పండగలా ప్రపంచ తెలుగు మహాసభలు

kcr-teluguతెలుగు భాష – సాహిత్యాభివృద్ధి, వ్యాప్తిలో తెలంగాణలో జరిగిన కృషి ప్రపంచానికి తెలిసేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో పాటు ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగు భాషాభివృద్ధికి, వివిధ రకాల సాహితీ ప్రక్రియలో విశేష కృషి చేసిన వారిని మహాసభలకు ఆహ్వానించి గౌరవించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ సన్నాహక సమావేశం శుక్రవారం ప్రగతి భవన్ లో జరిగింది. ప్రభుత్వ సలహాదారులు శ్రీ కేవి. రమణాచారి, శ్రీ జి. వివేకానంద, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బుర్ర వెంకటేశం, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీ నందిని సిధారెడ్డి, భాషా సంఘం అధ్యక్షుడు శ్రీ దేవులపల్లి ప్రభాకర్ రావు, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శ్రీ ఆయాచితం శ్రీధర్, తెలుగు యునివర్సిటీ వీసి శ్రీ సత్యనారాయణ, అంతర్జాతీయ తెలుగు సమాఖ్య డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీ మునిరత్నం నాయుడు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి శ్రీ వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. తెలుగు మహాసభల నిర్వహణకు సంబంధించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో తెలుగు మహాసభల అంకురార్పణ జరపాలని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రముఖులను, తెలుగు పండితులను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రారంభ సభకు వచ్చిన పండితులకు ఆన్ డ్యూటీ అవకాశం ఇవ్వడంతో పాటు రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పారు. అంకురార్పణ సభ తర్వాత వారం, పది రోజుల పాటు సభలను నిర్వహించాలని, వివిధ సాహిత్య ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని చెప్పారు.

‘‘తెలుగు భాషాభివృద్దికి, సాహితీ వికాసానికి తెలంగాణకు చెందిన ఎందరో మహానుభావులు విశేష కృషి చేశారు. అన్ని సాహిత్య ప్రక్రియల్లో తెలంగాణ వారు విశేష ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. పోతన నుంచి మొదలుకుంటే ఆధునిక సాహిత్యం వరకు అనేక రచనలు చేసిన వారున్నారు. ఎన్నో సాహిత్య ప్రక్రియలను సుసంపన్నం చేసిన వారున్నారు. వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. సంప్రదాయ సాహిత్యం, అవధాన సాహిత్యం, ఆధునిక సాహిత్యంలో తెలంగాణ వ్యక్తులు చేసిన కృషి తెలిసేలా సాహిత్య సభలు నిర్వహించారు. సినీరంగం, పాత్రికేయ రంగం, కథా రచన, నవలా రచన, కవిత్వం, హరికథ, బుర్రకథ, యక్షగాణం, చందోబద్ధమైన ప్రక్రియలు తదితర అంశాల్లో తెలంగాణ సాహితీమూర్తులు ప్రదర్శించిన ప్రతిభాపాటవాలు ప్రధానాంశాలుగా తెలుగు మహాసభలు జరగాలి’’ అని సిఎం చెప్పారు.

పగటి పూట సభలు, సదస్సులు, రాత్రి సమయంలో పేరిణి నృత్య ప్రదర్శనతో పాటు వివిధ కళారూపాలు ప్రదర్శించాలని సూచించారు. మహాసభల్లో భాగంగా కవి సమ్మేళనాలు, సాహిత్య గోష్టులు, అవధానాలు నిర్వహించాలని సిఎం సూచించారు. మహాసభల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, కవితా పోటీలు నిర్వహించాలన్నారు. తెలంగాణ ప్రముఖుల రాసిన వ్యాసాలు, సాహిత్య రచనలను ముద్రించాలని సూచించారు. తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని ముంబాయి, సూరత్, బీవండి, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, షోలాపూర్, ఒరిస్సా తదితర ప్రాంతాల్లో కూడా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారున్నారని వారందరినీ తెలుగు మహాసభలకు ఆహ్వానించాలని సూచించారు. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేసియా, గల్ఫ్ తదితర దేశాల్లో కూడా తెలుగు భాష, సాహిత్యానికి సేవలందిస్తున్న వ్యక్తులు, సంస్థలున్నాయని, అందరినీ భాగస్వాములను చేయాలని కోరారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ సమన్వయంతో ఈ సభలు జరుగుతాయని స్పష్టం చేశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy