పబ్బుల్లో డ్రగ్స్‌ వినియోగం సాధారణమే : తరుణ్

tarun1డ్రగ్స్‌ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగోరోజు హీరో తరుణ్‌ను ఎక్సైజ్‌ సిట్‌ అధికారులు విచారించారు. సిట్ నోటీసులు అందుకున్న హీరో తరుణ్ శనివారం (జూలై-22) ఉదయం పదిన్నరకు తన తండ్రిని వెంటబెట్టుకుని విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని పలు పబ్బుల్లో డ్రగ్స్‌ వినియోగం సాధారణమేనని హీరో తరుణ్‌ ఎక్సైజ్‌ సిట్‌ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. 15 పెద్ద పబ్బుల్లో ఈ దందా నడుస్తోందని.. వాటిలో సెలబ్రిటీలకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే పూరి జగన్నాథ్, సుబ్బరాజు, శ్యాం కె.నాయుడులను విచారించిన సమయంలో వెల్లడైన వివరాల ఆధారంగా సిట్‌ బృందాలు తరుణ్‌ను ప్రశ్నించాయి. హైదరాబాద్‌లోని పబ్బుల్లో డ్రగ్‌ కల్చర్, వాటికి ఎక్కడి నుంచి డ్రగ్‌ వస్తుంది? ఎలా డీల్‌ చేస్తారు? గతంలో తరుణ్‌ సొంతంగా పబ్‌ నిర్వహించిన అంశాలపై ప్రశ్నించినట్టు తెలిసింది.

పబ్బుల్లో ఇది సాధారణమే

ప్రస్తుతం హైదరాబాద్‌లోని 15 పెద్ద పబ్బుల్లో డ్రగ్స్‌ దందా నడుస్తోందని తరుణ్‌ వెల్లడించినట్టు సమాచారం. డ్రగ్స్‌ తీసుకునేందుకు ఈవెంట్‌ మేనేజర్లు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారని, తరచూ పబ్‌లకు వచ్చే వారిలా కాకుండా.. సెలబ్రిటీలకు ప్రత్యేక గదుల్లో డ్రగ్స్‌ సరఫరా చేస్తుంటారని వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే తాను ఎప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని, సరఫరా చేయలేదని ఆయన సిట్‌ వర్గాలతో పేర్కొన్నట్లు తెలిసింది.

గోవా సంగతేమిటి?

తరుణ్‌ పదే పదే గోవాకు వెళతారని, అక్కడ డ్రగ్స్‌ తీసుకుంటారని.. ఇందుకు జీశాన్, కెల్విన్‌లతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపైనా సిట్‌ బృందాలు ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో గోవాకు వెళ్లే వారంతా డ్రగ్స్‌ తీసుకున్నారనుకుంటే ఎలాగని తరుణ్‌ ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. తన స్నేహితులకు గోవాలో హోటళ్లు, రెస్టారెంట్‌ వ్యాపారాలు ఉన్నాయని.. వాటిలో తనకూ వాటాలు ఉన్నాయని, అందులో భాగంగానే గోవా వెళుతుంటానని చెప్పినట్లు సమాచారం. ఇక తాను సినిమా షూటింగ్‌లకు స్వస్తి చెప్పి చాలా కాలమైందని.. రియల్‌ ఎస్టేట్‌ తదితర వ్యాపారాల్లో బిజీగా ఉన్నానని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఉపవాసంతో

ఉదయం నుంచి ఉపవాసంతో ఉన్న తరుణ్ సాయంత్రానికి నీరసపడటంతో వైద్యులను పిలిపించి ఆయన రక్తపోటును పరీక్షించారు. పూరీ, శ్యాం కే నాయుడు, సుబ్బరాజు తదితరులకు సేకరించినట్టుగానే రక్త, వెంట్రుకలు, గోర్ల నమూనాలను తీసుకున్నారు. వాటితోపాటు తరుణ్ వేలిముద్రలను కూడా సిట్ అధికారులు సేకరించడం విశేషం.

డ్రగ్స్‌ను సంపూర్ణంగా నివారించాలి

విచారణ అనంతరం బయటకు వచ్చిన తరుణ్ మీడియాతో మాట్లాడుతూ విచారణ చాలా లోతుగా సాగిందని, అందుకు పూర్తిగా సహకరించానని చెప్పారు. సమాజంలో డ్రగ్స్‌ను సంపూర్ణంగా నివారించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. తాను చెప్పదల్చుకున్న విషయాలన్నీ చెప్పానని తెలిపారు. తరుణ్ విచారణకు పూర్తిగా సహకరించారని సిట్ ఇన్‌చార్జి శ్రీనివాసరావు చెప్పారు. తదుపరి వివరాలు దర్యాప్తులో తేలుతాయని, వాటిని మీడియాకు వివరిస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఎవరినీ విచారించడం లేదని, సోమవారం (జూలై-24)  హీరో నవదీప్‌ను విచారిస్తామని చెప్పారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy