయవాడలో పాత్రికేయ రంగంలోకి అడుగుపెట్టారు. జనశక్తి పత్రికలో ఆయన తొలి రచనలు అచ్చయ్యాయి.

విజయశ్రీ, అరుణశ్రీ అనే కలం పేర్లతో వ్యాసాలు

నిప్పులు కక్కే ధోరణి కలిగిన ఆయన వ్యాసాలు తెలుగు సమాజాన్ని ఊపేశాయి. విజయశ్రీ, అరుణశ్రీ అనే కలం పేర్లతోనూ రాశారు.  ముఖ్యంగా ఆయన ఎంచుకొనే పదజాలం, దీర్ఘ వాక్యాలు, పదబంధాలు చదువరుల ఆలోచనలను వేడెక్కించి, కార్యాచరణకు పురిగొల్పేవి. కేరళలో నంబూద్రిపాద్‌ ప్రభుత్వ పతనంపై ‘విషాధ భారతం’ అనే రచన చేసి జనసామాన్యాన్ని మెప్పించారు. తిరుమల, శ్రీశైలం, అన్నవరం తదితర పుణ్య క్షేత్రాలు ఉనికిలోకి వచ్చిన నేపథ్యంలోని అట్టడుగు తెగలు, కులాలను వెలుగులోకి తెస్తూ.. ‘సత్యకామ జాబాలి‘, ‘నరబలి’ వంటి రచనలు చేశారు. సీవీ రచించిన పారిస్‌ కమ్యూన్‌, ఊళ్లోకి సాములోర్లు వచ్చారు వంటి కావ్యాలు తమను కమ్యూనిస్టులను, హేతువాదులను చేశాయని చెప్పుకొనేవారు ఈనాటికీ కనిపిస్తుంటారు. ఆయన రచనలను ఇటీవల ప్రజాశక్తి బుక్‌హౌస్‌ 16 సంపుటాలుగా వెలువరించింది.

‘‘సీవీ వచన కావ్యం మేము చదువుకునే రోజుల్లో మమ్మల్ని కదలించి, ఊగించి, లాలించి, ఉరవళ్లు పరవళ్లు తొక్కించింది. సీవీ రచనల ప్రేరణ ఆ తరంపై బలంగా ఉంది. ఆ తరమూ సీవీని మర్చిపోదు. ఆయన వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, సత్యకామ జాబాలి, చార్వాక దర్శనం లాంటి రచనలు మచ్చుకు కొన్ని.. ఆయన అక్షరాలు నిత్యజ్వలన స్వరాలు’’ అని ప్రముఖ రచయిత రాధ మల్లన్న గౌడ్ కొనియాడారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy