ప్రపంచ రక్తదాతల దినోత్సవం : అన్ని దానాల కన్నా..రక్తదానం మిన్నా

BLOODడబ్బుదానం చేయవచ్చు..అన్నదానం చేయవచ్చుకానీ..అన్ని దానాల కంటే ముఖ్యమైనది రక్తదానం. చావుతో కొట్టుమిట్టాడుతున్న మనిషిని బతికిస్తుంది రక్తం. నేడు జూన్‌ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవం. ఈ సందర్భంగా రక్తం అంటే ఏమిటి.. రక్తదానం ఎలా చేయాలి.. ఎవరు రక్తదానానికి అర్హులు.. రక్తాన్ని దానం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేమిటి అనే విషయాలను తెలుసుకుందాం..రక్త దానం చేయాలంటే చాలామంది ముందుకు రారు. రక్తం తగ్గితే తమ ఆరోగ్యానికి ప్రమాదమని భయపడుతుంటారి. అయితే దీనిపై ప్రతి ఒక్కరిలో అవేర్ నెస్ రావాలి. ఎంత బ్లడ్ బయటికి పోతే అంత ఫ్రెష్ బ్లడ్ మళ్లీ తయారవుతోంది. దీంతో మనిషి మరింత ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో అత్యంత కీలకమైన ద్రవరూప కణజాలం రక్తమే. మొత్తం శరీర బరువులో ఎనిమిది శాతం బరువు రక్తానిదే. రక్తాన్ని పరిశీలించాలనుకుంటే పరీక్ష నాళికలో వేసిన కొంతసేపటికే అది మూడు పొరలుగా విడిపోతుంది. ఈ మూడింటిలో ఎక్కువ మందం ఉన్న పొర, ఎండుగడ్డి రంగులో, పారదర్శకంగా పైకి తేలుతూ కనిపిస్తుంది. దీనిని ప్లాస్మా అంటారు. దీని దిగువన, అతి తక్కువ మందంతో ఉండే తెల్లటి పొర తెల్లరక్త కణాలు. అట్టడుగున దరిదాపు ప్లాస్మా లేయర్‌ ఉన్నంత మందంగానూ ఎర్రటిపొర ఎర్రరక్త కణాలుగా గుర్తించవచ్చు. రక్తంలో మొత్తం 4000 విభాగాలున్నా అందులో ముఖ్యమైనవి నాలుగు మాత్రమే. ఇవి ఎముక మజ్జలో ఎప్పటికప్పుడు తయారవుతుంటాయి.

రక్తం వర్గీకరణ

కారల్‌ ల్యాండ్‌ స్టీనర్‌ అనే వైద్య శాస్త్రవేత్త 1900 సంవత్సరంలో రక్తాన్ని తొలిసారిగా వర్గీకరించాడు. తన పరిశోధనల్లో నాలుగు రక్త వర్గాలను కనుగొన్నాడు. అవి – A, B, AB, O అనే వర్గాలుగా విభజించాడు. ఆ తర్వాత వీటిని మళ్లీ ప్రతి గ్రూపులోనూ నెగిటివ్‌, పాజిటివ్‌ గా వర్గీకరణ చేశారు.

రక్తదానం అంటే

రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడానికి వీలుకాదు. అయితే దాతలు ఎవరైనా సరే రక్తాన్ని దానం చేసి, మరొకరి ప్రాణాలను కాపాడొచ్చు. రోగ నివారణ కోసం, ప్రమాదాల సమయంలో, విపత్కర ఆరోగ్య పరిస్థితుల్లో బాధితుల శరీరంలో రక్తం తగినంతగా లేకపోతే మరొకరి నుంచి రక్తాన్ని ఎక్కిస్తుంటారు. ఇలా ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే విధానమే రక్తదానం. ఇలా రక్తదానం చేయడం కేవలం సేవ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. రక్తాన్ని తీసుకొనే వ్యక్తిని గ్రహీత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు. O గ్రూప్‌ రక్తం కలిగిన వారిని విశ్వదాత అని, AB. గ్రూపుల రక్తం కలిగినవారిని విశ్వగ్రహీత అని అంటారు.

ఎవరి రక్తం ఎవరికి సరిపోతుంది

రక్తం రంగు చూడడానికి అంతా ఒకేలా ఎర్రగా కన్పించినా కొంతమంది రక్తం కొన్ని గ్రూపుల వారికే ఉపయోగపడుతుంది. ఎవరు ఎవరికి రక్తం దానం చేయవచ్చంటే-AB గ్రూప్‌ వారు AB గ్రూప్‌ కి, A గ్రూప్‌ వారు , AB గ్రూపుల వారికి కి, B గ్రూప్‌ వారు B, AB గ్రూపుల వారికి కి, O గ్రూప్‌ వారు A,B, AB, O గ్రూప్‌ల వారందరికి దానం చేయొచ్చు.
అదేవిధంగా ఎవరు ఎవరి నుంచి రక్తం తీసుకోవచ్చంటే AB గ్రూప్‌ వారు అన్ని గ్రూపుల వారి నుంచి. B గ్రూప్‌ వారు B, O గ్రూపుల వారి నుంచి, A గ్రూప్‌ వారు A, O గ్రూపుల వారి నుంచి, O గ్రూప్‌ వారు O గ్రూప్‌ నుంచి మాత్రమే రక్తాన్ని తీసుకోవాలి.

ఎవరు రక్త దాతలు కావొచ్చు

తగినంత ఆరోగ్యంగా ఉంటూ 16 నుంచి 60 సంవత్సరాల వయసుమలోపల ఉన్నవారెవరైనా రక్తదాతలు కావొచ్చు.. 45 కేజీల కంటే అధిక శరీర బరువు కలిగినవారు, రక్తపోటు, నాడీ రేటు, గుండె కొట్టుకునే స్థితి.. సాధారణంగా ఉన్నవారు రక్తాన్ని దానం చేయవచ్చు. ఒక వ్యక్తి ప్రతి 3-4 నెలలకు ఒక్కసారి రక్తాన్ని దానం చేయొచ్చు. 18 ఏళ్లు నిండినవారు జీవిత కాలంలో 168 సార్లు రక్తదానం చేయొచ్చు. ఈ లెక్కన ప్రతిఒక్కరూ 672 మంది ప్రాణాలు కాపాడొచ్చు. రక్తాన్ని సేకరించిన తర్వాత 35 నుంచి 45 రోజుల పాటు నిల్వ చేస్తారు. ఈ రక్తాన్ని మూడు రూపాల్లో విభజిస్తారు. రెడ్‌ సెల్స్‌, ప్లాస్మా, ప్లేట్లెట్స్‌ అనే ఈ మూడు రకాలని ముగ్గురికి వారి వారి అవసరాలను బట్టి అందిస్తారు.

రక్తదానం చేస్తే ఆరోగ్యానికి మేలే

రక్తం అవసరమైనవారికే కాదు దానిని దానం చేసే దాతలకూ ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
-రక్తదాతలకు సాటి మనుషుల ప్రాణాలు కాపాడే అవకాశం లభిస్తుంది. ఇది సాటిలేని సంతృప్తిని ఇస్తుంది.
-రక్తదానం చేసేవారిలో గుండెకు సంబంధించిన రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. తరచూ రక్తదానం చేయడం వల్ల శరీరంలో ఉత్పత్తయ్యే ఇనుము శాతం పూర్తి నియంత్రణలో ఉండడమే దీనికి కారణం.
– రక్తదానం క్యాన్సర్‌ బారిన పడే అవకాశాల్ని దాదాపుగా తగ్గిస్తుంది.
– రక్తదానం చేసేవారికి తమ శరీరానికి సంబంధించిన అనేక రకాలైన రక్త పరీక్షలను పూర్తిగా, ఉచితంగా చేసుకునే అవకాశం దొరుకుతుంది. దీనివల్ల రక్తదానం చేసేవారు తమకు తాము ఆరోగ్యవంతులుగా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకునే సదుపాయం ఉంది.
– రక్తదానం చేయడం వల్ల శరీరంలోని కేలరీలు ఖర్చు అవుతాయి. దీంతో బరువు పెరిగే ప్రమాదం నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.
-కొవ్వు తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండి, శరీరం ఫిట్‌గా ఉంటుంది.
– ఎర్ర రక్తకణాల్లో చెడు, మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడానికి రక్తదానం చాలా ఉపయోగకరం.
– శరీరంలో ఇనుము స్థాయిని సమతుల్యం చేస్తుంది. రక్తంలో ఎక్కువగా ఐరన్‌ ఉంటే గుండెకు హాని చేస్తుంది.
– కార్డియో వాస్కులర్‌ వ్యాధులను నివారించేందుకు రక్తదానం ఉపకరిస్తుంది.
– మహిళల్లో వయస్సు పెరిగిన తర్వాత రుతుస్రావం పూర్తిగా నిలిచిపోయినప్పుడు (మెనోపాజ్‌ సమయంలో) వారి శరీరంలో నిల్వ ఉండే ఐరన్‌ స్థాయిని సమతుల్యం చేసుకోవడానికి రక్తదానం చేయడం చాలా మేలు కలిగిస్తుంది.
అపోహలు అనవసరం.

రక్తం కోసం ప్రతిరోజు ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. తలసేమియాలాంటి డేంజర్ వ్యాధిగ్రస్తులకైతే ప్రతి 15 రోజులకోసారి బ్లడ్ ఎక్కించకపోతే బతకడం కష్టం. సో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి,  సాటి మనిషులను బతికించుకుందాం..

Leave a Reply

Your email address will not be published.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy