ఇంత నిర్లక్ష్యమా : రైలు ఢీకొని కవలలు మృతి

mmఇప్పటికే బోరుబావుల రూపంలో పిల్లల మరణాలు పెరుగుతున్నా.. తల్లిదండ్రుల్లో చిన్నపిల్లలపట్ల ఏమాత్రం నిర్లక్ష్యం తగ్గడంలేదు. నేటి బాలలే రేపటి పౌరులుగా చెప్పుకునే పసి బుగ్గలు పెద్దల నిర్లక్ష్యంతో.. చిన్న వయసులోనే  మృత్యువాత పడుతున్నారు. ఇందుకు ఉదాహరణే కామారెడ్డిలో జరిగిన కవలల  మృతి ఘటన. ఇంటికి సమీపంలోని రైలు పట్టాలపై ఆడుకుంటుండగా.. రైలు రూపంలో వచ్చిన మృత్యువు వారిని కబళిచింది. ముద్దుముద్దు మాటలతో అప్పటి వరకు సందడి చేసిన ఆ కవల చిన్నారులు విగత జీవులై కనిపించడం గ్రామస్తులను కలచివేసింది. కన్నవారికి కడుపుకోతను మిగిల్చిన ఈ ఘటన కామారెడ్డి మండలంలోని నర్సన్నపల్లిలో సోమవారం(ఆగస్టు-21) జరిగింది. నర్సన్నపల్లి గ్రామానికి చెందిన చందన భానుశ్రీ, చంద్రంలకు రెండున్నరేళ్ల క్రితం కవల పిల్లలు విద్వేశ్, విఘ్నేశ్‌లు ఉన్నారు.

చంద్రం కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం ఉదయమే పనిపై వెళ్లాడు. భానుశ్రీ ఏడు నెలల గర్భిణి. మధ్యాహ్నం 2 గంటల వరకు పడుకున్న పిల్లలు.. లేచి ఆడుకోవడానికి ఇంటి పక్కనే ఉన్న కొట్టం దగ్గరికి వెళ్లారు. అక్కడి నుంచి ఇంటికి సమీపంలోని రైలు పట్టాలపైకి చేరి ఆడుకోసాగారు. వీరి ఇల్లు గ్రామ శివారులో ఉండడంతో చిన్నారులు రైలు పట్టాలపై ఉన్న విషయాన్ని ఎవరూ గమనించలేదు.

మధ్యాహ్నం 3 గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి కామారెడ్డి వైపు వస్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలపై ఉన్న వీరిని ఢీ కొట్టింది. అయితే, పట్టాలపై పిల్లలను కొద్దిదూరంలో గమనించిన లోకోపైలట్‌ రైలును ఆపడానికి బ్రేక్‌ వేసినా ఫలితం లేకపోయింది.  కవలలు అక్కడికక్కడే మరణించారు. కవలల్లో ఒకరి మృతదేహం పట్టాల పక్కన పడిపోగా మరొకరి మృతదేహం తునాతునకలైంది. లోకో పైలట్‌ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనాస్థలానికి వచ్చి బోరున విలపించారు. ఒకేసారి జన్మించి..ఒకే రూపంతో ఉన్న చిన్నారుల పట్ల తల్లిదండ్రులతోపాటు..బంధువులు..స్థానికులు ప్రత్యేక అభిమానం చూపేవారు. ఇద్దరూ ఒకేసారి మృత్యువాతపడటాన్ని జీర్ణించుకోలేక కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించండి.  పిల్లలను కంటికిరెప్పలా కాపాడుకోండి.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy