నోట్ల రద్దుకి ఏడాది : రియల్ ఎస్టేట్ కుదేలు.. చిన్నవ్యాపారులపై పెద్ద దెబ్బ

old-notesసరిగ్గా ఏడాది క్రితం.. ఒక్కసారిగా డబ్బు ఆగిపోయింది. సామాన్యులు, కూలీలతో ముడిపడి ఉన్న రంగాలపై.. తీవ్ర ప్రభావం పడింది. మార్కెట్లకు ఊహించని దెబ్బ తగిలింది. దేశ ఆర్థిక రంగాన్ని నిర్ణయించే వాటిలో రియల్ ఎస్టేట్ రంగం కూడా ఒకటి. నిత్యం అమ్మకాలు, కొనుగోళ్లతో ఈ రంగం ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. అదీ కాక.. ప్రభుత్వానికి రోజూ ఆదాయం తెచ్చిపెట్టే రంగం కూడా ఇదే. ఈ రంగంలో బ్లాక్ మనీ విపరీతంగా నడుస్తుందని ఓ అభిప్రాయం ఉంది. అందుకు తగ్గట్టే.. అత్యధికంగా నగదు లావాదేవీలు.. రియల్ ఎస్టేట్ సెక్టర్ లో జరుగుతుంటాయి. ఇలాంటి రంగానికి.. డీమానిటైజేషన్ నిర్ణయం షాకిచ్చింది. వాస్తవానికి బడాబాబుల్లో చాలా మంది తమ బ్లాక్ మనీని రియల్ ఎస్టేట్ లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. రిజిస్ట్రేషన్ విలువ కంటే.. మార్కె విలువే 3, 4 రెట్లు ఎక్కువగా చూసుకుంటారు. మార్కెట్ విలువను బ్లాక్ మనీతో కట్టేస్తారు. ఇలాంటి రంగం కూడా.. పెద్ద నోట్ల రద్దు బారిన పడింది.

ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకున్నా కనీసం రోజుకు 10 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. కానీ.. నోట్ల రద్దు నిర్ణయం వచ్చిన తర్వాత మాత్రం రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పడిపోయింది. 4 నెలలపాటు దేశ వ్యాప్తంగా 90 శాతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయింది.  మన రాష్ట్రంలోనే తీసుకుంటే 2015 -16 ఆర్థిక సంవత్సరంలో 30 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి విలువ అనధికారికంగా సుమారు లక్ష కోట్లకు పైగా ఉంటుంది. అలాంటిది.. నోట్ల రద్దు టైంలో.. ఒక్కసారిగా రిజిష్ట్రేషన్స్ తగ్గిపోయాయి. కొనేవారు లేకపోవడంతో రేట్లు తగ్గుముఖం పట్టాయి. అయితే.. క్యాష్ ఫ్లో ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో.. మళ్లీ రేట్లు అంతే వేగంగా పెరిగాయి. అయినా.. ఇంకా కొనేవారి కొరత కనిపిస్తూనే ఉంది.

రియల్ ఎస్టేట్ రంగానికి తగ్గట్టే నిర్మాణ రంగం కూడా.. ఒక్కసారిగా కుదుపులకు గురైంది. ముంబై, ఢిల్లీ, పుణె, బెంగుళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో నిర్మాణ రంగం నెమ్మదించింది. ప్రభుత్వ ప్రాజెక్టులు, వంతెనలు, రహదారులు, మౌలిక వసతులకు సంబంధించిన నిర్మాణాలు, మాల్స్, బిల్డింగ్స్.. ఇలా అన్నీ నిర్మాణాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. 2014-15 ఆర్ధిక సంవత్సరంలో నిర్మాణ రంగం 4.7వృధ్ది రేటును సాధిస్తే.. 2015-16 లో 5 శాతానికి పెరిగింది. నిర్మాణ రంగం మీద మోడీ సర్కార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో 2016-17లో 7 శాతానికి తక్కువ కాకుండా వృధ్ది ఉంటుందని అంచనా వేశారు ఆర్ధిక నిపుణులు. కానీ నోట్ల రద్దు దెబ్బకు 1.7 శాతం మాత్రమే నమోదైంది.

నోట్ల రద్దు ప్రభావం మొదట చూపించింది రిటైల్ మార్కెట్ మీదే. పాల వ్యాపారం నుంచి ఇంటర్నేషనల్ పార్సిళ్ల వ్యాపారం వరకు.. అన్నిటికీ సడన్ గా బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా నిత్యవసరాలు కొనుగోలు చేసే చిల్లర దుకాణాల వ్యాపారం సడన్ గా.. కుంటుపడింది. క్రెడిట్, డెబిట్ కార్డులున్న వారు మాల్స్ లో షాపింగ్ చేయడం మొదలు పెట్టారు. దేశంలో సుమారు 5 కోట్ల మంది బతుకులు ఆధారపడిన చిల్లర కొట్ల వ్యాపారం దెబ్బతింది. మామూలుగా.. దేశ వ్యాప్తంగా కిరాణా వ్యాపారం విలువ 60 నుంచి 70 లక్షల కోట్ల రూపాయిల మేర ఉంటుంది. కార్పొరేట్ మాల్స్ ప్రభావంతో ఏటా 3 నుంచి 5శాతం సంప్రదాయ కిరాణా వ్యాపారం పడిపోతున్న సమయంలో నోట్ల రద్దు మరింత దెబ్బతీసిందంటున్నారు చిల్లర వ్యాపారులు.

డీ మానిటైజేషన్ నిర్ణయం.. రైతులకు కూడా కష్టాలనే మిగిల్చింది. పండించిన పంటకు అమ్మకాలు లేక.. తీవ్ర నష్టాలు మిగిలాయి. నోట్ల రద్దుతో లాభపడింది ఎవరన్నా ఉన్నారంటే.. ముందుగా చెప్పుకోవాల్సింది షాపింగ్ మాల్స్ గురించే. డిజిటల్ చెల్లింపులకు అనుకోకుండా ప్రాధాన్యం పెరగడంతో.. డెబిట్ కార్డులు ఉన్నవారంతా.. మాల్స్ కే వెళ్లడం మొదలు పెట్టారు. దీంతో.. ఆ రంగంలో అమ్మకాలు ఊపందుకున్నాయి. సుమారు 20 శాతానికి పైగా.. అమ్మకాల్లో వృద్ధి కనిపించింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy