పచ్చదనానికి నేను ప్రేమికుడిని: సీఎం

cm-kcr-reviewపచ్చదనానికి తాను గాఢమైన ప్రేమికుడినని, రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంచడానికి ఏ చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడనని, అంతిమంగా తెలంగాణలో 33 శాతం అడవులు ఉండడం తన లక్ష్యమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. రేపు మనం లేకపోయినా బావితరం ఉంటుందని, వారి కోసం మనం నాటే మొక్కలుంటాయని సిఎం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు దట్టమైన అడువులతో, పచ్చదనంతో, వన సంపదతో తులతూగేదని, పర్యావరణ సమతుల్యంతో తెలంగాణ ఓ భూతల స్వర్గంగా ఉండేదని, ఈ స్వర్గాన్ని మళ్లీ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సిఎం కోరారు. కాంక్రీట్ జంగిల్స్ లాగా మారిన నగరాలు, పట్టణాల్లో వాతావరణాన్ని చల్లబరిచేందుకు, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు, గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. జనావాసాల్లో మొక్కల పెంపకం చేపట్టి సామాజిక అడవులు వృద్ధిచేయడంతో పాటు, అటవీ ప్రాంతంలో తిరిగి దట్టమైన చెట్లుండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అడవిలో ఇంకా మిగిలిపోయిన చెట్లను రక్షించడంతో పాటు, పోయిన చెట్లస్థానంలో మళ్లీ మొక్కలు పెంచాలని సూచించారు.

తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, అటవీశాఖ మంత్రి జోగు రామన్న, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి. గోపాల్, పిసిసిఎఫ్ పి.కె.ఝా, జిహెచ్ఎంసి కమీషనర్ జనార్థన్ రెడ్డి, హెచ్ఎండిఏ కమీషనర్ చిరంజీవులు, అడిషనల్ పిసిఎఫ్ లు డోబ్రియాల్, భాంజా, పారెస్ట్ కాలేజి డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, సిఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, హరితహారం ఓఎస్డి ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా అమలవుతున్న తెలంగాణకు హరిత హారం పురోగతిపై సమీక్ష జరిపారు.

కేవలం వానాకాలంలో మాత్రమే మొక్కలు నాటాలనే అభిప్రాయం సరైనది కాదని, ఏడాదిలో పది నెలల కాలం మొక్కలు పెట్టుకోవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. మొక్కలు నాటే కార్యక్రమం నిరంతర కార్యక్రమంగా సాగాలని సిఎం పిలుపునిచ్చారు. నగరాలు, పట్టణాలు కాంక్రీట్ వనాలుగా మారిపోయి, నగర వాసుల జీవితం ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో గ్రీన్ కవర్ పెంచడానికి ఫారెస్టు బ్లాకుల్లో విరివిగా చెట్లు పెంచాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లోని ఖాళీ జాగాలను గుర్తించి మొక్కలు నాటాలని చెప్పారు. తెలంగాణలో నగర జనాభా పెరిగిపోతున్నదని, ఇప్పటికే దాదాపు 45 శాతం ప్రజలు నగరాలు, పట్టణాల్లోనే జీవిస్తున్నారని చెప్పారు. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువవుతున్నది, వారికి సరిపడా పచ్చదనం లేకుంటే విపరిణామాలు సంభవిస్తాయని సిఎం ఆందోళన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మొక్కల పెంపకానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని కోరారు. ప్రతీ కార్పొరేషన్, మున్సిపాలిటీలో గ్రీన్ సెల్ ఏర్పాటు చేయలని, కార్పొరేషన్లో ఐఎఫ్ఎస్ అధికారులను, మున్సిపాలిటీలలో అటవీశాఖ ఇతర అధికారులను ఈ సెల్ కు ఇన్చార్జులుగా నియమించాలని సూచించారు. ఆ సెల్ ఆధ్వర్యంలోనే పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచే కార్యాచరణ అమలు చేయాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం సందర్భంగా మొక్కలు నాటిన వారికే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడం లాంటి విధానాలకు కూడా రూపకల్పన చేయాలని కోరారు. మొక్కలు నాటడం, వాటిని రక్షించడం, వచ్చే ఏడాదికి అవసరమయ్యే మొక్కలు తయారు చేయడానికి నర్సరీలు నిర్వహించడం లాంటి కార్యక్రమాలు గ్రీన్ సెల్ ఆధ్వర్యంలో జరగాలని కోరారు.

హైదరాబాద్ నగరంలో హరిణ వనస్థలి, నారపల్లి, గుర్రంగూడ, బొంగులూరు, మంగల్ పల్లి, తుర్క యాంజాల్, రావిర్యాల, మాదన్న గూడ, నాగారం, మైసారం, నందుపల్లి, మజీద్ గడ్డ, పల్లెగడ్డ, సిరిగార్ పూర్, తిమ్మలూరు, శ్రీనగర్ తదితర అటవీ బ్లాక్ లను దట్టమైన అడవులుగా తీర్చిదిద్దాలని చెప్పారు. ఓఆర్ఆర్ వెంట అందమైన పూల మొక్కలు, అలంకరణ మొక్కలు నాటడంతో పాటు వాటిని రక్షించాలని చెప్పారు. అవసరమైతే కొత్తగా నీటి ట్యాంకర్లు కొనుగోలు చేయాలని చెప్పారు. ఓఆర్ఆర్ జంక్షన్లన్నిటిలో ప్లాంటేషన్ చేయాలని చెప్పారు.

పట్టణ ప్రాంతాల్లో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మొక్కల పెంపకం, పరిరక్షణ, నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మొక్కలు పెంచాలనే అవగాహన ప్రజలకు ఏర్పడిందని, దానికి తోడు ఈ సారి మంచి వర్షాలు కూడా ఉన్నాయని, దీనిని సదవకాశంగా తీసుకోవాలని చెప్పారు. ప్రజల నుంచి ఏ రకం మొక్కలకు డిమాండ్ ఉందో తెలుసుకుని నర్సరీల్లో వాటి పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.

రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అటవీభూములున్నాయని, కానీ వాటిలో అడవి లేదని సిఎం చెప్పారు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ లాంటి జిల్లాల్లో మాత్రమే ఇంకా అడవి మిగిలి ఉందన్నారు. మిగిలిన కొద్ది పాటి అడవిని రక్షించడానికి అటవీశాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. చెట్లను నరికే వారిపట్ల, కలప స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని, స్మగ్లర్లపై పిడి యాక్టు ప్రయోగించాలని ఆదేశించారు. కలప స్మగ్లింగ్ జరిగే అవకాశమున్న ప్రతీ చోట నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో చెట్లు పెంచడానికి అనుగుణమైన వ్యూహాన్ని రూపొందించాలని సిఎం చెప్పారు. అటవీశాఖకు ఎంత మంది సిబ్బంది అవసరమైతే అంతమందిని నియమించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో గ్రీన్ కవర్ పెంచడమే తమ లక్ష్యమని, ఈ పనికోసం నిధుల కొరత రానేరాదని తేల్చిచెప్పారు.

పార్లమెంటులో కాంపా బిల్లు ఆమోదం పొందడం కూడా మంచి పరిణామమని సిఎం అన్నారు. రాష్ట్రంలోని ఐఎఫ్ఎస్ అధికారులను, ఇతర సిబ్బందిని అవసరాలకు తగినట్లు వాడుకోవాలని, అందుకు అనుగుణంగా సంస్థాగతంగా మార్పులు చేసుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో రాజకీయ జోక్యం ఉండదని సిఎం చెప్పారు. అటవీ శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారి సేవలు కూడా వినియోగించుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో జరుగుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని తెలుసుకుని నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ముఖ్యమంత్రి ఆదేశించారు. పట్టణాలు, గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ ప్రాంగణాలు, విద్యాలయాలు, యూనివర్సిటీలు తదితర చోట్ల ఎన్ని మొక్కలు నాటారు? ఎన్ని బతికాయి? చెట్లను పెంచడానికి ఎలాంటి వ్యూహం అవలంభిస్తున్నారు? తదితర వివరాలు సేకరించాలని ఆదేశించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy