నువ్వు మళ్లీ పుట్టాలని…

09ddb721_2527471fకలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి. ఈ మాటను పది మందికి చెప్పడమే కాదు. తాను కూడా ఆచరించి.. జీవితాన్ని చరితార్థం చేసుకున్న మహనీయుడు.. మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగే ఉండాలన్న సందేశాన్ని చేతల్లో చూపిస్తూ.. ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఈ తరం గొప్ప వ్యక్తి మన కలాం. ఇవాళ కలాం 85వ జయంతి సందర్భంగా… దేశం ఆ మహానుభావుడి సేవలు స్మరించుకుంటోంది. కలాం మళ్లీ పుట్టాలని కోరుకుంటూ… ఘన నివాళి అర్పిస్తోంది.

తమిళనాడులోని రామేశ్వరంలో.. పేద ముస్లిం కుటుంబంలో పుట్టి… దేశాన్ని మిస్సైల్ పవర్ గా మార్చిన గొప్ప వ్యక్తి… మాజీ రాష్ట్రపతి, ఏపీజే అబ్దుల్ కలాం. 1931 అక్టోబర్ 15న జన్మించిన ఆయన… తర్వాత కాలంలో దేశ ముఖ చిత్రాన్నే మార్చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఇండియాలో పెరిగి..చదువుకుని.. పరిశోధనలు చేసి..ఆఖరికి ఇండియాకే పాఠాలు చెప్పి..భారతావని బ్రాండ్ అంబాసిడర్ లా మారిన ఒకే ఒక్కడు అబ్దుల్ కలాం.

నేర్చుకోవడం కలాం హాబీ. చదవడం ఆయన ప్యాషన్. తెలుసుకున్న ప్రతి విషయాన్ని..నలుగురితో పంచుకోవడం ఇష్టం. ఇదే తపనతో ప్రపంచాన్ని చదివి… సమాజాన్ని స్కాన్ చేసి.. మేధావి అనిపించుకున్నారు కలాం. యంగ్ ఏజ్ లోనే ఫిజిక్స్ ను వడబోసి.. తర్వాత ఏరో స్పేస్ లో ఇంజినీరింగ్ పూర్తిచేసి…విజ్ఞానశాస్త్రంలో వరుస పరిశోధనలు చేశారు. శాస్త్రాన్నే కొత్త స్టాండర్డ్స్ కు తీసుకెళ్లారు. యుద్ధ పైలట్ కావాలన్న ఆశతో పరీక్ష రాసి ఫెయిలైన అబ్దుల్ కలాం…ఆ తర్వాత దేశాన్ని తన మార్గంలో నడిపి అసలైన పైలట్ అనిపించుకున్నారు.

ఫిజిక్స్ సైంటిస్ట్ గా శాస్త్ర సాంకేతిక రంగాల్లో చరిత్రాత్మక విజయాలు ఎన్నో సాధించిన కలాం కెరీర్…డిఫెన్స్ తో మొదలైంది. రక్షణ రంగానికి అవసరమైన తేలికపాటి హెలికాప్టర్ తయారీ ప్రాజెక్ట్ లో కలాంకు మొదట ఛాన్స్ వచ్చింది. ఆ పోస్ట్ లో ఎక్కువ కాలం ఉండలేకపోయిన కలాం…ఇస్రో వైపు అడుగులు వేశారు. అక్కడే ఆయన రాకెట్  మేకర్  అయ్యారు. ఎస్ ఎల్ వీ, పీఎస్ ఎల్ వీ రాకెట్ల మేకింగ్ తో…మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎదిగారు. అగ్ని, పృధ్వీ సహా అనేక మిస్సైల్స్ ఆయన డైరెక్షన్ లోనే నింగిలోకి దూసుకెళ్లాయి. బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధికి ఏర్పాటైన ప్రాజెక్ట్ డెవిల్ మరియు ప్రాజెక్ట్ వలింట్ లకు కలాం డైరెక్టర్ గా పనిచేశారు. జూలై 1992 నుండి డిసెంబర్ 1999 మధ్య ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్యకార్యదర్శి గా వ్యవహరించారు. సేమ్ టైమ్ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కలాం కీ రోల్ ప్లే చేశారు.  వైద్య పరిశోధనాల్లోనూ కలాం సత్తా చాటారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమ రాజు పాటు.. రీసెర్చ్ చేశారు. తక్కువ ధర కలిగిన కొరోనరీ స్టెంట్ ను అభివృద్ధి చేశారు. 2012లో ఇద్దరూ కలిసి, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం టాబ్లెట్  పీసీని రూపొందించారు. కృత్రిమ తేలిక కాలు తయారు చేయడంలో కలాం చేసిన పరిశోధనలు.. వికలాంగులకు వరంగా మారాయి.

పుట్టిన దేశం కోసం…జీవితాన్నంతా ధారపోసి…అణువణువునా భారతీయతను నింపుకున్న మిస్సైల్ మ్యాన్…భారత ప్రథమ పౌరుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి భవన్ కు వెలుగులు అందించి… ప్రజాభవన్ గా మార్చేశారు కలాం. అందరివాడుగా..అందరితో కలిసిపోయారు. ఆ హోదా ముగిసన తర్వాత… మాజీ రాష్ట్రపతిగా సామాన్యుడిగానే జీవించారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్సీలో గేస్ట్ ప్యాకల్టీగా క్లాసులిచ్చారు కలాం. అంతులేని దేశభక్తుడు అబ్దుల్ కలాం. చేసే ప్రతి పనిలో..వేసే ప్రతి అడుగులో దేశాన్ని చూసుకునేవారు కలాం. తన మల్టీ టాలెంట్ తో  పరిశోధనాల్ని పరుగులు పెట్టించారు. తాను చేస్తూనే..నలుగురికి మార్గదర్శకుడయ్యారు. సీనియర్లైనా.. జూనియర్లైనా..అభిప్రాయాల్ని షేర్ చేసుకునేవారు అబ్దుల్ కలాం. మిస్సైల్ మ్యాన్ గా..సైంటిస్ట్ గా..ఎంత ఎదిగినా..ఒదిగి అడుగులు వేశారు. అణుశాస్త్ర పితామహుడు హోమీ జే బాబా లేని లోటు తీర్చారు కలాం.

పాఠాలు, ప్రసంగాలతో యువతరాన్ని వెన్నుతట్టి లేపిన ఈ భారతరత్నం.. పుస్తకాలు, రచనలతోనూ.. నవతరం మెదళ్లలో అగ్ని రాజేశారు. ప్రాథమిక స్థాయిలోనే పిల్లల్లో క్రియేటివిటీ పెంచే చదువులు రావాలని పిలుపునిచ్చారు. బట్టీపట్టే చదువులు కాదు.. ప్రయోగాలు ముఖ్యమని విద్యావ్యవస్థకు దిక్చూచి అయ్యారు. విద్యార్థుల్లో నిరంతరం స్ఫూర్తి నింపాల్సింది ఉపాధ్యాయుడేనని చెప్పడమే కాదు… చేసి చూపించారు. దేశానికే ఆదర్శప్రాయమైన ఉపాధ్యాయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. చివరి క్షణాల్లోనూ… విద్యార్థులకు పాఠాలు చెబుతూనే తుదిశ్వాస విడిచారు. అంతటి మహానుభావుడు మన మధ్య లేకున్నా… ఆయన సేవలు మాత్రం కలకాలం నిలిచి ఉంటాయి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy