పాత పాట….కొత్త సవరణలు

images
బీజేపీ మళ్లీ పాత పాటే పడింది. టీ బిల్లుకు వ్యతిరేకం కాదంటునే కండిషన్స్ అప్లై అంటోంది. తెలంగాణకు మద్దతంటునే… సీమాంద్రకు న్యాయం జరగాలని కోరుతోంది. అందుకు మధ్యే మార్గంగా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యస్థీకరణ బిల్లుకు పలు సవరణలను ప్రతిపాదించింది కాషాయ పార్టీ. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సవరణలను సిద్ధం చేసింది బీజేపీ. ఇరు ప్రాంతాల నుంచి అందిన సవరణల ప్రతిపాదనలను షార్ట్ లిస్ట్ చేసి 9 సవరణల్ని బిల్లులో చేర్చడానికి సిద్దం చేసింది పార్టీ అధినాయకత్వం. బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు కేంద్రమంత్రి జైరాం రమేష్ ను కలసి సవరణల ప్రతిపాదనలను సమర్పించారు.
బీజేపీ ప్రతిపాదిస్తున్న సవరణలను పరిశీలిస్తే…
తెలంగాణ, సీమాంధ్రల్లో వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయాలని కోరింది. పోలవరం, ప్రాణహిత, పాల మూరు సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ లోటు ఉంటే.. దానికి కేంద్రమే ప్రత్యేకంగా నిధులిచ్చి పూరించాలని సూచించింది. విద్యుత్ కొనుగోళ్లకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఒప్పందాలన్నీ రద్దు చేసి… రెండు రాష్ట్రాలకు కొత్తగా ఒప్పందాలను వేర్వేరుగా చేయాలి. రెండు రాష్ట్రాల్లో వెటర్నరీ, హార్టీకల్చర్ వర్సిటీలను ఏర్పాటు చేయాలి. విభజన బిల్లులో ప్రస్తావించిన కేంద్ర వర్సిటీలతోపాటు, ఇతర విశ్వవిద్యాలయాలు, సంస్థల్ని విభజన జరిగిన రెండేళ్ల వ్యవధిలో నిర్మించాలి. ఇరు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే ఎన్నికలు జరపాలి. ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజధాని ఎక్కడ నిర్మిస్తున్నారనే దానిపై 45 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి. రాజధాని నిర్మానికయ్యే ఆర్థిక ప్యాకేజీలకు కేంద్రమే నిధులివ్వాలి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకాశ్మీర్ ప్రాంతాల్లో ఆదాయ పన్ను, ఎక్సైజ్ పన్ను రాయితీ ఇచ్చినట్లే రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణలోని వెనకబడిన ప్రాంతాల్లోనూ కొన్నేళ్ల వరకు ఇవ్వాలని బీజేపీ సవరణల చిట్టా రూపొందించింది.
మరి బీజేపీ ప్రతిపాదిత సవరణలను కేంద్రం బిల్లులో చేరుస్తుందా..? బీజేపీ నేతల కండిషన్స్ మధ్య కేంద్ర ప్రభుత్వం టీ బిల్లు ఆమోదానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy