ప్రజల కోసం తపించిన మహాకవి

పుట్టుక  నీది.. సావు  నీది. బతుకంతా  తెలంగాణది… అని  చెప్పిన కవి  కాళోజీ నారాయణరావు. ఈయన కష్టాలుపడే  జనాల కోసం  కలాన్ని వాడారు. వాళ్ల కోసమే  మాట్లాడారు. ఆలోచన, రాత, గీత అంతా లోకం  మంచిగ ఉండాలని కలలుగన్నారు. మన తెలంగాణ  భాష, యాస ఎంత మంచిగుంటుందో  రాసి మరీ  చూపించారు. ఆ మహానుభావుడి 104వ  జయంతి ఇవాళ.

కాళోజి నారాయణ రావు..తెలంగాణ ప్రజల గుండెలో నిలిచిన మహాకవి. సమాజ అసమానతలపై పదునైన కవితలను తూఠాలుగా పేల్చిన ప్రజా కవి. నీతి, నీజాయితి…అంతకు మించిన చిత్తశుద్దిని తన కవితలలో అణువణువూ చూపిన మహనీయుడు. కవితావేశం నిండిన గొంతుకతో తెలంగాణ ప్రజలను మేల్కొలిపిన కాళోజి…తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయుడు. ప్రజల గుండెల్లో పదికాలాలు నిలిచిపోయే ధన్య జీవి. నా గొడవతో వేల మెదళ్లు…కాదు..కాదు లక్షల మెదళ్లను కదిలించిన కాళోజి పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాం రాజా కాళోజి. 1914వ సంవత్సరం సెప్టెంబర్ 9న కర్నాటకలోని బీజాపూర్ జిల్లా రట్టేహళి గ్రామంలో జన్మించారు. తండ్రి కాళోజీ రంగారావు, తల్లి రమాబాయమ్మ. ఆ కుటుంబం వరంగల్ జిల్లా మడికొండకు మకాం మార్చంది. కాళోజి చిన్నతనంలో తల్లి చనిపోవడంతో అన్న పెంపకంలో పెరిగారు.

కాళోజీ ఉన్నత విద్య పూర్తి కాగానే 1940లో రుక్మిణీభాయి తో వివాహం జరిగింది . వీరికి ఒక కుమారుడు రవికుమార్. కాళోజీ కవితల్లో ప్రత్యేక శైలి కనిపిస్తుంది. ఆయన రచనలు భావావేశ రస గుళికలు.  సామాన్యుడి భాష, యాసలోనే రచనలు కొనసాగేవి. అవి కూడా సూటిగా ప్రజల గుండెలను తట్టిలేపుతాయి.  “అన్యాయాన్నెదిరిస్తే… నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే… నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్నెధిక్కరించినోడు నాకు ఆరాధ్యుడు…వాడు మనోడైనా …మావో వాదైనా. ఇవి చాలు తన రచన విశిష్టతను ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అంటూ పరుష పదజాలంతో విమర్శించినా ఆయనకే చెల్లు.  ఆయన రచనల్లో నా గొడవ, కాళోజీ కథలు సుప్రసిద్ధమైనవి.

స్వాతంత్రోద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు కాళోజి అలుపెరగని పోరాటం చేశారు. నిజాం నిరంకుశత్వాన్ని అంతమొందించడంలో  ప్రముఖ పాత్ర పోషించారు. ఏ ఇజానికి కట్టుబడని ప్రజాయిజం ఆయనది. ఆర్యసమాజ్, కాంగ్రెస్ , కమ్యూనిస్టులు ఇలా అందరితో కలిసి అన్యాయంపై  పోరాడారు. మొదట్లో విశాలాంధ్రను కోరినా ….తర్వాత కాలంలో విశాలాంధ్రతో వచ్చే నష్టాలను గుర్తించి… 1969లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి పూర్తి మద్దతు ఇచ్చారు. జీవితాంతం తెలంగాణా రాష్ట్రం కోసం పరితపించారు. కాళోజీ దిక్కార స్వరం వినిపించినప్పటికి…. రచనలకు పురస్కారాలు కూడ దక్కాయి. జీవన గీతం రచనకు 1968 లో ఉత్తమ అనువాద రచన అవార్డు వచ్చింది. 1992లో ఫధ్మవిభూషణ్ పురస్కార్ లబించింది. అయితే ఆయన ఎప్పుడు అవార్డులను ఇష్టపడేవారు కాదు.

పుట్టుక నీది, చావు నీది బతుకంతా దేశానిది అన్నట్టు జీవితాన్ని ప్రజలకు అర్పించిన కాళోజి 2002 నవంబర్ 13 న కన్నుమూశారు. ప్రజల కోసం నిత్యం పరితపించిన ఈ కవితామూర్తి ఆశయాలు భవిష్యత్ తరాలకు ఆదర్శం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy