ప్రతి ఇంట్లో హడావిడే : మూడు రోజుల్లో లక్ష పెళ్లిళ్లు

weddingఈ నెలలోనే మంచి ముహూర్తాలు మూడే ఉన్నాయి. ఇకపోతే మూడు నెలల వరకు ముహూర్తాలు లేవటా.. అందుకే ఆ మూడు రోజుల్లో లక్షకుపైగా పెళ్లిళ్లు జరుగబోతున్నాయి. దీనితో తెలంగాణకే పెళ్లి కళ వచ్చేసినట్లయింది. మంచి ముహూర్తం మించితే దొరకదని లక్షలాది మంది ఆ మూడు రోజుల్లోనే మూడు ముళ్లు వేయించేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా గోధూళి ముహూర్తాల్లో అంటే సాయంత్రం, రాత్రి వేళల్లో పెళ్లిళ్లు చేసేందుకు తెలంగాణ ప్రజానీకం పెద్దగా ఆసక్తి చూపించరు. ఇప్పుడు వాటికి కూడా సై అంటున్నారు. ఫంక్షన్‌ హాళ్లు, పురోహితులు, వంటవాళ్లు, ఫొటో, వీడియోగ్రాఫర్లకు డిమాండ్‌ నేపథ్యంలో రాత్రి పెళ్లిళ్లకు కూడా సిద్ధమయ్యారు. ఈనెల 9 నుంచి మౌఢ్యమి వెళ్లిపోయింది. ఈనెల 22 నుంచి 29 వరకు వివాహ ముహూర్తాలున్నాయి. ప్రధానంగా 23, 24, 25 తేదీల్లోనే మంచి ముహూర్తాలు ఉండడం మూలంగా ఆ రోజుల్లోనే పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. ఈ ముహూర్తాలు పోతేమళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 వరకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో వేలాది మంది ఇప్పుడే వివాహాలు జరిపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ నెల 23, 24, 25 తేదీల్లో బ్రహ్మ ముహూర్తాలు ఉండడం, అనువైన తిథి, ఘడియలు ఆ రోజుల్లోనే ఉండడంతో వధూవరుల కుటుంబ సభ్యులు ఆ ముహూర్తాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ మూడు రోజుల్లోనే తెలంగాణలో దాదాపు 98 వేల వివాహాలు జరగనుండగా ఈనెల 29 వరకు మరో 10 వేల వరకు పెళ్లిళ్లు జరగగున్నాయి. అంటే, వారం రోజుల్లోనే దాదాపు లక్షా పది వేల వివాహాలు జరగనున్నాయి. హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా వివాహాలు జరుగుతుండగా, అతి తక్కువ ఖమ్మం జిల్లాలో జరుగుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 40 వేల వివాహాలు జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 25 వేలు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 10 వేలకుపైగా జరుగుతున్నాయి. అవిభాజ్య ఆదిలాబాద్‌ జిల్లాలో దాదాపు 1500 వరకు, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 800కుపైగా, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 700కుపైగా నల్లగొండ జిల్లాలో 3000, మెదక్‌ జిల్లాలో 2500, ఖమ్మం జిల్లాలో 250 వివాహాలు జరుగుతున్నాయి.

డిమాండ్‌తో పెరిగిన రేట్లు..

పెళ్లిళ్లకు డిమాండ్ పెరగడంతో గతంలో రూ.2 లక్షలు ఉన్న ఆ ఫంక్షన్‌ హాల్‌ రేట్‌ను రూ.3 లక్షలకు పెంచేశారు. రూ.20 వేలకు వేసే మండపాన్ని ప్రస్తుతం రూ.50 వేలకు పెంచారు. స్టార్‌ హోటళ్ల నుంచి చిన్న స్థాయి హోటళ్లలో ఉండే చిన్న హాళ్లను సైతం బుక్‌ చేసుకుంటున్నారు. గ్రేటర్‌ పరిధిలో 10వేల వరకు ఫంక్షన్‌ హాళ్లు ఉండగా వెయ్యి కమ్యూనిటీ హాళ్లున్నాయి. అన్నీ ఇప్పటికే బుక్‌ అయిపోయాయి. దాంతో చాలా మంది ప్రైవేట్‌ పాఠశాల, కళాశాల ఆవరణల్లో, ఆలయాల్లో, తమ ఇళ్ల ముందు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో అన్ని ఐటమ్స్‌తో పెట్టే భోజనం ప్లేట్‌ రూ.వెయ్యి వరకు ఉండగా ప్రస్తుతం రూ.1400 వరకు పెంచేశారు. పూల ధరలకూ రెక్కలొచ్చాయి. పురోహితులు సైతం ఇదే అదనని మూడు, నాలుగు రేట్లు ధరలు పెంచేశారు. 20 వేలు తీసుకునే పురోహితుడు లక్ష డిమాండ్ చేస్తున్నారు.

 

 

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy