ప్రాజెక్టుల నిర్మాణానికి పూర్తి సహకారం : కేసీఆర్

vvతెలంగాణ రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందించడానికి తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్. కరీంనగర్ పర్యటనలో ఉన్న సీఎం (డిసెంబర్-7) బ్యారేజీలు, పంప్ హౌజ్ లు, కాలువల నిర్మాణం, ఏక కాలంలో మూడు షిప్టుల్లో పనులు జరగాలని అధికారులను, వర్క్ ఏజెన్సీ లను సిఎం ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సందర్శించి పనులను పరిశీలించారు.  పర్యటనలో భాగంగా సీఎం…గురువారం ఉదయం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి రెండు హెలిక్యాప్టర్లలో బయలుదేరి తుపాకుల గూడెం బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్, అన్నారం బ్యారేజ్, సిరిపురం పంప్ హౌజ్ లను మధ్యాహ్నం వరకు సందర్శించారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును అధికారులను, వర్క్ ఏజెన్సీలను అడిగి తెలుసుకున్నారు.

ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ఎలాంటి సహకారాన్నైనా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం పేర్కొన్నారు. తుపాకుల గుడెం వద్ద గోదావరి వరద ప్రవాహం గురించి అధికారులను అడిగారు. ప్రస్తుతం 6వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందని అధికారులు వివరించారు. 1132 మీటర్ల కాపర్ డ్యాం నిర్మాణం దాదాపుగా పూర్తి కావొచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. మరో 150 మీటర్లు పూర్తి అయితే మొత్తం కాపర్ డ్యాం నిర్మాణం పూర్తి అవుతుందని అధికారులు వివరించారు. పక్క రాష్ట్రాల అధికారులతో పోలీస్ శాఖకు సంబంధించి ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడాలని డీజీపీ మహేందర్ రెడ్డికి సూచించారు. డ్రోన్ కెమెరాలతో కూడా ప్రాజెక్ట్ ల పనులను పర్యవేక్షిస్తూ భద్రత పరంగా చర్యలు తీసుకుంటున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాజెక్టులకు అవసరమైన రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రాజెక్ట్ లు పూర్తి చేయడమే చాలా ముఖ్యమైన కార్యక్రమం అని ఈ విషయాన్ని అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ లు గమనంలో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు.

సుందిళ్ల బ్యారేజీని, సిరిపురం వద్ద నిర్మిస్తున్న పంప్ హౌజ్ ను, గోలివాడ పంప్ హౌజ్ నిర్మాణం పనులనుపై అధికారులు, ఇంజనీర్లు, వర్క్ ఏజేన్సీలకు పలు సూచనలు చేశారు. బ్యారేజీల నిర్మాణంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం చెప్పారు. గత ఏడాది భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలకు మిడ్ మానేరు డ్యాం వద్ద మట్టి కట్ట కొట్టుకుపోయిన విషయాన్ని సిఎం గుర్తు చేశారు. ఆ చేదు అనుభవాన్ని గుణపాఠంగా స్వీకరించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పనులను పటిష్టం చేయాలని చెప్పారు.

ప్రధాన బ్యారేజీకు కరకట్టలు కలిసే చోటును అత్యంత పటిష్టంగా నిర్మించాలన్నారు. బ్యారేజీ నిర్మాణంతో పాటు గోదావరికి రెండు వైపులా రవాణా సౌకర్యం అందించేందుకు వీలుగా డబుల్ లేన్ రోడ్డు వేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది వర్షాలు వచ్చే లోపు పంప్ హౌజ్ ల నిర్మాణం పూర్తి కావాలని చెప్పారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను కూడా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం కేసీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy