నేతన్నలకు నూలు, రసాయనాలపై 50% సబ్సిడీ: కేటీఆర్

ktr-netannaరాష్ట్రంలోని నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు మంత్రి కేటీఆర్. భూదాన్ పోచంపల్లిలో నేతన్న చేయూత పొదుపు పథకాన్ని ప్రారంభించారు. పోచంపల్లి నుంచి నేతన్నకు చేయూత పథకం ప్రారంభించడం సంతోషాన్ని కల్గిస్తుందన్నారు మంత్రి. పోచంపల్లి చేనేత కళాకారులకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ పథకాన్ని పోచంపల్లి నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. నేతన్నల కష్టాలు సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ. 75 కోట్లు కేటాయించారని తెలిపారు. చేనేత, జౌళి శాఖకు బడ్జెట్‌లో రూ. 1283 కోట్లు కేటాయించారన్నారు. ప్రతి నేత కార్మికుడి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని స్పష్టం చేశారు. నేతన్నలకు నూలు,  రసాయనాలపై 50 శాతం సబ్సిడీని త్వరలోనే ఇస్తామని ప్రకటించారు. ఫ్యాషన్  రంగానికి సమాంతరంగా చేనేత వస్త్రాలను తీస్కెళ్తామన్న కేటీఆర్…త్వరలోనే పోచంపల్లిలో నేత బజార్ ఏర్పాటు చేస్తామన్నారు. నేతన్న చేయూత కార్యక్రమంలో మంత్రులు ఈటల, జోగు రామన్న, జగదీశ్‌ రెడ్డి పాల్గొన్నారు.

పథకం వివరాలు

  • 18 ఏళ్లు నిండిన చేనేత కార్మికులు(వీవర్స్, డైయర్స్, వెండర్స్, వార్పర్స్, సహాయ వీవర్స్) అందరూ ఈ పథకానికి అర్హులు.
  • లబ్ధిదారుని వాటాగా వేతనంలో 8 శాతం పొదుపు పథకంలో జమ చేయాలి, ప్రభుత్వ వాటా 16 శాతం జమ చేయబడుతుంది(గరిష్టంగా రూ. 2,400ల వరకు జమ చేయబడుతుంది).
  • నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, సంబంధిత సహాయ సంచాలకుల వారికి సమర్పించాలి.
  • లబ్ధిదారుడు ప్రకటించిన నెలసరి వేతనంలో 8 శాతం ఆర్.డి-1 ఖాతాలో ప్రతి నెల 15వ తేదీలోగా జమ చేయాలి. ప్రభుత్వ వాటా 16 శాతం ఆర్.డి-2 ఖాతాలో జమ చేయబడుతుంది.
  • 36 నెలల(3సంవత్సరాలు) తర్వాత ఆర్.డి-1 మరియు ఆర్.డి-2 ఖాతాల్లో జమ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి తీసుకోవచ్చు.
  • తెలంగాణలో చేనేత వృత్తిపై ప్రత్యక్షంగా పని చేస్తున్న నేతన్నలందరికీ ఈ పథకం ద్వారా భవిష్యత్‌కు భద్రత కలుగుతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy