పీవీకి భారతరత్న అడుగుతాం : సీఎం కేసీఆర్

Pv Ghat4‘పీవీ తెలంగాణ ఠీవి’ అని అన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు వద్ద ఉన్న పీవీ ఘాట్ లో పీవీ నరసింహారావు 93 జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీకి కేంద్రంలో, రాష్ట్రంలో సముచిత గౌరవం లభించలేదన్నారు. పీవీ కి భారతరత్న ఇవ్వాలని కేబినెట్ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు. పీవీ పేరు మీద ఒక జిల్లాను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఒక యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టనున్నట్లు తెలిపారు. పీవీకి రాష్ట్రంలో, కేంద్రంలో సముచిత గౌరవం లభించలేదన్నారు. పీవీ చనిపోయినపుడు తాను ఢిల్లీలోనే ఉన్నానని,  మరణానంతరం జరిగిన ఘటన బాధించిందన్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశ ఖ్యాతిని పెంచిన అంతటి వ్యక్తిని రాజకీయ కోణంలో చూడటం బాధాకరమని అభిప్రాయపడ్డారు. పీవీ బహుభాషా కోవిదుడని, భాషా పరంగా చూసినా ఆయనకు ఎన్నో అవార్డులు ఇవ్వొచ్చన్నారు. భూ సంస్కరణలు దేశంలోనే తొలిసారి అమలు చేశారని, దీని వల్ల ఇబ్బందులు వస్తాయని తెలిసినా.. కూడా తగ్గకుండా దేశానికి మార్గదర్శకత్వం చేశారని కొనియాడారు. ఆయన తీసుకున్న సంస్కరణల కారణంగా పదవీచ్యుతుడయ్యారని.. కానీ తగ్గకుండా ఆచరణాత్మకంగా చేసి చూపారన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇంతకు పదిరెట్లుగా వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. పీవీ ఖ్యాతి తెలంగాణ జాతి ఖ్యాతి అని, ఆయన ఖ్యాతి విశ్వవ్యాప్తమయ్యేలా హైదరాబాద్ లో పీవీ మెమోరియల్ ఏర్పాటు చేసి, అక్కడ వారి రచనలు, జ్ఞాపకాలు ఏర్పాటు చేస్తామన్నారు. పీవీ నరసింహారావు విగ్రహం ట్యాంక్ బండ్ పై కూడా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. హైదరాబాద్ లో మంచి స్థానంలో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఢిల్లీలో ఘాట్ ఏర్పాటయ్యేలా ఢిల్లీ ప్రభుత్వానికి వినతి పంపుతామని తెలిపారు. పీవీ ఆదర్శాలు భవిష్యత్తు తరాలకు తెలిసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

పీవీకి భారత రత్న ఇవ్వాలి :Pv Ghat1 Pv Ghat6

పీవీ నరసింహారావు కు భారతరత్న ఇవ్వాలని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. ఇక పీవీ జయంతిని అధికారికంగా జరపడం అభినందనీయమని కాంగ్రెస్ నేత జానా రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, సంస్కృతం, పంజాబీ, ఉర్దూ తదితర దేశ భాషలతో పాటు ఇంగ్లీషు, ఫ్రెంచ్, ఇరానీ, జర్మనీ లాంటి మొత్తం 17 భాషలు మాట్లాడగల నేతలు దేశంలో లేరన్నారు. వేయిపడగలు నవలను సహస్రఫణ్ పేరుతో హిందీలోకి అనువదించి తన సాహిత్యాభిరుచిని చాటుకున్నారని కొనియాడారు. ఇక గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. పీవీ జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య పోరాటం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. ఏ పదవిలో ఉన్నా సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. పీఎం అయ్యాక తొలిసారి రాష్ట్రానికొచ్చిన సందర్భంగా.. ‘దేశానికి రాజైనా తల్లికి కొడుకే కదా..’ అన్న పీవీ వ్యాఖ్యలు అందరికీ ఆదర్శనీయమన్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy