పాపాయిల మురిపెం ముణ్ణాళ్ల ముచ్చటేనా..?

happy-newbornపాలబుగ్గలు పసివాళ్లకు తల్లిఒడిలోనే నూరేళ్లు నిండిపోతున్నాయి. బుడి బుడి అడుగులు, పసివాడని నవ్వులు బోసిపోతున్నాయి. తల్లి కడుపు నుంచి బయటపడిన మరుక్షణమే అష్టకష్టాలు మొదలవుతున్నాయి. శిశువుల బతుకు దినదినగండంగా మారుతోంది. పసివాళ్ల మరణాలపై సర్వేలు చెబుతున్న లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి.

రాష్ట్రంలో నవజాత శిశువుల మరణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో 40 మంది వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. నవజాత శిశువుల మరణాల్లో దేశంలో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. ఇక సౌతిండియా విషయానికోస్తే…మొదటి స్థానం మన రాష్ట్రానిదే. ఈ విషయాన్ని స్వయంగా యునిసెఫ్ ప్రకటించింది. ప్రతీ ఏడాది రాష్ట్రంలో 36 వేల 830 మంది చిన్నారులు చనిపోతున్నారని సర్వేలో తేలడం ఆందోళన కలిగిస్తోంది.

SRS సర్వే ప్రకారం వెయ్యిమంది చిన్నారుల్లో ఐదేళ్లలోపు 41 మంది, ఏడాదిలోపు 39 మంది,నెలలోపు 25, నెల తర్వాత 21 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సంవత్సరం లోపు పిల్లల్లో 84 శాతం మంది, ఐదేళ్లలోపు 16 శాతం మంది కన్నుమూస్తున్నారని సర్వేలో వెల్లడైంది.  శిశువుల మరణాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు డాక్టర్లు.

నవజాత శిశుమరణాలు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. సర్కారీ దవాఖానాల్లో సిబ్బంది కొరత, సరైన మందులు, వసతులు లేకపోవడం పసివాళ్ల ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది. గర్భిణుల్లో సమస్యలు రాకుండా ఉండేందుకు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు..అంగన్ వాడీలకు శిక్షణ ఇస్తారు. వీరు.. ప్రెగ్సెన్సీ తో ఉన్నవారికి అవసరమైన ఐరన్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు అందిస్తారు. షుగర్, బీపీ  లెవల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసి… మందులు ఇస్తారు. బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే ముర్రుపట్టేలా అవగాహన కల్పిస్తారు.

కానీ ఇవేవీ అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పై స్థాయి సిబ్బంది పర్యవేక్షణా లోపం.. మరికొన్నిచోట్ల కిందిస్థాయి సిబ్బంది పనిచేయకపోవడం కారణంగా పరిస్థితుల్లో మార్పురావడం లేదు. ప్రభుత్వం మాత్రం పసివాళ్ల ప్రాణాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సరిపడినంతమంది సిబ్బందిని నియమించడంతోపాటు.. అన్ని సౌకర్యలు కల్పిస్తున్నాంటోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy