నోట్ల రద్దుకి ఏడాది: బ్లాక్ మనీ ఎంతొచ్చింది.?

upa-government-black-money19801sరాత్రికి రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ తీస్కున్న నిర్ణయం అనుకున్న ఫలితాలను సాధించిందా? అవినీతిపరుల దగ్గరున్న బ్లాక్ మనీ గంగపాలు అవుతుందనుకున్న కల ఎంత వరకూ నెరవేరింది? ఎంతమంది ఫేక్ గాళ్లు వలలో పడ్డారు? ఎంత బ్లాక్ మనీ దేశం ఖజానాలో పడింది?

నవంబరు 8.. రాత్రి 8 గంటలు… పెద్ద నోట్ల రద్దు చేస్తూ.. మోడీ ప్రకటన. ఈ అర్ధ రాత్రి నుంచి వెయ్యి, 5 వందల నోట్లు చెల్లవంటూ తేల్చి చెప్పేశారు. 90 శాతం నల్లధనం.. పెద్ద నోట్ల రూపంలోనే ఉంది కాబట్టి.. వాటిని బ్యాన్ చేస్తూ షాక్ ఇచ్చారు. దీనివల్ల ఉగ్రవాదం నశిస్తుందనీ.. కొన్ని రోజులు కష్టాలు పడాలంటూనే దేశ ప్రగతి కోసం తప్పదన్నారు. కొందరికి చెల్లని నోట్లను గంగలో పడేస్కోవడం తప్ప.. మరో దారి లేకపోయింది.

నల్లధనం కలిగిన ఉన్న వారంతా వారి సొమ్మును పెద్ద నోట్ల రూపంలోనే దాచుకున్నారనే వార్త ప్రచారంలో ఉంది. దీంతో 86 శాతం వాటా కలిగి ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తే.. నల్ల కుబేరులు విలవిలలాడతారని చెప్పారు. వీటి విలువ 15లక్షల 44 వేల కోట్లు. ఇందులో కేంద్రం అంచనాల ప్రకారం 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయిలు నల్లధనం రూపంలో ఉంది కాబట్టి ఆ డబ్బు బ్యాంకులు చేరదని అంచనా వేసారు. కానీ అంచనాలు తప్పాయి. 99 శాతం మనీ బ్యాంకులలో డిపాజిట్ కాగా మిగిలన ఒక శాతం అంటే 16 వేల కోట్ల రూపాయిలే వెనక్కి రాలేదు.

రద్దైన 86 శాతం పాత నోట్లను ముద్రించడానికి అయిన ఖర్చు 30 వేల కోట్లకు పైనే. మరోవైపు కొత్త నోట్లను ముద్రించడానికి అయిన ఖర్చు సుమారు 9 వేల కోట్ల రూపాయిలు. పాత నోట్ల ఖర్చు నష్టానికి తోడు కొత్త నోట్ల ప్రింటింగ్ ఖర్చూ తప్పలేదు. దీంతో వెనక్కి రాని డబ్బు కంటే నష్టపోయిందే ఎక్కువన్న విమర్శలొచ్చాయి. రద్దయిన 15లక్షల 44వేల కోట్ల విలువైన నోట్లకు 11 లక్షల కోట్ల విలువకే ఆర్బీఐ కొత్త నోట్లు ముద్రించింది.

బ్లాక్ మనీ.. భారీగా పట్టుపడుతుందని వేసిన అంచనాలు ఫటాపంచలయ్యింది. నల్లధనం ఉన్న కుబేరుల్లో చెన్నైలో దొరికిన శేఖర్ రెడ్డి దగ్గర తప్ప పెద్దమొత్తంలో మరెవరూ దొరకలేదు. దీంతో బ్లాక్ మనీని ఎవరూ క్యాష్ రూపంలో దాచుకోలేదని తేలింది. రియలెస్టేట్, బంగారం.. వంటి రంగాలలో ఇన్వెస్ట్ చేశారు.

పెద్ద నోట్ల రద్దు ద్వారా కేంద్రం లక్ష్యాల్లో మరొకటి ఉగ్రవాదం. దేశ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులు… చేస్తున్న కార్యకలాపాలకు పెద్ద నోట్లే కారణం అన్నారు. అంతలక్ష్యం పెట్టుకొని మళ్లీ 2వేల నోట్లు ఎందుకిచ్చారన్నదానికి సరైన సమాధానం లేదు. జనానికి వెంటనే డబ్బు తిరిగిచ్చేయడానికే 2వేల నోట్లు అని చెప్పారు. అయితే ఉగ్రవాదుల చేతికి కూడా కొన్నిరోజుల్లోనే 2వేల నోట్లు చేరడం విశేషం.

పన్నులు ఎగవేతదారులు.. అవినీతిపరులు.. వారి వద్ద ఉన్న పెద్ద నోట్లను ఈజీగా మార్చేసుకున్నారు. ఇంక దొంగనోట్లను నిర్మూలించే లక్ష్యం ఎంత వరకు నెరవేరిందో ఇంత వరకు లెక్కలు చెప్పలేదు. పైగా కొత్త నోట్లకే దొంగనోట్లు అక్కడక్కడా కనిపించి కలకలం రేపాయి. పేదలకు నగదు బదిలీ కోసం కేంద్ర సర్కారు ఇప్పించిన జనధన్ ఖాతాలనే బ్లాక్ మనీ బదిలీకి తప్పుడుగాళ్లు వాడుకోవడం విశేషం. 13 రోజుల్లోనే జనధన ఖాతాల్లో 21 వేల కోట్ల రూపాయిలు జమఅయ్యాయి. రద్దుకు ముందు ఈ ఎకౌంట్లలో.. 46 వేల కోట్లు ఉంటే.. రద్దు తరువాత.. 67 వేల కోట్ల రూపాయల డిపాజిట్లు అంతకన్న ధన్ ధనాధన్ గా వచ్చి చేరాయి.

ఇంత సాహసంతో నిర్ణయం తీస్కున్నప్పుడు దాని పరిణామాలపై ఆర్ధిక నిపుణులుతో చర్చించి ఉంటే బాగుండేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు మోడీ. అనుకున్న ఫలితాలు రాకపోవడంతో పాటు కొత్త నష్టాలు తెచ్చిపెట్టారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy