పథకాల అమలు బాధ్యత కలెక్టర్లదే: సీఎం

KCRప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణ పూర్తి బాధ్యత కలెక్టర్లదేనన్నారు సీఎం కేసీఆర్. ప్రగతిభవన్ లో కలెక్టర్ల  సమావేశం నిర్వహించిన ఆయన.. పథకాల అమలులో ఎలాంటి పొరపాట్లు లేకుండా కలెక్టర్లే చూసుకోవాలన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అధికారాలు… వనరులు కలెక్టర్లకు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల్లో తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పథకాల అమలుకు ఆధార్ కార్డును అనుసంధానించాలని సూచించారు.

జూన్‌ 20 నుంచి గొర్రెపిల్లల కొనుగోళ్లు ప్రారంభించాలన్నారు సీఎం. 18 ఏళ్లు నిండిన ప్రతి గొల్ల, కుర్మ కుటుంబ సభ్యులకు సొసైటీలో రూ.51తో సభ్యత్వం కల్పించాలని సూచించారు.  రాష్ట్రంలో గొర్రెల పెంపకం శాశ్వత అభివృద్దికి దోహద పడుతుందన్నారు. రాష్ట్రంలో గొల్ల, కురుమల కుటుంబాలు 30 లక్షల వరకు ఉన్నాయని..ఈ మానవ వనరులకు పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

ఎంపీడీవో, తహసీల్దార్, వెటర్నరీ డాక్టర్ల బృందం బయటి రాష్ట్రాల నుంచి గొర్రె పిల్లలను కొనుగోలు చేయడానికి వెళుతుందని తెలిపారు. లబ్దిదారులు కూడా వీరి వెంట ఉంటారని పేర్కొన్నారు. పశువుల సంరక్షణకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వెటర్నరీ మొబైల్ వ్యాన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న పశువైద్యశాలలను పటిష్టం చేయస్తామన్నారు.

డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని కలెక్టర్లుకు ఆదేశించారు. గ్రామసభల్లో ఎంపీడీవో, తహసీల్దార్‌లు లాటరీ ద్వారా ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి రాజకీయ ఒత్తిడులు ఉండవని తెలిపారు. ఎవరైనా ఒత్తిడి చేస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరముందన్న సీఎం… రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 15శాతానికి తగ్గకుండా పెరుగుతుందన్నారు.

రాష్ట్రంలో రెండున్నర నుంచి మూడు లక్షల వరకు ఒంటరి మహిళలు ఉన్నారన్నారు. వీరందరికి ఆసరా పెన్షన్ స్కీం వర్తింపజేయాలని చెప్పారు. మరో 81వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్ స్కీంను వర్తింపచేయాలని కలెక్టర్లకు సూచించారు.

కొత్తగా ఏర్పాటైన జిల్లాలో జిల్లా కలెక్టర్లకు.. ఎస్పీలకు భవన సముదాయాల నిర్మాణాలపై సమావేశంలో చర్చించారు. పనుల పురోగతి ఎక్కడికి వచ్చిందని కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి కొత్త భవనాల్లో పాలన కొనసాగించాలని చెప్పారు. తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ పోలీస్ భవన సముదాయల నిర్మాణం చేపడుతుందన్నారు.

రాష్ట్రంలోని పేదరికాన్ని పారదోలడమే ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్.రాష్ట్రంలోని రైతులకు నాణ్యమైన 9 గంటల ఉచిత విద్యుత్ ను.. మిగితా వారికి 24 కరెంటును అందిస్తున్నామని తెలిపారు. నార్త్‌గ్రిడ్ విద్యుత్ అనుసందానం పూర్తి కావడంతో ఇప్పుడు కరెంటుతో సమస్య లేదన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy