నిలిచిన టీచర్ల ఏకీకృతం..ప్రమోషన్లకు బ్రేక్

school-teachersపంచాయతీరాజ్‌, ప్రభుత్వ టీచర్లకు ఒకే సర్వీసు నిబంధనల కింద ప్రమోషన్లు ఇవ్వాలన్న తెలంగాణ నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. సవరించిన రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా, యథాతథస్థితి(స్టేట్‌సకో) కొనసాగించాలని హైకోర్టు  ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌, జస్టిస్‌ ఉమాదేవిల ధర్మాసనం సోమవారం (జులై31) ఉత్తర్వులిచ్చింది. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది. ఏకీకృత సర్వీసు నిబంధనల కోసం రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కొందరు టీచర్లు దాఖలు చేసిన పిటిషన్లను  కోర్టు మరోసారి విచారించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371(డి)కి విరుద్ధంగా ఏకీకృత సర్వీసు నిబంధనలను ఆమోదిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్‌.రామచందర్‌రావు వాదించారు.

మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల ఉపాధ్యాయులు స్థానిక సంస్థల నియంత్రణలో ఉంటారని, వారిని ప్రభుత్వ టీచర్లుగా పరిగణించడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగానే ప్రమోషన్లు కల్పిస్తున్నారని…. ఆ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధమని వివరించారు. అయితే ఆర్టికల్‌ 371(డి) ప్రకారం రాష్ట్రపతికి ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఉందని అదనపు ఏజీ జె.రామచందర్‌రావు తెలిపారు. దీనిపై పూర్తి విచారణ చేపట్టాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

హైకోర్టు స్టేట్‌సకో ఉత్తర్వులు ఇవ్వడంతో ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌కు మరోసారి బ్రేక్‌ పడింది. దీంతో ఉమ్మడి సీనియార్టీ జాబితా ఆధారంగా ప్రమోషన్లు వస్తాయని ఎంతో ఆశపడ్డ టీచర్లకు నిరాశఎదురైంది.

12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పంచాయతీరాజ్‌ టీచర్లను లోకల్‌ కేడర్‌గా అసైన్‌ చేసుకునేందు కు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ప్రతిపాదనలు సిద్ధం చేసి, కేంద్రానికి పంపించాయి. పంచాయతీరాజ్‌ టీచర్లు, హెచ్‌ఎం, ఎంఈఓ, డైట్‌ సీనియర్‌ లెక్చరర్‌ పోస్టులను లోకల్‌ కేడర్‌లో పొందుపర్చాలన్న 2 రాష్ర్టాల విజ్ఞప్తి మేరకు రాష్ట్రపతి ఇటీవల గ్రీన్ సిగ్నలిచ్చారు. వెంటనే కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దానికి అనుగుణంగా విద్యాశాఖ నిబంధనల రూపకల్పనలో నిమగ్నమయింది. రేపో మాపో విద్యాశాఖ సర్వీసు నిబంధనల ఉత్తర్వులు జారీ చేస్తుందని, దసరాలోపు పదోన్నతులు లభిస్తాయని టీచర్లు ఆశపడ్డారు. హైకోర్టు ఆదేశంతో సర్వీసు రూల్స్‌ జీవో జారీకి బ్రేక్‌ పడింది. కేసు విచారణ పూర్తయ్యేందుకు సమయంపట్టే అవకాశం ఉండటం, ఫార్మేటివ్‌ 1 పరీక్షలు కూడా పూర్తి కావడంతో ఈ విద్యా సంవత్సరంలో ప్రమోషన్ల ప్రక్రియ జరిగేలా కనిపించడం లేదు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy