పక్కా స్కెచ్.. రూ.కోటి డీల్.. ఆ ఐదుగురే విలన్లు

నల్గొండ జిల్లా : మిర్యాలగూడలో ప్రణయ్ హత్య ఎలా జరిగిందనేది వివరంగా చెప్పారు ఎస్పీ రంగనాథ్. ఏడుగురు నిందితుల్లో మొదటి ఐదుగురే కీలకం అని.. చెప్పారు. మారుతీరావు, కిల్లర్ సుభాష్ శర్మలు ఏ1, ఏ2లుగా ఉన్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. అమృత తండ్రి మారుతీరావు.. ప్రణయ్ ను హత్య చేయించేందుకు సూత్రధారి బారీ(ఏ4)తో కోటిరూపాయల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఓ కారులో కూర్చుని మాట్లాడుకుంటూ.. అక్కడే డీల్ ఓకే చేశారు. ఈ డీల్ మొదట రూ.రెండున్నర కోట్లతో మొదలై.. రూ.కోటి దగ్గర ముగిసింది. అడ్వాన్స్ గా యాభై లక్షలను అడిగినప్పటికీ… రూ.15లక్షలు తీసుకునేందుకు అంగీకారం కుదిరింది.

మారుతీరావు, సుపారీ సూత్రధారి బారీ మధ్య 11ఏళ్ల పరిచయం ఉంది. అప్పట్లోనే కొన్ని కేసులు.. రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేసిన మారుతీరావు.. తన నేరాలకు బారీతో కొన్ని డీల్స్ చేసుకున్నాడు. ఆ పరిచయం అలా కొనసాగింది. ఈ ఏడాది జూన్ లోనే మొదట హత్య కుట్ర జరిగింది. ప్రణయ్ ను చంపే కుట్ర రచించిన తర్వాత… మారుతీరావు సహాయంతో.. నిందితుడు బారీ మిర్యాలగూడ కాంగ్రెస్ నేత కరీంను కలిశాడు. ఆ తర్వాత.. హైదరాబాద్ కు చెందిన అస్గర్ ఆలీ(ఏ3)ని కాంటాక్ట్ అయ్యాడు బారీ. అస్గర్ అలీ అప్పటికే… గుజరాత్ హోంశాఖ మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో అరెస్టై అక్కడి హైకోర్టు ఆదేశాలతో నిర్దోషిగా విడుదలయ్యాడు. అస్గర్ ఆలీకి టెర్రర్ లింకులున్నాయని పోలీసుల దగ్గర రుజువుల కూడా ఉన్నాయి.

ఏ3 అయిన అస్గర్ అలీ.. బిహార్ లో ఉండే ఓ మిత్రుడిద్వారా… సుపారీ కిల్లర్, ఏ2 అయిన సుభాష్ శర్మను బారీ కలిశాడు. నల్గొండలో.. బారీ, అస్గర్ ఆలీ, సుభాష్ శర్మ పలుమార్లు హైదరాబాద్ లోనూ, నల్గొండలోనూ కలుసుకున్నారు. జులై ఫస్ట్ వీక్ లో మిర్యాలగూడ ఆటోనగర్ లో రెక్కీ నిర్వహించారు. బారీ, అస్గర్ లను కారులో తిప్పుతూ… ప్రణయ్ ఇల్లు చూపించాడు మారుతీరావు.

జులై 9, 10 తేదీల్లో మారుతీరావు నుంచి రూ.15 లక్షలు తీసుకున్న కరీం… హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీ దగ్గర వాటిని బారీకి ఇచ్చాడు. అందులోనుంచి రూ.8లక్షలు బారీ, రూ.6లక్షలు అస్గర్, కరీం ఒక లక్ష తీసుకున్నారు. ఇలా… ముందు మాట్లాడుకోవడం, తర్వాత కుట్రలు రచించడం.. ఆతర్వాత హత్య ప్రణాళిక అమలుచేయడం జరిగాయి. కిల్లర్ సుభాష్ శర్మకోసం ఓ స్కూటీ కొని.. దానికి ఫేక్ నంబర్ పెట్టారు. బోగస్ పేర్లతో 3సిమ్ కార్డులు, చంపడానికి ఆయుధాలు కొన్నారు. కత్తులు, రాడ్లు అస్గర్ దగ్గర పెట్టుకున్నాడు.

ఆగస్ట్ 9 నుంచి రెక్కీ స్పీడప్ చేశారు. సిమ్ కార్డ్స్ వాడటం మొదలుపెట్టారు. ఆగస్ట్ 14 తారీఖున ప్రణయ్ పై తొలిసారి మర్డర్ అటెంప్ట్ చేశారు. ఓ బ్యూటీపార్లకు అమృతతో కలిసి ప్రణయ్, అజయ్ ఇద్దరూ వచ్చారు. ఐతే.. ఇద్దరిలో ఎవరు ఎవరో తెలియకపోవడంతో.. చంపాలన్న ప్లాన్ విరమించుకున్నారు నిందితులు బారీ, అస్గర్, సుభాష్ శర్మ.

అప్పటికే మర్డర్ స్కెచ్ వేసిన మారుతీరావు.. జనం దృష్టిలో తాను మంచోడిని అనిపించుకునేందుకు ఆగస్టు 17 అమృత, ప్రణయ్ లకు రిసెప్షన్ నిర్వహించాడు. రిసెప్షన్ తర్వాత.. ఆగస్ట్ 16 నుంచి 23 వరకు హైడ్రోసిల్ ఆపరేషన్ పేరుతో హైదరాబాద్ లో  ఉన్నాడు మారుతీరావు.

సెప్టెంబర్ 14. శుక్రవారం. ఆ రోజు మధ్యాహ్నమే జ్యోతి హాస్పిటర్ ముందు ప్రణయ్ హత్య జరిగింది. సుభాష్ శర్మ స్కూటీపైనే ప్రణయ్ కుటుంబం వెళ్తున్న కారును ఇంటిదగ్గరనుంచి ఫాలో అయ్యాడు. ఆరోజు స్పాట్ లో అస్గర్ అలీ లేడు. తాను దూరం నుంచి ఫోన్ లో ఇన్ స్ట్రక్షన్స్ ఇవ్వడం… స్పాట్ లో సుభాష్ శర్మ అమలుచేయడం ఎక్కువసార్లు జరిగేది. అలాగే.. ఆరోజు కూడా స్పాట్ లో శర్మ ఒక్కడే ఉన్నాడు. దొంగచాటుగా వెనుకనుంచి ప్రణయ్ తలను కత్తితో నరికి .. పారిపోయాడు.

హత్య చేసిన తర్వాత… మారుతీరావు, బారీ, కిల్లర్ శర్మ కారులో నల్గొండకు అక్కడి నుంచి మరో ప్రాంతానికి పారిపోయారు. నిందితుడు శర్మ బెంగళూరుకు బస్సులో వెళ్లిపోయాడు. ఆ తర్వాత డౌట్స్ ఉన్న వాళ్లు అందరి ఫోన్లు స్విచాఫ్ లో ఉండటంతో పోలీసులకు క్లూ దొరికింది. సీసీ ఫుటేజ్ చూస్తూ.. మారుతీరావు కదలికలు తెల్సుకున్నారు. మిగతా సాంకేతిక సాయంతో అందరు నిందితులను అరెస్ట్ చేశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy