ప్రతి పేదవాడి ఇంటికీ విద్యుత్‌ సరఫరా: మోడీ

MODIపేదల సంక్షేమం కోసం ప్రధాని నరంద్రేమోదీ మరో పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి పేదవాడి ఇంటికీ విద్యుత్‌ సరఫరా అందించడమే లక్ష్యంగా ‘ప్రధానమంత్రి సహజ్‌ బిజ్లీ హర్‌ఘర్‌ యోజన’ (సౌభాగ్య) పథకాన్ని మోడీ సోమవారం (సెప్టెంబర్ 25) ప్రారంభించారు. పేద ప్ర‌జ‌ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుంద‌న్నారు ప్రధాని మోడీ. అందులో భాగంగానే సౌభాగ్య యోజ‌న ప‌థ‌కాన్నీ ప్రారంభించిన‌ట్లు తెలిపారు. దేశంలోని 4 కోట్ల మందికి ఇప్ప‌టికీ విద్యుత్ స‌దుపాయం లేద‌ని… 2019 మార్చి 31 నాటికి అన్ని ఇళ్ల‌కు విద్యుత్ సౌక‌ర్యం అందాల‌న్న‌దే తమ ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. మోడీ. అంతేకాదు బీపీఎల్ కార్డున్న వారందరికీ ఉచితంగా విద్యుత్ ఇస్తామన్నారు.

స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా దేశంలోని 18 వేల గ్రామాల్లో విద్యుత్‌ లేదని.. ఆ గ్రామాల్లోనూ విద్యుత్‌ వెలుగులు విరజిమ్మేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు ప్రధాని .పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు కిరోసిన్‌ దీపాల కింద చదువుతున్నారని…చాలాచోట్ల మహిళలు చీకట్లోనే వంటలు వండుతున్నారన్నారు. ఇప్పటికే 15 వేల గ్రామాల్లో విద్యుత్‌ అందించామని, మిగిలిన 18 వేల గ్రామాలకూ విద్యుత్‌ ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆ కోరిక ప్రధానమంత్రి సహజ్‌ బిజ్లి యోజన ద్వారా తీరుతుందన్నారు. విద్యుత్‌ లోటు నుంచి బయటపడి మిగులు విద్యుత్‌ దిశగా భారత్‌ ముందడుగు వేసిందన్నారు ప్రధాని మోడీ.

సౌభాగ్య పథకం కింద అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు అందేలా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది కేంద్రం. ఇందుకు రూ.16 వేల 320కోట్లు అవుతుందని అంచనా. గ్రామీణ ప్రాంతాలకు రూ.14వేల 025 కోట్లు కేటాయించగా, పట్టణ ప్రాంతాల కోసం రూ.2 వేల 295కోట్లు కేటాయించారు.

ఈ పథకం అమలుకు కేంద్రం 60 శాతం గ్రాంటు ఇవ్వనుంది. రాష్ట్రాలు 10 శాతం భరించనున్నాయి. మిగిలిన మొత్తాన్ని రుణాల ద్వారా సమకూర్చనున్నారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు 85 శాతం నిధులను కేంద్రం గ్రాంటు రూపంలో ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఐదు శాతం భరించనుంది. మొత్తంగా ఈ పథకం కోసం రూ.12వేల320 కోట్లు కేంద్రం భరించనుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy