పరిగెత్తే పనిలేదు : ఆన్‌లైన్‌లోనే ఐఐటీ ఎంట్రన్స్ టెస్ట్

iit..madrasఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) సంస్థల ప్రవేశ పరీక్షలు ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే జరగనున్నాయి. ఆదివారం చెన్నైలో జరిగిన ఉమ్మడి ప్రవేశ మండలి (జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు- జేఏబీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని 23 ఐఐటీల ప్రవేశాలపై ఈ మండలే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. 2018 నుంచి జేఈఈ (అడ్వాన్స్‌డ్‌) పరీక్షలు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని ఆ సమావేశం నిర్ణయం తీసుకొంది. ఆన్‌లైన్‌లో పరీక్షల నిర్వహణకు తగిన సౌకర్యాలు కల్పించాల్సి ఉందని చెప్పారు జేఏబీ-2017 ఛైర్మన్‌ అయిన ఐఐటీ-మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ భాస్కర రామమూర్తి.

ఈ ఏడాది 13 లక్షల మంది విద్యార్థులు జేఈఈ (మెయిన్స్‌) రాయగా, అందులో ఐఐటీ ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ (అడ్వాన్స్‌డ్‌)ను 2.2 లక్షల మంది రాశారు. ప్రస్తుతం సంప్రదాయ కలం-కాగితం విధానంతో పాటు, కంప్యూటర్‌ ద్వారా కూడా పరీక్ష రాసే విధానాలను అమలు చేస్తున్నారు. చాలా మంది కలం-కాగితం పద్ధతినే అనుసరిస్తున్నారు. ఇకపై పూర్తిగా కంప్యూటర్‌ ద్వారా, కాగిత రహితంగా జరుగుతాయి. దీనివల్ల వేగంగా ఫలితాలు వెలువడుతాయి. నిజాయితీగా మూల్యాంకనం ఉంటుంది. పారదర్శకత నెలకొంటుంది. ప్రశ్నపత్రాల ముద్రణలో తప్పులు వచ్చే సమస్య ఉండదు. ప్రశ్నపత్రాల లీకేజీ బెడద ఉండదని భావిస్తున్నారు జేఏబీ సభ్యులు. ప్రశ్న పత్రాల్లో తప్పులు దొర్లడం కారణంగా జవాబు రాసినా రాయకపోయినా ఈ ఏడాది మద్రాస్‌ ఐఐటీ 18 బోనస్‌ మార్కులు ఇవ్వాల్సి వచ్చింది. దీనిని సవాలు చేస్తూ ఓ విద్యార్థి సుప్రీంకోర్టుకు వెళ్లారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చింది మద్రాస్‌ ఐఐటీ. అందులో భాగమే ఆన్‌లైన్‌లో పరీక్షల నిర్వహణ అని ఒక అధికారి వివరించారు.

ప్రశ్నల నిధి ఏర్పాటు

అభ్యర్థుల ప్రయోజనార్థం ప్రశ్నల నిధి ఏర్పాటు చేయాలన్న సూచన కూడా వచ్చింది. ప్రశ్నలను వాటి క్లిష్టతలను అనుసరించి 1 నుంచి 10 శ్రేణులుగా వర్గీకరించాల్సి ఉంటుంది. వాటికి ఇచ్చే సమాధానాలను అనుసరించి అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. అమెరికాలో డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే స్కాలస్టిక్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఎస్‌ఏటీ)లో ఇలాంటి విధానం అనుసరిస్తారు. ప్రశ్నలకు రాసిన సమాధానాల ఆధారంగానే కాకుండా, వాటిని పరిష్కరించడానికి అనుసరించిన పద్ధతులను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న సలహా వచ్చింది. జేఈఈ (అడ్వాన్స్‌డ్‌)కు తొలి దశ అయిన జేజీఈ (మెయిన్‌) పరీక్షలను సీబీఎస్‌ఈ నిర్వహిస్తుంది. ఇవి పాత పద్ధతిలోనే జరుగుతాయి. కలం-కాగితం, కంప్యూటర్‌ ఏదో ఒక విధానాన్ని అభ్యర్థులు ఎంచుకోవచ్చు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy