పర్వత రాష్ట్రం బీజేపీ సొంతం

Modi-Rahul-collageపర్వతాల రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో… కమలం వికసించింది. ఐదేళ్ల తర్వాత బీజేపీ మళ్లీ అధికారం కైవసం చేసుకుంది. వృద్ధ నేతల మధ్య సమరంగా జరిగిన ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా ఒకరు, వ్యక్తిగతంగా ఇంకొకరు ఓడిపోయారు.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విక్టరీ కొట్టింది. అధికార కాంగ్రెస్ ను మట్టికరిపించింది బీజేపీ. మొత్తం 68 స్థానాల్లో 44 నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగరేసింది కమలదళం. 2012 ఎన్నికల కంటే 18 సీట్లు అధికంగా గెలుచుకుంది. ఆ పార్టీకి 48.6శాతం ఓట్లు వచ్చాయి. తూర్పు హిమాచల్ లో 21, పశ్చిమ హిమాచల్ లో 23 సీట్లు గెలిచింది బీజేపీ.

వీరభద్ర సింగ్ నేతృత్వంలోని అధికార కాంగ్రెస్ 21 చోట్ల మాత్రమే గెలవగలిగింది.  2012 ఎన్నికలతో పోలిస్తే 15 సీట్లు తక్కువ గెలుచుకుంది. కాంగ్రెస్ కు 42.2శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులు 3 చోట్ల గెలిచారు. ఓటమి అంగీకరిస్తున్నామని… బీజేపీకి కంగ్రాట్స్ చెప్పారు వీరభద్ర సింగ్.

వృద్ధ నేతలైన వీరభద్ర సింగ్, ప్రేమ్ కుమార్ ధుమాల్ మధ్య ఎన్నికల పోరాటం జరిగింది. సీఎం వీరభద్ర సింగ్ ను మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టింది కాంగ్రెస్. ఇవే తన చివరి ఎన్నికలని ప్రకటించారాయన. అర్కీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన దాదాపు 6వేల ఓట్లతో గెలిచారు. ఇక రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రేమ్ కుమార్ ధుమాల్ ను ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఎన్నికలకు రెండు వారాల ముందు ప్రకటించింది బీజేపీ. సుజాన్ పూర్ నుంచి పోటీ చేసిన ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓటమి పాలయ్యారు. ధుమాల్ పై కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర సింగ్ రాణా గెలుపొందారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సత్పాల్ సింగ్ సత్తి ఉనా నియోజకవర్గం నుంచి గెలిచారు.

వీరభద్ర సింగ్ పై అవినీతి ఆరోపణలు, ఆయన కుటుంబసభ్యులపై CBI దర్యాప్తు లాంటివి కాంగ్రెస్ ఓటమిని ప్రభావితం చేశాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ లోనూ ఎగ్జిట్ పోల్స్ నిజం కాలేదు. అన్ని సర్వేలు బీజేపీకి 50 సీట్లకు పైగా వస్తాయని అంచనా వేయగా… ఆ పార్టీ 44కే పరిమితమైంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy