పాయింట్ పడింది: పెనాల్టీలపై జనం గుస్సా

points-trafficట్రాఫిక్‌ రూల్స్ ఉల్లంఘనలకు పెనాల్టీ పాయింట్స్‌ విధించే విధానం .. దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో మంగళవారం (ఆగస్టు1) నుంచి అమల్లోకి వచ్చింది. మొదటిరోజైన మంగళవారం.. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మలక్‌పేట్‌ వద్ద హెల్మెట్‌ ధరించకుండా బైక్‌ నడుపుతున్న పరశురాములు అనే వ్యక్తికి ఈ విధానంలో భాగంగా ఒక పెనాల్టీ పాయింట్‌ విధించారు. రోజు మొత్తమ్మీదా ట్రాఫిక్‌ పోలీసులు 1,450 వాహనాలను ఆపితనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించినవారికి 1,912 పెనాల్టీ పాయింట్లు వేశారు.

మొదటి రోజు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిలో ఎక్కువమంది హెల్మెట్‌ ధరించనివారే. ఇన్సూరెన్స్‌, పొల్యుషన్ పేపర్లు లేని వారూ ఉన్నారు. కొత్త విధానం తో 24 నెలల వ్యవధిలో 12 పెనాల్టీపాయింట్స్‌ నమోదైన వాహన దారుడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రవాణాశాఖ అధికారులు రద్దుచేస్తారు. ఏడాది పాటు ఆ రద్దు అమల్లో ఉంటుంది. తిరిగి లైసెన్స్‌ పొందాక కూడా మరోసారి 12 పెనాల్టీపాయింట్లు మించితే 2 సంవత్సరాల వరకూ డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తారు.

ట్రాఫిక్ పాయింట్లపై నగర ప్రజలు మండిపడుతున్నారు. పార్కింగ్ కాంప్లెక్స్ లు  కల్పించ కుండానే .. పార్కింగ్ చేసి వాహనాలపై నో పార్కింగ్ పాయింట్ల పేరుతో బాదడంపై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు సరైన పార్కింగ్ చూపకుండా నో పార్కింగ్ పనిష్మెంట్ ఎలా వేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. వసతుల్లేని సముదాయాలపై అటు పోలీసులు.. ఇటు GHMC అధికారులు చర్యలు తీసుకోకుండా సామాన్యులకు శిక్ష వేయడం ఏంటని అంటున్నారు. వ్యాపార సముదాయాలకు సరైన  పార్కింగ్ వసతులే లేనప్పుడు..తాము ఎక్కడ వాహనాలు  పార్కు చేసుకుంటామని ప్రశ్నిస్తున్నారు. ముందు ఈ విషయంపై అధికారులు దృష్టి సారించాలని…తర్వాత జరిమానాలు, పెనాల్టీ పాయింట్స్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే పెనాల్టీపాయింట్స్‌ విధానంపై పత్రికలు, కరపత్రాలు, సోషల్‌మీడియా, టీవీ చానళ్లలో విస్తృత ప్రచారం చేయించామంటున్నారు పోలీసు అధికారులు. వాహనదారుల్లో 20 రోజులపాటు అవగాహన కల్పించాకే అమల్లోకి తెచ్చామంటున్నారు. లైసెన్స్‌ రద్దు చేసి వాహనదారులను ఇబ్బందికి గురిచేయటం తమ లక్ష్యం కాదని, ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి హైదరాబాద్‌ను రోడ్డుప్రమాదాల రహిత నగరంగా మార్చటమే లక్ష్యంగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టామని వివరించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy