పాపం పసివాళ్లు

భార్య భర్తల వివాదం రెండు పసిప్రాణాలను బలిగొంది. మల్కాజ్ గిరి చిన్నారుల మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. కనిపించకుండా పోయిన చిన్నారులు విగతజీవులుగా మారారు. భార్యపై కోపంతో కన్నతండ్రే వారిని దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్ఫర్ధలు కడుపున పుట్టిన బిడ్డలను కాటికి పంపేలా చేశాయి. అభం శుభం తెలియని చిన్నారుల పాలిట కన్నతండ్రే కాలయముడయ్యాడు. మేడ్చల్ లో చిన్నారుల డెడ్ బాడీలను పోలీసులు గుర్తించారు. ఇక్ఫాయ్ యూనివర్సిటీ ప్రొఫెసర్  రాఘవేంద్ర గురుప్రసాద్ తన పిల్లలను కడతేర్చి.. ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్నాళ్లుగా భార్య సుహాసినితో గొడవపడి విడిగా ఉంటున్నగురుప్రసాద్..భార్యపై కోపంతో శనివారం రోజు పిల్లలను తీసుకొని బయటకు వెళ్లాడు. ఆ తర్వాత వారికి విషమిచ్చి చంపినట్టు తెలుస్తోంది. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందే పిల్లలను చంపి.. మేడ్చల్ లోని సొంత ఖాళీ ప్లాట్ లోనే పూడ్చిపెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు… కుటుంబ కలహాలతో భార్యతో విడిగా ఉంటున్న గురుప్రసాద్.. తన ఇద్దరు పిల్లలను అప్పగించాలని కోర్టును ఆశ్రయించాడు. స్పందించిన కోర్టు.. ప్రతి నెల మొదటి, మూడవ శని, ఆదివారాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పిల్లలను గురుప్రసాద్ కు అప్పగించాలని ఆదేశించింది. శనివారం ఉదయం సుహాసిని దగ్గరకు వచ్చి పిల్లలను తీసుకెళ్లిన గురుప్రసాద్.. మధ్యాహ్నం ఒంటరిగా వచ్చి కోర్టు వ్యవహారంపై భార్యను నిలదీశాడు. ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లల రాక కోసం ఎదురుచూసిన సుహాసిని భర్త సెల్ కు కాల్ చేయటంతో గురుప్రసాద్ ఆత్మహత్య విషయాన్ని పోలీసులు చెప్పారు. కానీ అతని వెంట వెళ్లిన ఇద్దరు పిల్లలు కనిపించలేదు.

గురుప్రసాద్ సెల్ ఫోన్ ఆధారంగా మిస్టరీని ఛేదించారు పోలీసులు. ఆత్మహత్యకు ముందు.. సీ బాడీస్ ఇన్ మేడ్చల్.. అంటూ భార్యకు మెసేజ్ చేశాడు. కానీ ఆ ఎస్ఎమ్మెస్ సుహాసినికి చేరలేదు. డ్రాఫ్ట్ బాక్స్ లో ఉన్న మెసేజ్ ను పోలీసులు గుర్తించటంతో అసలు విషయం బయటపడింది. మట్టిదిబ్బల్లో కనిపించిన చిన్నారుల శవాలు చూసి అంతా అవాక్కయ్యారు. ముందుగానే గొయ్యి తీయించి ఉంచి.. చిన్నారులను హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. పిల్లల శవాలు వెలికితీస్తున్నప్పుడు ఓ కత్తి కూడా లభ్యమైంది.

మరోవైపు ఆత్మహత్యకు ముందు భార్య సుహాసినికి 12 పేజీల లేఖ రాశాడు గురుప్రసాద్. కలిసే ఉందామంటూ ప్రాధేయపడ్డాడు. విడాకులు తీసుకుంటే పిల్లలకు అన్యాయం జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. భార్యను ప్రాధేయపడుతూ ఫోన్లో మాట్లాడిన మాటలు కూడా రికార్డ్ చేశాడు. దాంతోపాటు.. గృహహింస చట్టాన్ని.. అందులోని 498ఏ సెక్షన్ సవరించాలంటూ కేంద్ర హోంశాఖకు లేఖరాశాడు గురుప్రసాద్. మొత్తానికి భార్యాభర్తల విభేదాలు.. అభం శుభం తెలియని చిన్నారుల నిండు ప్రాణాలు తీశాయి. గురుప్రసాద్ కు ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy