‘పేట’ రివ్యూ: స్టైలు స్టైలురా.. ఇది పాత కథేరా

రన్ టైమ్: 2 గంటల 52 నిమిషాలు
నటీనటులు : రజినీకాంత్, సిమ్రాన్, త్రిష, విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, శశికుమార్, బాబీ సింహా, మేఘా ఆకాశ్, నరేన్ తదితరులు
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాత : కళానిధి మారన్
తెలుగు నిర్మాత: వల్లభనేని అశోక్‌
సంగీతం : అనిరుద్ రవిచందర్
సినిమాటోగ్రఫీ : యస్ తిరు
ఎడిటర్ : వివేక్ హర్షన్
రిలీజ్ డేట్: జనవరి 10,2019

స్పీడుగా సినిమాలు చేసేస్తోన్న రజనీకాంత్‌.. ‘2.0’ విడుదలై రెండు నెలలు తిరక్కముందే ‘పేట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి ‘పిజ్జా’ ఫేం కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించాడు. మునుపటి రజనీకాంత్‌ను ఈ సినిమాలో చూడబోతున్నారంటూ ‘పేట’ టీమ్‌ చేసిన ప్రచారం ఎంతవరకూ వర్కవుట్‌ అయిందో చూద్దాం.

కథ :
హిల్ స్టేషన్‌లోని కాలేజీ హాస్టల్‌కు వార్డెన్‌గా జాయిన్‌ అవుతాడు కాళి (రజనీకాంత్). అలాంటి చిన్న ఉద్యోగానికి పెద్ద స్థాయి వ్యక్తుల రికమండేషన్‌ మిగతా వారిని ఆశ్చర్యపరుస్తుంది. వచ్చీ రావడంతోనే ర్యాగింగ్‌ను అడ్డుకుని మైఖెల్‌ (బాబీ సింహా) గ్యాంగ్‌ ఆట కట్టిస్తాడు. క్వాలిటీ ఫుడ్‌ ఇవ్వని మెస్‌ కాంట్రాక్ట్ మార్పించేసి హాస్టల్‌ కుర్రాళ్లకు మరింత దగ్గరవుతాడు. అన్వర్‌ అనే కుర్రాడి ప్రేమకు సాయం చేయడంతో పాటు అతనిపై ప్రత్యేక వాత్సల్యం చూపిస్తుంటాడు. ఈ క్రమంలో అన్వర్‌పై ఓ గ్యాంగ్‌ దాడి చేయగా అడ్డుకుని అండగా నిలుస్తాడు. అన్వర్‌పై దాడి చేసిందెవరు, ఎందుకు చేశారు అనే ప్రశ్నల నుంచి కాళి గతం బయటకు వస్తుంది. అసలు కాళీ ఆ కాలేజీకి ఎందుకు వచ్చాడు, అన్వర్‌తో ఉన్న సంబంధం ఏంటి.. అతని గతమేంటి అనేది మిగతా కథ.

ఎవరెలా..
ఈ సినిమాకు మేజర్‌ హైలెట్‌ రజనీకాంత్‌ నటనే. హాస్టల్‌ వార్డెన్‌ పాత్రకు తగ్గట్టు తన మార్క్ స్టైల్‌తో పాటు సెటిల్డ్ పెర్ఫామెన్స్‌తో మెప్పించారు. కామెడీ బాధ్యత కూడా ఆయన భుజానేసుకున్నాడు. క్రూరమైన ఆలోచనలు గల పిరికివాడైన విలన్‌గా నవాజుద్దీన్‌ సిద్దిఖి మెప్పించాడు. మరో కీలకపాత్ర పోషించిన విజయ్‌ సేతుపతి తనదైన శైలి నటన కనబరచాడు. కనిపించింది కాసేపే అయినా గ్లామర్‌తో ఆకట్టుకున్నారు సిమ్రాన్‌, త్రిష. రజనీకాంత్‌ సినిమాకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకున్నాడు సంగీత దర్శకుడు అనిరుధ్‌. పాటల కంటే మెరుగ్గా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లో సత్తా చాటాడు. తిరు సినిమాటోగ్రఫీ ఆకట్టుకుుంటుంది. ఎటొచ్చీ ఎడిటింగ్‌లో కత్తెర వేయాల్సిన సాగతీత సీన్స్‌ మాత్రం బోలెడు. నిర్మాణ విలువల్లో రాజీ పడలేదు సన్‌ పిక్చర్స్.

ఎలా ఉందంటే…
అనగనగా ఓ హీరో. ఊరికి దూరంగా మారుపేరుతో బతుకుతున్న అతనికో భారీ ప్లాష్ బ్యాక్‌. తనవారిని విలన్స్‌ చంపేస్తారు. వాళ్లకు ఇచ్చిన మాట కోసమో, మరొకరిని బ్రతికించుకోవడం కోసమో హీరో పేరు మార్చుకు కామన్‌మ్యాన్‌ అయిపోతాడు. ఇంటర్వెల్‌ టైమ్‌కు ఈ ప్లాష్ బ్యాక్‌ రివీల్‌. సెకండాఫ్‌లో విలన్‌ను ఎలా చంపాడనేది కథ. ఇలాంటి కథతో ఇదే రజనీకాంత్‌ హీరోగా ‘బాషా’ సినిమా వచ్చింది. తెలుగులోనూ చాలా చిత్రాలొచ్చాయి. అప్పట్లో వాడి వాడి షెడ్‌కు వెళ్లిపోయిన ఈ పాత హిట్‌ ఫార్ములానే రజనీకాంత్‌ ‘పేట’ కోసం దుమ్ముదులిపి తీసుకొచ్చాడు కార్తీక్‌ సుబ్బరాజ్‌. అయితే ఫస్ట్ హాఫ్‌లో హాస్టల్‌ నేపథ్యంలో వచ్చే సీన్స్‌ అంతా ఎంటర్‌టైన్‌ చేస్తాయి. ఎప్పుడైతే ప్లాష్ బ్యాక్‌ మొదలవుతుందో అది మొదలు కథ రొటీన్‌ రివేంజ్‌ డ్రామాలోకి వెళ్తుంది. పైగా ఆ తమిళ నేటివిటీ తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం రుచించదు. ప్రీ-క్లైమాక్స్‌లో కథ ఏదో కొత్త మలుపు తిరగబోతోంది అని ఆనందపడేలోపు సాగతీత సీన్స్‌ ఎక్కువై ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. ఇంతోటి రొటీన్‌ స్టోరీకి అడ్డుపడుతుందని కాబోలు ప్రేమ, రొమాన్స్ వంటివన్నీ సెకండాఫ్‌లో అంతగా టచ్‌ చేయలేదు. దీంతో సిమ్రాన్‌, త్రిష అతిథి పాత్రల్లా అనిపిస్తారు. ఇక నవాజుద్దీన్‌ సిద్దిఖి, విజయ్‌ సేతుపతి, శశికుమార్‌, బాబి సింహా వంటి టాలెంటెడ్‌ యాక్టర్స్‌ ఈ సినిమాలో ఉన్నప్పటికీ వారినీ దర్శకుడు సరిగా వాడుకోలేదు. మొదటి నుంచి చిత్రబృందం చెపుతున్నట్టుగా ఒకప్పటి రజనీకాంత్‌ను ఇందులో చూడొచ్చు. ఈమధ్య కాలంలో ఏ సినిమాలో కనిపించనంతగా జోష్‌గా, తనదైన స్టైల్‌తో మెప్పించాడు రజనీకాంత్‌. అది మినహా ప్రేక్షకులను ఎంగేజ్‌ చేసే సర్ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ ఏవీ ఈ సినిమాలో లేవు. క్లైమాక్స్‌లో విజయ్‌ సేతుపతి క్యారెక్టర్‌ ట్విస్ట్ కూడా పర్వాలేదనిపిస్తుంది తప్ప కార్తీక్‌ గత చిత్రాల స్థాయిని అందుకోదు.

ఫైనల్‌గా..
రజనీకాంత్‌ వంటి మాస్‌ స్టార్‌తో సినిమా చేయాలంటే ఆయన స్టైల్‌, మేనరిజంను దృష్టిలో ఉంచుకుని తీయాలి. ఈ సినిమా విషయంలో అది మాత్రమే దృష్టిలో పెట్టుకుని కథను వదిలేశాడు కార్తీక్‌ సుబ్బరాజ్‌. రజనీకాంత్‌ స్టైల్‌లో పడి తన స్టైల్‌ మర్చిపోయాడు కార్తీక్. రజనీకాంత్‌ ఎంట్రీ మొదలు క్లైమాక్స్ వరకూ అభిమానులకు ఈ సినిమా కన్నుల పండుగలా ఉంటుంది. కానీ కామన్‌ ఆడియన్స్‌కు మాత్రం పాత కథనే మళ్లీ చూపిస్తున్నారనే విసుగు కలిగిస్తుంది. ‘పిజ్జా’, ‘జిగర్తాండ’ వంటి వైవిధ్యమైన చిత్రాలు రూపొందించిన కార్తీక్‌ సుబ్బరాజ్‌.. ఇలాంటి రొటీన్‌ సినిమాకు దర్శకుడు అంటే నమ్మలేం. అతని నుంచి ఎప్పటిలాగే వైవిధ్యం ఆశిస్తే మాత్రం తీవ్ర నిరాశ తప్పదు. అయితే అతని టేకింగ్‌, అనిరుధ్‌ మ్యూజిక్‌తో రజనీకాంత్‌ సీన్స్‌ ఎలివేట్‌ అయ్యాయి. మొత్తానికి ఈ సినిమాకు సాధారణ ప్రేక్షకులైతే పాత కథ మళ్లీ చూసేందుకు ఓపికతో వెళ్లాలి.. రజనీకాంత్‌ అభిమానులైతే విజిల్స్‌ వేయడానికి జోష్‌గా వెళ్లొచ్చు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy