నేషనల్ హెరాల్డ్ వెనకున్న అసలు కథేంటి..?

sonia-herald-caseనేషనల్ హెరాల్డ్ ఇష్యూ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అధినేత్రిని కోర్టు మెట్లెక్కేలా చేస్తోంది. ఇంతకూ నేషనల్ హెరాల్డ్ ఇష్యూ ఏంటి..? దీనికి సోనియా, రాహుల్ గాంధీలకు సంబంధమేంటి?

నెహ్రూ భావజాల వ్యాప్తికి…

భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1938లో దీన్ని స్థాపించారు. దీనికి ఆయనే సంపాదకుడిగా ఉండేవారు. స్వాతంత్రోద్యమ కాలంలో బ్రిటీష్ రాజ్ కు వ్యతిరేకంగా దీన్ని స్థాపించారు. ఈ పత్రికలో చాలా మంది సంస్థానాధీశులు, స్వాతంత్ర్య సమరయోధులు పెట్టుబడులు పెట్టారు. దీని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చైర్మన్ గా నెహ్రూ ఉండేవారు. నెహ్రూ తర్వాత ఈ పత్రికకు తెలుగువాడైన కె.రామారావు ఎడిటర్ అయ్యారు. ఈ పత్రిక స్థాపించిన మొదట్లో ప్రచురణను అసోసియేటడ్ జర్నల్స్ లిమిటెడ్ కు అందించారు నెహ్రూ. ఈ సంస్థ నేషనల్ హెరాల్డ్ తో పాటు నవజీవన్ అనే హిందీ పేపర్, ఖ్వామీ ఆవాజ్ అనే ఉర్దూ పేపర్ ను తెచ్చింది.

నేషనల్ హెరాల్డ్ తో తెలుగువాళ్లకు అవినాభావ సంబంధం

రామారావు పూర్తి పేరు కోటమరాజు రామారావు. ద్రోణాచార్య ఆఫ్ ఇండియన్ జర్నలిజమ్ గా కీర్తి గడించిన ప్రసిద్ధ సంపాదకుడు. ఆంధ్రప్రదేశ్ లోని చీరాలలో పుట్టిన రామారావు.. జీవితాంతం దేశం కోసమే పని చేశారు. తన జీవిత కాలంలో 20 పత్రికలకు పైగా సంపాదకత్వం వహించారు. ముక్కుసూటి మనిషిగా పేరున్న ఆయన.. తన జేబులో ఎప్పుడూ రాజీనామా లేఖ కూడా పెట్టుకొని తిరిగేవారట. నైతిక విలువలకు వ్యతిరేకంగా పని చేయాల్సి వస్తుందేమోనని.. ఎప్పుడైతే అలాంటి సందర్భమొస్తుందో అప్పుడు రాజీనామా చేయడానికి రెడీ అయ్యేవారట. రాజ్యసభ సభ్యుడిగా కూడా తన సేవలు అందించారు. సర్వేపల్లి, అంబేద్కర్ లాంటి మహామహులు ఆయన్ను ఎంతగానో అభిమానించేవారు. బ్రిటీష్ ప్రభుత్వంపై సంపాదకీయాలు రాసినందుకు లాహోర్ జైలులో శిక్ష కూడా అనుభవించారు. ఇలాంటి మహనీయుల సంపాదకత్వంలో నేషనల్ హెరాల్డ్ నడిచింది.

ఆ తర్వాత దీనికి మరో తెలుగు వాడు మణికొండ చలపతిరావు ఎడిటర్ అయ్యారు. 1946 నుంచి 1972 వరకు 26 ఏళ్లపాటు సంపాదకీయ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ విధానాల విమర్శించడంలో రామారావు లాగే ముక్కుసూటిగా ఉండేవారు ఎంసీ(మణికొండ చలపతిరావు). ఇందిరా హయాంలో ఆయన్ను పత్రిక నుంచి తప్పించడానికి చాలా ప్రయత్నించారని ఆ నాటి నేతలు చెబుతుంటారు. చివరికి ఆయనే పత్రిక నుంచి వైదొలిగారు. అయితే తర్వాతి కాలంలో నష్టాలు అధికం కావడంతో 2008లో నేషనల్ హెరాల్డ్ మూతపడింది.

ఆ తర్వాతే అసలు కథ..

2010లో ఈ పత్రిక బాధ్యతలను యంగ్ ఇండియా సంస్థకు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. ఈ యంగ్ ఇండియాలో ప్రధాన వాటాదారులు కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీలు. వీరిద్దరికీ 76 శాతం వాటాలున్నాయి. నేషనల్ హెరాల్డ్ పత్రికను పబ్లిష్ చేస్తున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు 90 కోట్ల రుపాయలు రుణమిచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ కు 2000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 90 కోట్ల రూపాయల రుణం తీర్చలేని పరిస్థితుల్లో ఈ పత్రికను కాంగ్రెస్ పార్టీ యంగ్ ఇండియా సంస్థకు కేవలం 50 లక్షల రూపాయలకే అప్పగించింది. బాకీ పడ్డ సంస్థను అందులోనూ 2000 కోట్ల రూపాయల ఆస్తులున్న సంస్థను  కేవలం 50 లక్షల రూపాయలకు ఎలా అప్పగించారని.. ఇదంతా కాంగ్రెస్ అధినేత్రి కుటుంబం కుట్ర అంటూ.. బీజేపీ సీనియర్ లీడర్ సుబ్రహ్మణ్యస్వామి కోర్టులో కేసువేశారు. అదే నేషనల్ హెరాల్డ్ కేసుగా ఇంతగా రాజకీయ వేడి రగిలిస్తోంది. ఈ కేసు విచారణ సందర్భంగానే డిసెంబర్ 19న హాజరు కావాల్సిందేనని ఆదేశించింది పాటియాలా కోర్టు. వ్యక్తిగత హాజరు మినహాయింపుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో సోనియా, రాహుల్ ఉన్నట్టు సమాచారం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy