పిల్లల బంగారు భవితకు పొదుపెలా?

childrenపిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకోని తల్లిదండ్రులుండరు. వారి భవిష్యత్తు అవసరాల కోసం వారు పుట్టినప్పటి నుంచే పొదుపు చేయాలనుకునేవారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది.  కాని మార్కెట్లో అనేక ఇన్వెస్ట్ మెంట్ స్కీంలు అందుబాటులో ఉన్నాయి. అయితే వేటిలో ఇన్వెస్ట్ చేయాలన్నదే పెద్ద సమస్య.  పిల్లల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న వివిధ ఇన్వెస్ట్‌మెంట్ స్కీంలు, వాటిలో పొదుపు చేస్తే వచ్చే రిటర్న్స్ ఎంత అనే దానిపై వెల్త్ మేనేజ్ మెంట్ లో తెలుసుకుందాం.

ఒకప్పుడు పిల్లలను పెంచి పెద్దచేసే వరకు తమ బాధ్యతగా తల్లిదండులు భావించేవారు.. కాని ప్రస్తుతం వారిని పెద్దచేయడమేకాదు..జీవితంలో స్థరపడేందుకు అవసరమైన చదువు సంధ్యలు..భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అవసరమైన నిధులు సమకూర్చడం కూడా బాధ్యతగా భావిస్తున్నారు ఈ కాలం పేరెంట్స్. దీంతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కడ ఎలా సేవింగ్ చేయాలో తెలసుకోవాలని పిల్లలకు సూచిస్తున్నారు..మరీ పిల్లల భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం తల్లిదండ్రులు ఏ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏమేరకు ప్రయోజనం పొందొచ్చో తెలుసుకుందాం.

మ్యూచువల్ ఫండ్స్ తో బంగరు భవిత

పిల్లల పేరుతో ఇన్వెస్ట్ చేసేందుకు మంచి ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్… పిల్లల పేరు మీద నేరుగా అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశమున్నా కొన్ని సంస్థలు వీరికోసం స్సెషల్ ఫండ్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. పిల్లల చదువు, పెళ్ళి అనేవి లాంగ్ టర్మ్ టార్గెట్స్. ఇందుకోసం డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ పొందొచ్చు.  కానీ ఈక్విటీల్లో పెట్టుబడి రిస్క్‌ అనే  సంగతి మర్చిపోకూడదు.  అయితే ఈక్విటీ ఫండ్స్ తో పోలిస్తే  చిల్డ్రన్ ఫండ్స్ విషయంలో రిస్క్ తక్కువగా ఉండే బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందిస్తున్నాయి. యూటీఐ చిల్డ్రన్ కెరీర్ ప్లాన్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్ గిఫ్ట్, ఎస్‌బీఐ మాగ్నం చిల్డ్రన్ బెనిఫిట్, హెచ్‌డీఎఫీసీ గిఫ్ట్ ఇన్వెస్ట్‌మెంట్ వంటి చైల్డ్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. యులిప్స్‌తో పోలిస్తే చార్జీలు తక్కువగా ఉండటం వీటి ఆకర్షణ. వీటిలో చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఎటువంటి పన్ను రాయితీలు లభించదన్నది కూడా గుర్తుంచుకోవాలి

నెలకు 5 వేల రూపాయల చొప్పున మ్యూచువల్ ఫండ్ స్కీంలో ఇన్వెస్ట్ చేస్తూ పోతే 15 ఏళ్లలో మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం విలువ తొమ్మిది లక్షలు అవుతుంది. ఈ మొత్తంపై సగటున 10 శాతం వార్షిక రాబడిని లెక్కేస్తే ఇన్వెస్ట్‌మెంట్ విలువ 20 లక్షల 89 వేలు అవుతుంది. అదే 15 శాతం లెక్కగడితే 33 లక్షల 84 వేలు చేతికి వస్తుంది.

రిస్క్ లేకుండా పొదుపు

పిల్లల కోసం చేసే ఇన్వెస్ట్ మెంట్స్ లో స్థిరంగా ఆదాయాన్నిచ్చే పథకాలేంటో చూద్దాం. రిస్క్‌లేని స్కీమ్స్ అంటే వెంటనే  గుర్తుకు వచ్చేవి.. బ్యాంకు డిపాజిట్లు, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్. ప్రస్తుతం ఈ మూడు పథకాలు ఇంచుమించు 8-10 శాతం రిటర్న్ ఇస్తున్నాయి. బ్యాంకులు కూడా ఎనిమిది సంవత్సరాలు మించిన కాలపరిమితి గల డిపాజిట్లపై ప్రస్తుతం తొమ్మిది శాతానికిపైగా వడ్డీని ఇస్తున్నాయి. అదే పోస్టాఫీసులు ఆరు ఏళ్ల కాలపరిమితి ఉన్న నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ కూడా ఎనిమిది శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంకులు, పోస్టాఫీసులలో తీసుకునే వీలున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌ను పిల్లల పేరు మీద కూడా ఓపెన్ చేయవచ్చు. కాని గార్డియన్ గా ఒకరు ఉండాలి. 15 ఏళ్ల కాలపరిమితి కలిగిన పీపీఎఫ్ అకౌంట్స్‌పై ప్రసుత్తం 8 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ మూడు సేవింగ్ పథకాల్లోను తల్లిదండ్రులు పన్ను రాయితీలను పొందే అవకాశం ఉంది. అయిదు సంవత్సరాలలోపు కాలపరిమితి గల డిపాజిట్లు అయితే పన్ను రాయితీలు లభించవు.

ఐసీఐసీఐ వంటి బ్యాంకులు పిల్లల డిపాజిట్లకు అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఆంధ్రాబ్యాంక్ -కిడ్డీబ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్-యంగ్‌స్టార్, హెచ్‌డీఎఫ్‌సీ-కిడ్స్ అడ్వాంటేజ్, ఇండస్‌ఇండ్-యంగ్ సేవర్, ఐడీబీఐ-పవర్‌కిడ్స్, ఐఎన్‌జీవైశ్యా-జింగ్ పేరుతో చిల్డ్రన్ అకౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ అకౌంట్స్‌లో కనీస బ్యాలెన్స్ తక్కువగా ఉండటం, డెబిట్‌కార్డు, చెక్‌బుక్ వంటి ఆఫర్లు ఉండటం వీటి ప్రత్యేకత. నెలకు 5వేల రూపాయల చొప్పున 15 ఏళ్ల బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ చేస్తే ఆ మొత్తం 9 లక్షలవుతుంది. దీనిపైన సగటున 8% వడ్డీరేటు వస్తుందనుకుంటే 15 ఏళ్ల తర్వాత చేతికి వచ్చేది 17లక్షల 33 వేల రూపాయలు వస్తాయి.

పిల్లలకు ఇన్సూరెన్స్ చాలా బెటర్

పిల్లల పథకాల్లో ఇన్సూరెన్స్ స్కీంలకు బాగా డిమాండ్  ఉంది. దాదాపు అన్ని బీమా కంపెనీలూ పిల్లల కోసం ప్రత్యేకంగా పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి రిస్క్‌లేని సంప్రదాయ పాలసీలు కాగా మరొకటి నష్టభయం ఉండే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్. పిల్లల పేరు మీద దాదాపు అన్ని యులిప్స్‌ల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశమున్నా పిల్లల కోసం ప్రత్యేక పథకాలను బీమా కంపెనీలు ప్రవేశపెడుతున్నాయి. ఇలా పిల్లల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాలను రిస్క్ తక్కువగా ఉండే విధంగా అంటే ఈక్విటీల్లో తక్కువగా, డెట్, మనీ మార్కెట్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే విధంగా రూపొందిస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ అందిస్తున్న స్మార్ట్‌కిడ్ ప్రీమియర్, ఎస్‌బీఐ లైఫ్ స్మార్ట్ స్కాలర్ పథకాలు యులిప్ కోవకు చెందినవి. యులిప్స్ రాబడులు మార్కెట్ స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి కాబట్టి వీటి రాబడులపై గ్యారంటీ ఉండదు.

ఇక ట్రెడీషనల్ చిల్డ్రన్ స్కీంల విషయానికి వస్తే ఇవి రెండు రకాలు .. మనీ బ్యాక్ లేదా ఒకేసారి మొత్తం సొమ్ము చేతికి వచ్చే ఎండోమెంట్ పాలసీలుగా వర్గీకరించవచ్చు. సాధారణంగా పిల్లల మనీ బ్యాక్ పాలసీలు వారికి 18ఏళ్లు వచ్చిన తర్వాత పాలసీ కాలపరిమితి పూర్తి అయ్యే వరకు సంవత్సరానికి కొంత మొత్తం చొప్పున అందిస్తుంటాయి. ఇక ఎండోమెంట్ పాలసీల విషయానికి వస్తే పిల్లల చదువు లేదా పెళ్ళికి అక్కరకు వచ్చే విధంగా చెల్లిస్తారు. పిల్లల పేరు మీద పాలసీలు తీసుకున్నప్పుడు పేయర్ బెనిఫిట్ రైడర్‌ను తీసుకోవడం మరచిపోవద్దు. దీని వలన ప్రీమియం చెల్లించే వ్యక్తికి అనుకోని సంఘటన జరిగినా తరువాత ప్రీమియంలు చెల్లించకుండానే పాలసీని కొనసాగించే వీలు కలుగుతుంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy