పబ్బులో డ్రగ్స్ పై విచారణ

drugsడ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ సినీ పరిశ్రమను కలవరపెడుతుండగా..ఇప్పుడు పబ్బుల యాజమాన్యాలు ఆందోళనలో పడుతున్నాయి. ఇప్పటిదాకా అనుమానంగా ఉన్నా హైదరాబాద్ లోని పబ్బులు.. ఇప్పుడు ఎక్సైజ్‌ విచారణలో ధ్రువీకరణ అయ్యింది. హైదరాబాద్‌లో పబ్‌లే మాదక ద్రవ్యాల అడ్డాలని తేలింది. డ్రగ్స్‌ అక్కడే విక్రయిస్తున్నారు. సరుకు, డబ్బులు అక్కడే చేతులు మారుతున్నాయి. పబ్బులకు సంబంధించిన CCTV ఫూటేజీలు, ఇతర ప్రైవేటు వీడియోలను తనిఖీ చేసి, ఎక్సైజ్‌ అధికారులు ఈ నిర్ధారణకు వచ్చారు. GHMC, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో దాదాపు 30 వరకూ పబ్బులున్నాయి. వీటిలో 17 పబ్బులు డ్రగ్స్‌ సరఫరా కేంద్రాలుగా మారాయని సిట్‌ అధికారులు గుర్తించారు. వాటిలో ప్రధానంగా కొంతమంది నటులకు చెందిన పబ్బులు కూడా ఉండడం గమనార్హం. సినీ నటుడు తరుణ్‌కు చెందిన ఆన్‌ పబ్‌, నవదీ్‌పకు చెందిన BPM పబ్‌తోపాటు 10 డౌన్‌ స్ట్రీట్‌, వాటర్స్‌, లిక్విడ్‌, బీర్స్‌, డూప్లిన్‌, క్లౌడ్‌ డౌన్‌, ఇటీవల నకిలీ ఎల్‌ఎ్‌సడీ తయారీ కేసులో అరెస్టయిన పీయూ్‌షకు చెందిన పబ్బులు ఉన్నట్లు తేల్చారు.

సినీ ముఖ్యులతో కెల్విన్‌, జీషన్‌ అలీ ఇలాంటి పబ్బుల్లోనే కలుసుకునేవారని నిర్ధారణకు వచ్చారు. వీకెండ్స్‌, ఇతర హాలిడే్‌సలలో పబ్బులు పెద్ద అంగళ్లను తలపించేవని గుర్తించారు. డ్రగ్స్‌ను విక్రయించడానికి నైజీరియన్‌ ముఠాలు, సరఫరాదారులు పబ్బులకు వచ్చేవారని, వారిని సినీ ముఖ్యులు కలిసేవారని తెలుసుకున్నారు. కొంతమంది డ్రగ్స్‌ను కొనుక్కుని ఇళ్లకు, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేవారు. మరి కొంతమంది అక్కడే మజా చేసేవారు. వారి మధ్య పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారేది. కెల్విన్‌, జీషన్‌ అలీలను విచారించగా.. పబ్బులు మాదక ద్రవ్యాల అంగళ్లుగా మారాయని తెలుసుకున్నారు. సినీ ప్రముఖుల విచారణలోనూ పబ్‌ల వ్యవహారం బయటకు వచ్చినట్లు సమాచారం. ఈలోపే కొన్ని పబ్బులకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి కొన్ని వీడియోలు లభించినట్లు సమాచారం. వాటిని విశ్లేషించిన సిట్‌ అధికారులు పబ్‌లే ప్రధాన డ్రగ్స్‌ అడ్డాలని తేల్చారు.

వాటి భరతం పట్టాలని అధికారులు నిర్ణయించారు. వాటి యజమానులు, మేనేజర్లను పిలిచి అడిగితే పూర్తి వివరాలు తెలుస్తాయని నిర్ణయించారు. GHMC పరిధిలోని పబ్బులు, బార్ల యజమానులు, మేనేజర్లతో శనివారం(జూలై-22) సిట్‌ అధికారులు సమావేశం కానున్నారు. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సభర్వాల్‌ కూడా ఇందులో పాల్గొంటారు. పబ్బులు, బార్ల యాజమాన్యాలకు నోటీసులు పంపారు. ఒక్కో పబ్బు యజమాని, మేనేజర్‌ను ప్రత్యేకంగా విచారించనున్నారు. వారిచ్చే సమాచారం తప్పుగా ఉంటే.. తమ వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలు, వీడియోలను బయటపెట్టనున్నారని తెలిసింది. అలాగే, పబ్బులకు ఎవరెవరు వచ్చేవారు, రెగ్యులర్‌ కస్టమర్లు ఎవరు, ఎలాంటి డ్రగ్స్‌ను వినియోగిస్తున్నారు, సరఫరాదారులు ఎవరు తదితర వివరాలను రాబట్టే అవకాశం ఉంది. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ అకున్‌ సభర్వాల్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. కెల్విన్‌ ముఠా నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, నగరంలోని 16-17 పబ్‌లలో డ్రగ్స్‌ వినియోగం ఉన్నట్లు గుర్తించామని, శనివారం(జూలై-22) పబ్‌, బార్‌ యాజమాన్యాలతో భేటీ కానున్నామని తెలిపారు.

బార్లపైనా నిఘా

కొన్ని బార్లపై అధికారులకు అనుమానాలున్నట్లు సమాచారం. బార్లలో మద్యం విక్రయాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆహారం, ఇతర తినుబండారాలు కూడా దొరుకుతాయి. కానీ, కొన్ని బార్లలో డ్రగ్స్‌ను కూడా విక్రయిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా నగర శివార్లలోని బార్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం GHMC పరిధిలో 560 వరకూ బార్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటిపై అనుమానం ఉంది. అందుకే బార్ల యజమానులను కూడా సమావేశానికి పిలిచారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy