పడాల చంద్రయ్య.. స్వాతంత్ర్య సమరయోధుడు

Padala-chandraiahస్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు…పడాల చంద్రయ్యకు అరుదైన గౌరవం దక్కింది. క్విట్ ఇండియా ఉద్యమం జరిగి నేటికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సన్మానించాలని నిర్ణయించి కేంద్ర ప్రభుత్వం. ఇందులో కరీంనగర్ జిల్లా  భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన చంద్రయ్య కూడా ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీకి రావాలని చంద్రయ్యకు పిలుపు వచ్చింది. అయితే వృద్ధాప్యం వల్ల ఢిల్లీకి వెళ్లలేనంటున్నారు చంద్రయ్య. వీలైతే తనకు ఇంటి దగ్గరే సన్మానం చేయాలంటున్నారు.

14 ఏళ్ల వయస్సులో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు చంద్రయ్య. చిన్న వయస్సులోనే జైలుకు వెళ్లారు. ఆరు నెలలు జైలులో ఉండి వచ్చిన తర్వాతా కూడా పోరుబాట వీడలేదు. నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆదిలాబాద్ జిల్లా  నాగపూర్ లోని చాందా క్యాంపులో చేరి…   సాయుధ శిక్షణ తీసుకున్నారు.  దళ కమాండర్ గా పనిచేసిన చంద్రయ్య అప్పట్లో మహారాష్ట్రలోని వీరూర్  పోలీస్ స్టేషన్, రైల్వేస్టేషన్లపై దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు నిజాం పోలీసులు చనిపోగా, చంద్రయ్య కాలులోకి బుల్లెట్ దిగింది.

రాష్ట్రపతి సన్మానానికి ఎంపికైన సందర్భంగా…పాత విషయాలను  గుర్తు  చేసుకున్నారు చంద్రయ్య. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో తెలంగాణ నుంచి పాల్గొన్న కొద్ది మందిలో ఈయన ఒకరు. హన్మకొండలో ఎనిమిదోతరగతి చదువుతుండగా క్విట్ ఇండియా ఉద్యమానికి ఆకర్శితుడై హన్మకొండ చౌరస్తాలో సత్యాగ్రహం చేశారు చంద్రయ్య.

చంద్రయ్య సోషలిస్టు పార్టీలో చేరి వ్యవసాయ కూలీలు, పాలేర్ల సంఘాలను ఏర్పాటు చేశారు. రాత్రి బడులను నిర్వహించారు. గ్రామ కమిటీలు వేసి పట్వారీలు, జమీందార్ల అరాచకాలను  ఎదిరించారు. తిండిగింజల ఉద్యమాన్ని నడిపించారు. ప్రభుత్వ గోదాములను లూఠీ చేసి పంటను నిరుపేదలకు పంపిణీ చేశారు. దీంతో నిజాం ప్రభుత్వం చంద్రయ్యను అరెస్టు చేసి రెండు నెలలపాటు చంచల్ గూడ జైల్లో పెట్టింది.

నిజాం పాలన నుంచి హైదరాబాద్ విముక్తి కావడంతో…మళ్లీ చదువుపై దృష్టిపెట్టారు చంద్రయ్య. ఉద్యమాలతో మధ్యలో ఆపేసిన చదువును కంటిన్యూ చేశారు. 1952లో పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ గా ఎంపికయ్యారు. ఆ తర్వాత దామెరలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. అయితే కేసుల వల్ల ఈ ఉద్యోగాలు దక్కలేదు. చివరకు వరంగల్ లోని వ్యవసాయశాఖ కార్యాలయంలో గుమస్తాగా చేరారు. ములుకనూరు సహకార గ్రామీణ బ్యాంకు స్థాపనకు ప్రయత్నించరు.  బ్యాంకు కార్యదర్శిగా పనిచేశారు. ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం, మల్టీ ఇండస్ట్రియల్ కన్జూమర్ కో ఆపరేటివ్ సొసైటీ, ఆల్ ఇండియా వూల్ వీవర్స్ కో ఆపరేటివ్ ఫెడరేషన్  స్థాపనలో కీలకపాత్ర పోషించారు చంద్రయ్య. స్వాతంత్ర్య సమరయోధుని కోటాలో…  మంథని నియోజకవర్గంలో ప్రభుత్వం రెండు ఎకరాల భూమి ఇస్తే … ఆ స్థలాన్ని నిరుపేదలకు పంచాలని ప్రభుత్వానికి లేఖ రాశారు  చంద్రయ్య.

బతుకంతా దేశం కోసం పనిచేసిన చంద్రయ్య… చనిపోయిన తర్వాత తన దేహం జనానికి ఉపయోగపడాలని భావించారు. భార్య వెంకటలక్ష్మిని కూడా అవయవదానానికి  ఒప్పించారు. చనిపోయిన తర్వాత తమ పార్థివ దేహాలను వరంగల్ లోని కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)కి అప్పగించాలని గతంలోనే లేఖరాశారు. 2009లో  చంద్రయ్య భార్య  చనిపోగా ..ఆమె మృతదేహాన్ని కేఎంసీ కి అప్పగించారు.  పుట్టుక నీది…చావు నీది…బతుకంతా దేశానికి అన్న కాళోజీ మాటలను నిజం చేశారు చంద్రయ్య.  చంద్రయ్య త్యాగాన్ని ఇన్నాళ్లకైనా కేంద్రం గుర్తించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy