కర్ణాటకలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ : 70 శాతం ఓటింగ్

POLINGకర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. సాయంత్రం 6గంటలకు పోలింగ్ ముగిసే సరికి 70శాతం ఓటింగ్ నమోదైంది. 6గంటల తర్వాత కూడా క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశమిచ్చారు. దీంతో ఓటింగ్ శాతంలో కొన్ని మార్పులు జరిగే అవకాశముంది. కొన్ని చోట్ల EVMలలో సమస్యలు వచ్చినప్పటికీ అధికారులు సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను చక్కదిద్దారు. కర్ణాటక అసెంబ్లీలో 224 నియోజకవర్గాలుండగా… శనివారం 222 నియోజకవర్గాల్లోనే పోలింగ్ జరిగింది. జాతీయ పార్టీ అభ్యర్థి మృతితో జయనగర్, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించలేదు. రాజరాజేశ్వరి నగర్ లో ఈ నెల 28న పోలింగ్, 31న కౌంటింగ్ నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

222 నియోజకవర్గాల్లో మొత్తం 2వేల 622 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇందులో 217మంది మహిళా అభ్యర్థులున్నారు. 14వేల 979 ప్రాంతాల్లోని 57వేల 416 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. అన్ని చోట్లా EVMలు, VVPAT మెషీన్లు ఉపయోగించారు. కన్నడ రాజకీయ దిగ్గజాలంతా ఓటు వేశారు. హసన్ జిల్లాలోని హొలెనరాసిపురలో మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ ఓటేశారు. ఆయన కుటుంబసభ్యులు కూడా అక్కడే ఓటు హక్కు వినియోగించుకున్నారు. షిమోగా జిల్లాలోని షికర్ పురాలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యెడ్యూరప్ప ఓటేశారు. బీజేపీ గెలుపు ఖాయమని… మే 19న తాను సీఎంగా ప్రమాణం చేస్తానని చెప్పారు. సీఎం సిద్ధరామయ్య చాముండేశ్వరిలో ఓటు వేశారు. తమ గెలుపు తథ్యమని… మోడీ, అమిత్ షాలను కన్నడ ప్రజలు నమ్మలేదన్నారు. యెడ్యూరప్పకు మతి భ్రమించిందన్నారు సిద్ధరామయ్య. అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు జరిగాయి. హెబ్బల్ నియోజకవర్గంలోని 2వ పోలింగ్ స్టేషన్ లో EVM ఫెయిల్ కావడంతో ఓటింగ్ ఆగిపోయింది. అక్కడ రీపోలింగ్ జరగనుంది.

ఎండ, వర్షం కూడా పోలింగ్ పై ప్రభావం చూపాయి. బాదామీ, కలబుర్గీలో ఎండకు మధ్యాహ్నం పోలింగ్ స్టేషన్ లలో ఓటర్లే కనిపించలేదు. హుబ్లీ, దొడ్డలో వర్షం కారణంగా పోలింగ్ కేంద్రాలు ఖాళీగా కనిపించాయి. చిట్టాపూర్ తాలుకాలోని తర్కాస్ పేట గ్రామస్థులు 3500 మంది ఓటింగ్ ను బహిష్కరించారు. ఇక ధార్వాడ్ లోని కరాడిగుడ్డ పోలింగ్ బూత్ లో పోలింగ్ అధికారులు కాంగ్రెస్ కు ఓటేయాలని ఓటర్లకు చెబుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించడంతో కలకలం రేగింది. అక్కడికి ఎలక్షన్ కమిషన్ అధికారులు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy