ప్రజాకర్షక పథకాలు లేని బడ్జెట్

modiరానున్న బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకాలేమీ ఉండకపోవచ్చని సంకేతాలిచ్చారు ప్రధాని మోడీ. ప్రజలు ఉచితాలను కోరుకుంటారన్నది ఒక భ్రమ అని, వారు నిజాయితీతో కూడిన పాలనను కోరుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు ప్రధాని. అన్నదాతను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలున్న వేళ.. గత మూడున్నరేళ్ల తన పాలనపై రిపోర్ట్‌ కార్డును, భవిష్యత్‌ పాలన వివరాలను వెల్లడించారు మోడీ. జీఎస్టీ, ఉద్యోగ కల్పన, కాంగ్రెస్‌ ముక్త భారత్, నోట్ల రద్దు, న్యాయవ్యవస్థ, వ్యవసాయ సంక్షోభం, విదేశాంగ విధానం.. తదితర అంశాలపై ఆయన తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. ఓ ఆంగ్ల న్యూస్ చానెల్ కు ప్రధాని ఇచ్చిన ఇంటర్వ్యూలోని సారాంశం అతని మాటల్లోనే… మొదటినుంచీ పాపులిజం (ప్రజాకర్షక విధానాలు)కు వ్యతిరేకం. బడ్జెట్‌ విషయంలో ఆర్థిక మంత్రి, దీనికో బృందం పనిచేస్తుంది. ఇందులో నేను జోక్యం చేసుకోను. సామాన్యప్రజలు ఏవీ ఉచితంగా కోరుకోరు. వారలా కోరుకుంటారనుకోవడం భ్రమ. ప్రజలు నిజాయితీతో కూడిన పాలనను కోరుకుంటారు.

జీఎస్టీ వల్ల ప్రజలకు మేలు

పన్నుల సంస్కరణలో ఓ కీలక ముందడుగు జీఎస్టీ అని కొనియాడారు మోడీ. దేశమంతా ఒకే పన్ను వ్యవస్థ ఉండాలన్న ఈ విధానంలోని లోపాలను సరిదిద్దే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉ న్నాం. ఈ చట్టాన్ని మరింత సమర్థవంతంగా మారుస్తాం. దీర్ఘకాలంలో జీఎస్టీ వల్ల దేశ ప్రజలందరికీ మేలు జరుగుతుంది. కొత్త మార్పు వస్తున్నప్పుడు ఆర్నెల్లు, ఏడాది, రెండేళ్లు సమయం పడుతుండవచ్చు. కానీ అన్నీ అడ్డంకులూ తొలగిపోతాయి. ఇందుకు అందరూ కలిసి పనిచేయాలి. స్వార్థ రాజకీయాలు చేయటం మంచిది కాదు. జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలకూ ప్రాతినిధ్యముంది. కౌన్సిల్‌ భేటీలో సానుకూలంగా మాట్లాడి.. బయటికొచ్చాక విమర్శలు చేస్తున్నారు.

నోట్ల రద్దు ఓ విజయగాథ

పార్లమెంటులోనూ అంతే.. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే. దీనిపై మేమేమీ మాట్లాడబోం. నోట్ల రద్దు కూడా ఒక విజయగాథ. ఉపాధి గురించి తప్పుడు ప్రచారం జరుగుతోంది. దేశంలో ఓ స్వతంత్ర సంస్థ జరిపిన విచారణలో.. ఏడాదిలో 18–25 ఏళ్ల లోపున్న యువకులతో 70 లక్షల కొత్త ఈపీఎఫ్‌ అకౌంట్లు వచ్చినట్లు తేలింది. ఇది ఉపాధి కల్పన కాదా? రోడ్లు, రైలుపట్టాల నిర్మాణంలోనూ ఉపాధి పెరిగింది. ముద్ర పథకం ద్వారా 10 కోట్ల మందికి రూ.4లక్షల కోట్ల రుణాలిచ్చాం.

ట్రిపుల్‌ తలాక్‌…

ఏ రాజకీయ పార్టీయైనా దేశం కన్నా గొప్పది కాదు. అన్నింటికన్నా ముందు దేశమే. అలాంటి దేశంలో బాధిత వర్గానికి మేలు చేసే చట్టం వస్తున్నప్పడు దీన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవటం బాధాకరమే. రాజీవ్‌ గాంధీ చేసిన పొరపాటు (1985లో షాబానో కేసులో)ను కాంగ్రెస్‌ మళ్లీ మళ్లీ చేస్తోంది. ట్రిపుల్‌ తలాక్‌ బాధితుల కథనాలు బాధాకరం. అలాంటి బాధితులకు సరైన గౌరవం కల్పించటం మా బాధ్యత. కాంగ్రెస్‌ దీన్ని రాజకీయం చేద్దామనుకుంటోంది. ఇది మతానికి సంబంధించిన విషయం కాదు. బాధితురాలి ఆక్రందనను అర్థం చేసుకోవాల్సిన సమయమిది.

సుప్రీం వివాదం అంతర్గతం

సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియర్‌ న్యాయమూర్తుల మధ్య నెలకొన్నవివాదం పూర్తిగా వారి అంతర్గత విషయం. ఈ వివాదానికి రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలి. మన దేశ న్యాయవ్యవస్థ చాలా గొప్పది. దీనిలో భాగస్వాములైన వారంతా చాలా గొప్పవారు, సమర్థులు. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకముంది. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు. జమిలీ ఎన్నికలు జరపాలని మేం కోరుకుంటున్నాం. అయితే ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలి.  బడ్జెట్‌కు ఓ తేదీ ఉన్నట్లే.. ఎన్నికలకూ ఐదేళ్లకోసారి ఓ తేదీని ఫిక్స్‌చేయాలి. దీని ద్వారా ఖర్చులు తగ్గుతాయి. చాలా మేలు జరుగుతుంది.

రైతులకు మేలు చేస్తున్నాం

అన్నదాతను ఆదుకోవటం మనందరి బాధ్యత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా మరింత కృషిచేయాల్సిన అసవరముంది. మా ప్రభుత్వం తీసుకొస్తున్న పలు పథకాలు రైతులకు మేలు చేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌పై దృష్టిపెట్టాం. రైతు ఉత్పత్తులకు వాల్యూ అడిషన్‌ చేస్తాం.

ఎన్నికలు లక్ష్యం కాదు…

ఎన్నికలు ఎన్నటికీ నా లక్ష్యం కాదు. ఎన్నికల కోసం నా టైంటేబుల్‌ను మార్చుకోను. దేశ ప్రజలకు సేవ చేయటం, ఇందుకోసం ముందుగా నిర్ణయించుకున్న పనులు పూర్తి చేయటమే నా లక్ష్యం. సాంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన మాత్రం అనుకున్నంత స్థాయిలో జరగలేదు.

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy