
మొదటి విడత పంచాయతీ పోరులో కారు జోరు కొనసాగుతోంది. మెజార్టీ గ్రామ పంచాయతీలను టీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంటోంది. మొదటి విడతలో రాష్ట్రంలో 4వేల 479 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వీటిలో ఇప్పటికే 769 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 3వేల 701 గ్రామాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవులకు 12వేల 202 మంది పోటీపడుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా లేకపోవటంతో 192 వార్డుల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 10వేల 654వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 28వేల 976 వార్డులకు పోలింగ్ జరిగింది. 70వేల 94 మంది వార్డుమెంబర్ పదవులకోసం పోటీపడ్డారు.
మొదటి విడతలో 86.76 శాతం పోలింగ్ నమోదైంది. 41లక్షల 56వేల 414 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పురుషులు 20లక్షల 36వేల 782 మంది… స్త్రీలు 21లక్షల 19వేల 624 మంది ఓట్లేశారు. ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించనప్పటికీ.. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. దాదాపు 2వేల 68 పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచులుగా విజయం సాధించారు. 646 మంది కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించినట్లు తెలుస్తోంది. బీజేపీ మద్దతుదారులు 46 మంది, సీపీఎం మద్దతుదారులు 24 మంది, టీడీపీ 19, సీపీఐ 13, ఇతరులు 545 పంచాయతీల్లో విజయంసాధించారు.
మొదటి విడతలో ఒకటి రెండుచోట్ల తప్ప.. అన్ని పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డుమెంబర్లు.. అనుచరులతో కలిసి సంబురాలు చేసుకున్నారు. రోడ్లపై డ్యాన్సులతో ర్యాలీలు తీశారు. ఉపసర్పంచ్ పదవుల ఎంపిక.. చేయెత్తటం ద్వారా నిర్వహించనున్నారు.
అటు రెండో విడతలో 4 వేల 135 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. 788 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. మిగిలిన 3 వేల 342 సర్పంచ్ పదవుల కోసం 10 వేల 668 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారంతా తమకు కేటాయించిన గుర్తులతో ఇంటింటికి తిరుగుతున్నారు. తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాన పార్టీల ముఖ్యనేతలు ప్రచారం చేస్తున్నారు. 23 సాయంత్రం ప్రచారం ముగియనుండగా.. 25న పోలింగ్ జరగనుంది.
మూడోవిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ అభ్యంతరాల పరిశీలన చేశారు అధికారులు. రేపు(మంగళవారం) సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువిస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. మూడో విడతలో 4 వేల 116 గ్రామాల్లో ఎన్నికలు జరగనుండగా.. వందలాది గ్రామాల్లో ఒకటే నామినేషన్ వచ్చింది.