ప్రపంచకప్‌ గెలిచి ఉంటే బాగుండేది: మిథాలీ

mitaliఉమెన్స్ వరల్డ్ కప్ లో ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిన ఇండియా టీంకు దేశ వ్యాప్తంగా లో భారీగా ఆదరణ లభించింది. తమ జట్టు టైటిల్‌ నెగ్గకపోయినా దేశమంతటా అభిమానులు మద్దతు పలకడం నిజంగా సంతోషంగా ఉందన్నారు భారత మహిళల జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌.

ఫైనల్లో అంత దగ్గరగా వచ్చి ఓడిపోవడంతో నేను ఎంతగానో బాధ పడ్డానని తెలిపారు. గుండె పగిలినట్లు అనిపించిందన్నారు. అంతా కోల్పోయినట్లు పరధ్యానంలో ఉండిపోయానని తెలిపారు. కోలుకునేందుకు చాలా సమయం పట్టిందన్నారు. అయితే ముంబైలో దిగే సమయంలో విమానాశ్రయంలో మాకు దక్కిన స్వాగతం, పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులను దాటుతూ 3 నిమిషాల ప్రయాణానికి కూడా గంట పట్టడం మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని. ఇలాంటి స్పందన మా బాధను దూరం చేసిందన్నారు మిథాలీ. ఫలితంతో సంబంధం లేకుండా దేశమంతా మా వైపు నిలబడటం నా జీవితంలో ఇదే మొదటిసారి. ఓడినా దేశం గర్వపడేలా ప్రదర్శన ఇచ్చామని అంతా చెప్పారు. మా అమ్మాయిలు అందరూ ఆ సమయంలో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారన్నారు. 2005లో కూడా మేం ఇలాగే ఫైనల్‌ చేరాం… కానీ అప్పుడు ఎలా తిరిగొచ్చామో, అసలు మమ్మల్ని ఎవరు పలకరించారో కూడా గుర్తు లేదన్నారు.

హైదరాబాద్‌లో కూడా నాకు మొదటిసారి ఈ తరహాలో స్వాగతం దక్కింది. ప్రభుత్వ అధికారులే నేరుగా ఎయిర్ పోర్టు నుంచి సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు తీసుకువెళ్లారు. ఆయన చాలా ఆత్మీయంగా పలకరించి నువ్వు హైదరాబాద్‌ బిడ్డవు అనడం చాలా గర్వంగా అనిపించిందని తెలిపారు. అంతే కాదు నగదు ప్రోత్సాహకం, ఇంటి స్థలం ఇవ్వడం తాను ఊహించలేదన్నారు. నిజానికి నాకు గతంలో హామీ ఇచ్చిన ఇంటి స్థలం గురించి  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమయంలోనే ప్రయత్నాలు చేసీ చేసీ ఇక నా వల్ల కాదని వదిలేశానని తెలిపారు. మా అమ్మను కూడా అడగడం మానేయమని చెప్పేశానన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ మూడేళ్లలో దాని గురించి మళ్లీ నా అంతట నేను ఒక్కసారి కూడా ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు సీఎం దానిని ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు.

తాను క్రికెట్‌ మొదలు పెట్టినప్పుడు ఇంత ముందుకు వెళతానని ఏనాడూ ఊహించలేదని తెలిపారు. 18 ఏళ్ల కెరీర్‌ను చూస్తే చాలా గర్వంగా అనిపిస్తోందన్నారు. అత్యధిక పరుగుల రికార్డు, 6 వేల పరుగులు దాటిన తొలి ప్లేయర్ కావడం, వరుసగా 7 అర్ధ సెంచరీలు చాలా సంతోషాన్ని కలిగించాయి.

ఇంత మంచి ప్రదర్శన తర్వాత ప్రపంచకప్‌ గెలిచి ఉంటే బాగుండేదన్నారు మిథాలీ రాజ్. ఈ టోర్నీ ప్రారంభమైన నాటి నుంచి ఇదే నా చివరి ప్రపంచ కప్‌ అని పదే పదే చెబుతూ వచ్చాను. కానీ ఇప్పుడు మళ్లీ ఆలోచించాను. ఈ విషయంలో నేనే తొందరపడి వ్యాఖ్యానించానేమో అనిపిస్తోంది. ఫామ్, ఫిట్‌నెస్‌ చూస్తే నేను కనీసం 2–3 ఏళ్లు సునాయాసంగా ఆడగలనని తెలిపారు.
ఐపీఎల్‌లాంటి టోర్నీ ఉంటే నిజంగా బాగుంటుందన్న మిథాలీ…దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐనే అన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy