పఠాన్ కోట్… 50 ఏళ్లుగా టార్గెట్ అదే..!

India Air Base Attackపఠాన్ కోట్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్న పేరు ఇది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై ఉగ్రవాదుల దాడితో ప్రపంచవ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతోంది. అయితే.. అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే. ఉగ్రవాదులు పఠాన్ కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నే ఎందుకు టార్గెట్ చేశారు…? ఇదే మొదటి సారి కాదు.. ఇప్పటికే రెండుసార్లు పఠాన్ కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించింది పాక్. ఇంతగా టార్గెట్ చేయడానికి కారణమేంటి..? అందులో ఏముంది..?

50 ఏళ్లుగా దాడులు – అయినా మనదే విజయం

పఠాన్ కోట్… పాకిస్థాన్ సరిహద్దుకు కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం. దీంతో  ఈ ప్రాంతానికి సాధారణంగానే రక్షణ పరంగా ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. సరిహద్దు వెంట 24 గంటలు నిఘా ఉంటుంది. ఒకవేళ పాకిస్థాన్ తో యుద్ధం వస్తే… వైమానికి దాడులు చేయడానికి, ఆర్మీకి సహకారం అందించడానికి ఈ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతో ఇక్కడ ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దేశ వైమానిక దళ సామర్థ్యానికి ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఓ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ పరిధిలోకి వచ్చే ఈ బేస్ క్యాంప్ లో మిగ్ 21 విమానాలు, బైసన్ యుద్ధ విమానాలు, ఎంఐ 25, ఎంఐ 35 హెలికాప్టర్లు, భారీ లక్ష్యాలను చేధించగల క్షిపణులు, మానవరహిత విమానాలు ఇక్కడ రెడీగా ఉంటాయి. ప్రస్తుతం ఉగ్రవాదుల ఏరివేత కూడా ఈ మానవరహిత విమానాలతోనే జరుగుతోంది. చీకట్లోనూ మనుషులను గుర్తించగల థర్మో కెమెరాలున్న విమానాలతోనే ఉగ్రవాదుల జాడ కనిపెట్టి.. వారిని మట్టుపెట్టాయి భద్రతా బలగాలు. ఇక శత్రువులపై నిఘా వేసేందుకు అత్యంత శక్తివంతమైన రాడార్ వ్యవస్థ నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. అంతేకాదు 15 వేల మంది సైనికులతో  స్పెషల్ డివిజన్ ఏర్పాటు చేశారు. ఎలాంటి విపత్తు వచ్చినా.. క్షణాల్లో రంగంలోకి దిగేందుకు రెడీగా ఉంటారు సైనికులు.

పాకిస్థాన్ తో యుద్ధం వస్తే.. ఆ దేశ సైన్యాన్ని క్షణాల్లో నాశనం చేయగల శక్తిసామర్థ్యాలు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ సొంతం. దీంతో పాకిస్థాన్ కు మొదటి నుంచి దీనిపై కన్నుంది. 1965 సెప్టెంబర్ 6న మొదటి సారి ఈ బేస్ పై అటాక్ చేసింది పాక్. అయితే… వెంటనే అలర్టైన ఎయిర్ ఫోర్స్ కమాండోలు.. పాక్ సైనికులను బందీలుగా పట్టుకున్నారు. తర్వాత 1971 లో మరోసారి దాడి చేసింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోని రన్ ను కొంత వరకునాశనం చేసింది.

ISI హస్తంపై అనుమానాలు

pathankot-attack

ఇప్పుడు టెర్రరిస్టుల దాడి వెనుక కూడా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఎజెన్సీ ISI హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. దేశ వైమానిక సామర్ధ్యాన్ని దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతో ఉగ్రవాదులు దాడి చేసినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులు పక్కా ప్లాన్ తో, భారీగా ఆయుధాలు వెంటతీసుకొచ్చారని చెబుతున్నారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. ఉగ్రవాదులు పాకిస్థాన్ లో ఉన్న తమవారితో జరిపిన ఫోన్ సంభాషణల్లో కూడా ఇదే విషయంపై డిస్కస్ చేసినట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో చెబుతోంది. దీంతో పాక్ తో పాటు.. ఉగ్రవాదుల టార్గెట్ లో ఉన్న పఠాన్ కోట్ ఎయిర్ బేస్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy